విటిలిగో విన్నర్
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:23 AM
బొల్లితో నాలుగు గోడలకే పరిమితమైపోయిన ఒక యువతి, నలుగురి దృష్టినీ ఆకర్షించే మోడల్‌గా మారింది. సమాజం వెక్కిరింతలనూ, బంధువుల అవహేళనలనూ...
విజేత
బొల్లితో నాలుగు గోడలకే పరిమితమైపోయిన ఒక యువతి, నలుగురి దృష్టినీ ఆకర్షించే మోడల్‌గా మారింది. సమాజం వెక్కిరింతలనూ, బంధువుల అవహేళనలనూ విజయ సోపానాలుగా మలుచుకున్న రాజస్థాన్‌కు చెందిన ఆయుషి ఉపాధ్యాయ విటిలిగో విజయగాథ ఇది.
19 ఏళ్ల వయసులో ముఖం మీద తెల్లని మచ్చ తలెత్తినప్పుడు ఆయుషి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. క్రమేపీ ఆ మచ్చ రూపాన్ని మార్చుకుంది. దాంతో పాటే ఆయుషి చుట్టూరా ఉన్న ప్రపంచం కూడా మారిపోయింది. అపరిచితులు ఆమెను వింతగా చూడడం మొదలుపెట్టారు. బంధువులు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. అలా అప్పటివరకూ ఒక పేరు, వ్యక్తిత్వం, గుర్తింపు కలిగిన ఆయుషి ఒకేసారి వాటన్నిటినీ కోల్పోయి, ‘విటిలిగో అమ్మాయి’గా మారిపోయింది.
ప్రజల స్పందనే పెద్ద సమస్య
అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుని, ‘నేను నిజంగానే అందంగా ఉన్నానా?’ అని నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. అందరూ నా కంటే ముందు నా విటిలిగోను చూడడం మొదలుపెట్టారు. ప్రతి వేడుక నరకంగా మారిపోయింది. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ‘నీ ముఖానికేమైంది?’ అని ప్రశ్నించడం కోసమే ఆ వేడుకకు వచ్చారా? అన్నట్టు ప్రవర్తించేవారు. ఇంకొందరు ‘ఈ అమ్మాయినెవరు పెళ్లి చేసుకుంటారు?’ అనే మాటలతో కుళ్లబొడిచేవారు. దాంతో ఆ బాధ నుంచి తప్పించుకోవడం కోసం బాహ్య సమాజం నుంచి తప్పుకుని, ఇంటికే పరిమితమైపోవడం మొదలుపెట్టాను. అద్దం అన్నిటికంటే పెద్ద శత్రువుగా మారిపోయింది. నిజం చెప్పాలంటే విటిలిగో కంటే, నా చుట్టూ ఉన్న ప్రజల వల్లే నేను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను. నాకున్న ఆరోగ్య పరిస్థితికి మించి, ప్రజల స్పందన పెద్ద సమస్యగా మారింది’’ అంటూ ఓ సందర్భంలో మీడియాతో తన ఆవేదనను పంచుకుంది ఆయుషి.
మానుషి చిల్లర్ స్ఫూర్తితో
ప్రతి ఒక్కరి జీవితంలో అకస్మాత్తుగా ఒక మార్పు చోటుచేసుకుంటుంది. ఆయుషి జీవితంలో ఆ మార్పు అద్దంతోనే మొదలైంది. నెలల తరబడి అద్దానికి దూరంగా ఉండిపోయిన ఆమె, అద్దంలో తనను తాను జాగ్రత్తగా పరిశీలించుకుంది. చటుక్కున అద్దం నుంచి తప్పుకోకుండా ‘నాకు విటిలిగో ఉంది, అయినా నేను అందంగానే ఉన్నాను’... అంటూ ప్రతిబింబంతో మాట్లాడింది. ఆ మాటే ఆమె కొత్త జీవితానికి సోపానంగా మారింది. అలా ఆయుషి నెమ్మదిగా బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది. అదే సమయంలో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్‌గా విజయం సాధించిన వార్తలు చూసి, తాను కూడా మోడల్‌గా ఎదగాలని నిర్ణయం తీసుకుంది. అలా రాజస్థాన్‌లో సూపర్‌మోడల్ అందాల పోటీలకు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఎక్కడో ఏదో అనుమానం. విటిలిగో ఉన్న అమ్మాయికి ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందో లేదోనని అనుమానించి, పోటీల నిర్వాహకులను సంప్రతించింది. వాళ్లు పచ్చ జెండా ఊపడంతో రెట్టింపు ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని, రన్నర్‌పగా గుర్తింపు తెచ్చుకుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న వేల మంది విటిలిగో బాధితులందరూ ఆమెలో తమను తాము చూసుకున్నారు. ఉత్తరాలు, ఇమెయిల్స్‌తో ఆయుషిని సంప్రతించి, ఆమె నుంచి పొందిన స్ఫూర్తితో, ప్రోత్సాహంతో బాహ్య ప్రపంచంలో కొత్త జీవితాలను మొదలుపెట్టారు.
లెక్కలేనన్ని అవమానాలు
‘విటిలిగోతో అయినవాళ్లు, కానివాళ్లు అనే తేడా లేకుండా అందరి నుంచీ అవమానాలను ఎదుర్కొన్నాను. ఒక సందర్భంలో నా కజిన్, తన కొడుకుకున్న మ్యాగీ అలవాటును మాన్పించడం కోసం, ‘అదే పనిగా మ్యాగీ తింటే, నువ్వు కూడా ఆయుషిలా తయారవుతావు’ అంటూ బెదిరించడం నేను చూశాను. ఇలాంటి అవహేళనలన్నీ మొదట్లో నన్నెంతో కుంగదీశాయి. అయితే కుటుంబం తోడ్పాటుతో క్రమేపీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలిగాను. నాకున్న లోపాన్నే సద్వినియోగం చేసుకుని మోడల్‌గా ఎదిగాను. వేల మంది విటిలిగో బాధితులు నా నుంచి పొందిన ప్రేరణతో, సమాజంలో తమను తాము నిరూపించుకోవడం నాకెంతో గర్వంగా ఉంది. విటిలిగో ఒక చర్మ సమస్య మాత్రమే, జీవిత సమస్య కాదు అనే విషయాన్ని బాధితులందరూ గ్రహించాలి’’ అని అంటోంది విటిలిగో విన్నర్ ఆయుషి ఉపాధ్యాయ.
ఈ వార్తలనూ చదవండి: