భావోద్వేగాలకు ఆయుర్వేద శుద్ధి!
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:41 AM
చంచల ఆలోచనలు, కుదేలు చేసే భావోద్వేగాలు, కుంగదీసే ఒత్తిళ్లు.... మనసుతో పాటు, శరీరాన్నీ అతలాకుతలం చేస్తాయి. వీటి మూలాల ఆధారంగా, సమస్యను చక్కదిద్దే విధానాలను, నియమాలను అనుసరించాలని ఆయుర్వేదం చెప్తోంది....
కౌన్సెలింగ్
డాక్టర్! మానసిక ఒత్తిడికి, గందరగోళానికీ ఆయుర్వేద చికిత్సతో ఫలితం ఉంటుందా? మానసిక రుగ్మతలకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద చికిత్సలు, ఫలితాల గురించి వివరించండి?
ఓ సోదరి, హైదరాబాద్
చంచల ఆలోచనలు, కుదేలు చేసే భావోద్వేగాలు, కుంగదీసే ఒత్తిళ్లు.... మనసుతో పాటు, శరీరాన్నీ అతలాకుతలం చేస్తాయి. వీటి మూలాల ఆధారంగా, సమస్యను చక్కదిద్దే విధానాలను, నియమాలను అనుసరించాలని ఆయుర్వేదం చెప్తోంది. అవేంటంటే...
నాసిక ద్వారా...
ప్రాచీన ఆయుర్వేద చికిత్సా విధానం ‘నశ్యం’ ద్వారా మూలికలతో తయారైన నూనెలను ముక్కులోకి పీల్చవలసి ఉంటుంది. ఈ విధానం మెదడులోని లింఫాటిక్ ద్రవాలైన ‘రసాలను’, పుర్రెలోని ఖాళీ ప్రదేశాలను (సైనస్) శుభ్రపడతాయి. మెదడులోని స్రావాలు మెడలోని లింఫాటిక్ నాళాలు, ముక్కుతో సంబంధం ఉన్న సైన్‌సల ద్వారా వెలుపలకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నశ్య చికిత్సతో ఈ ద్రవాలు బయటకు వెళ్లిపోయి మెదడు మీద ఒత్తిడి తొలగి మానసకి ప్రశాంతత, భావోద్వేగాలు నెమ్మదించి, కంటి నిండా నిద్ర పడుతుంది.
నిద్ర శుద్ధి!
మెదడు నుంచి స్రావాలను విసర్జించే ‘గ్లింఫాటిక్ వ్యవస్థ’, ఒక పక్కకు తిరిగి నిద్రపోతే మెరుగ్గా జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి తగిన సమయం పాటు ఒక పక్కకు ఒత్తిగిలి పడుకునే అలవాటు చేసుకోవాలి. పెందలకడనే పడుకుని, పెందలకడనే నిద్ర లేవడం అనేది పాతకాలపు అలవాటే అయినా, దాని వల్ల ఆరోగ్య ప్రయోజనం ఉందనే విషయం మర్చిపోకూడదు. త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేచేవారిని అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారితో పోల్చినప్పుడు శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ నియంత్రణ నియమిత నిద్రవేళలు పాటించే వారిలో నియంత్రణలో ఉన్నట్టు అధ్యయనాల్లో రుజువైంది.
ప్రాణాయామం ద్వారా శుద్ధి!
దీర్ఘ శ్వాస ప్రక్రియ ద్వారా కూడా మెదడు నుంచి విసర్జక ద్రవాలు బయటకు వెళ్లిపోతాయి. ఆవిరి పీల్చడం ద్వారా కూడా సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ మెదడు నుంచి బయటకు త్వరితంగా వెళ్తుందని అధ్యయనాల్లో రుజువైంది. ఫైట్ ఆర్ ఫ్లయిట్ సంబంధ ఒత్తిడి (ప్రమాదం ఎదురైనప్పుడు దాంతో పోరాడే లేదా పలాయనం చిత్తగించే చర్యకు తోడ్పడే హార్మోన్ల వేగమైన విడుదల) కూడా మెదడు ద్రవాల విసర్జనను ప్రభావితం చేస్తుంది. శ్వాస సంబంధిత వ్యాయామాలు, యోగాభ్యాసాలు గ్లింఫాటిక్ వ్యవస్థకు తోడ్పడతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
కపాలభాతి, ప్రాణాయామం
‘కపాలభాతి’ ప్రత్యేకంగా తర్పక కఫ శుద్ధి గురించే తయారైనది. కపాలం అంటే ‘పుర్రె’, భాతి అంటే ‘ప్రకాశవంతం’ అని అర్థం. కపాలభాతిలో పొత్తికడుపు నుంచి ఊపిరి పుర్రెకు నేరుగా చేరి, మెదడు నుంచి విసర్జకాల విసర్జనకు తోడ్పడేలా ఈ విధానం రూపొందింది. కపాలభాతి సాధనతో మెదడు గ్లింఫాటిక్ వ్యవస్థ నుంచి విసర్జకాలు తేలికగా వెలుపలికి వెళ్లగొట్టబడతాయి. దాంతో మానసిక సాంత్వన, ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలిగే సామర్ధ్యాలు పెరుగుతాయి.
డాక్టర్ రామేశ్వర్,
ఆయుర్వేద వైద్యులు, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్
మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త