Share News

కంచే చేను మేస్తే...

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:27 AM

మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున నాడీ వ్యవస్థ మీద దాడి చేసినప్పుడు ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ తలెత్తుతుంది. అయితే తప్పుదారి పట్టించే లక్షణాల మీద...

కంచే చేను మేస్తే...

ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌

మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున నాడీ వ్యవస్థ మీద దాడి చేసినప్పుడు ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ తలెత్తుతుంది. అయితే తప్పుదారి పట్టించే లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచి, సత్వర చికిత్స తీసుకోగలిగితే ఈ సమస్యను శాశ్వతంగా నివారించుకోవచ్చని అంటున్నారు వైద్యులు.

మన ఆరోగ్యానికి రక్షణ కల్పించవలసిన రోగనిరోధక వ్యవస్థ కొన్ని సందర్భాల్లో మన మీదే తిరగడబడుతుంది. ఫలితంగా ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ వేధిస్తాయుయి. అయితే ఇలాంటి పరిస్థితి పూర్తిగా అరుదు అని అనుకోడానికి కూడా వీల్లేదు. ప్రధానంగా మెదడు, వెన్నుపాము, మైలీన్‌, పెరిఫెరల్‌ నాడులు, నాడీకండర కూడలితో పాటు కొన్ని సందర్భాల్లో కండరాల మీద కూడా మన రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. దాంతో పలు రకాల రుగ్మతలు వేధిస్తాయి. వీటిలో చాలా రుగ్మతలు చికిత్సతో నయం చేయదగినవే! కొన్ని రుగ్మతలను ప్రారంభంలోనే గుర్తించగలిగితే పూర్తిగా నయం చేసే వీలుంటుంది. అయితే సమస్యను సకాలంలో గుర్తించలేక, చికిత్సను ఆలస్యం చేస్తే, శాశ్వత నాడీ సంబంధ వైకల్యంతో పాటు, కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌, శ్వాస వైఫల్యం లేదా కొన్ని తీవ్రమైన సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. కాబట్టి ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ను సకాలంలో గుర్తించడం అవసరం.

పలు రూపాల్లో...

ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ను... కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ వ్యాధులుగా విభజించారు. రోగనిర్థారణ ప్రక్రియ ఆధారంగా ఆయా వ్యాధుల చికిత్సా వ్యూహాలను వైద్యులు అంచనా వేస్తారు. మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థకు చెందిన ఆటో ఇమ్యూన్‌ నాడీ సంబంధ వ్యాధులు ప్రధానంగా...

  • మల్టిపుల్‌ స్ల్కెలోరిస్‌

  • ఆటో ఇమ్యూన్‌ ఎన్‌సెలఫలైటిస్‌

  • న్యూరోమైలైటిస్‌ ఆప్టికా స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌

  • ఎమ్‌ఒజి యాంటీబాడీ అసోసియేటెడ్‌ డిసీజ్‌

  • ఆటో ఇమ్యూన్‌ సిఎన్‌ఎస్‌ వాస్క్యులైటిస్‌

  • ఆటో ఇమ్యూన్‌ సెరెబెల్లైటిస్‌ అండ్‌ స్టిఫ్‌ పర్సన్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్స్‌

    పరిధీయ నాడీ వ్యవస్థ, నర్వ్‌ రూట్స్‌

  • గులియన్‌ బార్‌ సిండ్రోమ్‌

  • క్రానిక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిమైలినేటింగ్‌ పాలీరాడిక్యులోన్యూరోపతి

  • వాస్క్యులైటిక్‌ న్యూరోపతి

  • మయాస్థీనియా

  • నాడీకండర కూడలి, కండరాలు

  • మయాస్థీనియా గ్రావిస్‌

  • లాంబర్ట్‌-ఈటన్‌ మయోస్థినిక్‌ సిండ్రోమ్‌

  • ఇన్‌ఫ్లమేటరీ మయోపథీస్‌ (డెర్మటోమయోస్టైటిస్‌, ఇమ్యూన్‌ మీడియేటెడ్‌ నెక్రోటైజింగ్‌ మయోపతి)


ఈ రుగ్మతలన్నీ ఒకే పనితీరును కలిగి ఉండవు. కొన్ని యాంటీబాడీల వల్ల, మరికొన్ని టి కణాల ద్వారా ప్రేరేపితమవుతాయి. ఇంకొన్ని ఇమ్యూన్‌ కాంప్లెక్స్‌లు, రక్తనాళాల ఇన్‌ఫ్లమేషన్‌లను కలిగి ఉంటాయి.

ప్రధాన కారణాలు ఇవే!

ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌కు పలు కారణాలుంటాయి. అవేంటంటే...

జన్యువులు: కొన్ని రోగనిరోధక నియంత్రణ జన్యువులు ఆటో ఇమ్యూన్‌ రుగ్మతల ముప్పును పెంచుతాయి. కానీ వ్యాధి వృద్ధి చెందుతుందా లేదా అన్నది నిర్థారించలేవు.

ఇన్‌ఫెక్షన్లు: కొన్ని ఇన్‌ఫెక్షన్లు అసాధారణ వ్యాధినిరోధక స్పందనను ప్రేరేపిస్తాయి.

పరమాణు అనుకరణ: ఇన్‌ఫెక్షన్‌తో ఉత్పత్తయిన యాంటీబాడీలు నాడీ కణాల విడిభాగాలతో ప్రతిచర్య జరుపుతాయి.

ఇమ్యూన్‌ టాలరెన్స్‌: రోగనిరోధక వ్యవస్థ సొంత యాంటీజెన్స్‌నే లక్ష్యాలుగా భావించడం మొదలుపెడుతుంది.

క్యాన్సర్‌తో ముడిపడిన ఆటోఇమ్యూనిటీ: కొన్ని రకాల కణుతులు నాడీ యాంటీజన్లకు వ్యతిరేకంగా యాంటీబాడీలను, రోగనిరోధక ఆటోఇమ్యూనిటీని ప్రేరేపిస్తాయి.

మందులు, ఇమ్యునో థెరపీలు: ఇమ్యూన్‌ చెక్‌పాయింట్‌ ఇన్హిబిటర్స్‌, కొన్ని రకాల మందులు నాడీసంబంధ ఆటోఇమ్యూనిటీని ప్రేరేపిస్తాయి.

పర్యావరణ అంశాలు: ధూమపానం, ఎండకు బహిర్గతం అవకపోవడం/విటమిన్‌ డి లోపం కూడా ఆటో ఇమ్యూన్‌ ప్రేరేపణకు దోహదపడుతుంది.

లక్షణాలు ఇలా...

నాడీ వ్యవస్థలో దెబ్బతిన్న ప్రదేశం మీదే లక్షణాలు, వాటి తీవ్రతలు ఆధారపడి ఉంటాయి.

మెదడు ఇన్‌ఫ్లమేషన్‌: అయోమయం, మతిమరుపు, ప్రవర్తనా మార్పులు, మూర్ఛలు, అసాధారణ కదలికలు, చిత్తభ్రమలు, నిద్ర సమస్యలు.

కంటి నాడి, వెన్నుపాము: నొప్పితో కూడిన దృష్టిలోపం, రంగులు చూడలేకపోవడం, అవయవాల బలహీనత, కండరాలు బిగుసుకుపోవడం, మూత్రాశయ పనితీరు దెబ్బతినడం లేదా పేగుల పనితీరు క్రమం తప్పడం.

పెరిఫెరల్‌ నాడులు, రూట్స్‌: కాళ్లు, చేతుల్లో బలహీనత, తిమ్మిర్లు, మొద్దుబారడం, నొప్పి, కదలికలు తగ్గడం.

నాడీకండర కూడలి: ఫాటిజబుల్‌ టోసిస్‌, డిప్లోపియా, ముక్కుతో మాట్లాడడం, నమలడంలో ఇబ్బంది, డిస్‌ఫాజియా, మెడ బలహీనత లేదా శ్వాస కండరాల బలహీనత.


4-navya.jpg

వ్యాధి నిర్ధారణ కీలకం

ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ లక్షణాల కాలాన్నీ, రుగ్మత తీవ్రతనూ కచ్చితంగా అంచనా వేయడం కీలకం. అలాగే తాజాగా తలెత్తిన జీర్ణసంబంధ లేదా శ్వాస సంబంధ ఇన్‌ఫెక్షన్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే వ్యాక్సిన్లు, తాజాగా మొదలుపెట్టిన కొత్త మందులు లేదా ఇమ్యూన్‌ చెక్‌పాయింట్‌ ఇన్హిబిటర్‌ థెరపీని కూడా అనుమానించాలి. గతంలో ఆటో ఇమ్యూన్‌ రుగ్మతకు గురైన వారికి మళ్లీ సమస్య తిరగబెట్టే అవకాశం ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ చరిత్రలో ఈ రుగ్మత లేదని నిర్థారించుకోవాలి. శ్వాస తీసుకోవడం, మింగడం కష్టమవుతున్నా ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌గా అనుమానించవచ్చు. అలాగే రుగ్మతను నిర్థారించుకోవడం కోసం కొన్ని పరీక్షలు కూడా అవసరమవుతాయి.

ఎమ్మారై: మెదడు, వెన్నుపాము

సిఎస్ఎప్‌ పరీక్ష: కణాల సంఖ్య, ప్రొటీన్‌, గ్లూకోజ్‌, ఆలింగోక్లోన్‌ బ్యాండ్స్‌ పరీక్షించే పరీక్ష ఇది. నర్వ్‌ కండక్షన్‌ స్టడీస్‌, ఈమ్‌జి

రక్త పరీక్షలు: వ్యాధితో ముడిపడిన యాంటీబాడీలు, ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను గుర్తించవచ్చు

సమర్థ చికిత్సలున్నాయి

రుగ్మతతో మరింత ఆరోగ్య నష్టం జరగకుండా నియంత్రించడంతో పాటు, వ్యాధి తీవ్రమవకుండా, భవిష్యత్తులో తిరగబెట్టకుండా అందించే చికిత్సతో పాటు, దెబ్బతిన్న నాడీ పనితీరును పునరుద్ధరించడం ప్రధానంగా చికిత్స కొనసాగుతుంది. ఈ చికిత్సలో భాగంగా అనేక సిఎన్‌ఎస్‌ ఇన్‌ఫ్లమేటరీ రుగ్మతలకు స్టిరాయిడ్స్‌ను వాడతారు. అలాగే మెదడు, సిఎన్‌ఎస్‌ ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ అయిన మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ కోసం అత్యధిక మోతాదుల్లోని కార్టికోస్టిరాయిడ్స్‌ ఇవ్వవలసి వస్తుంది. కొందరి ప్లాస్మా మార్పిడి అవసరమవుతుంది. వ్యాధికి తగినట్టు రూపొందించిన చికిత్సలతో కూడా సత్ఫలితాలను సాధించవచ్చు.


నివారణోపాయాలు

ఆటోఇమ్యూన్‌ నాడీ రుగ్మతలను నివారించడానికి ఎలాంటి మార్గాలనూ ఇప్పటివరకూ నిర్ధారించలేకపోయినప్పటికీ ఈ రుగ్మతను ప్రేరేపించే కారకాల మీద కన్నేసి ఉంచి, తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఇన్‌ఫెక్షన్లను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. చికిత్సలో తలెత్తే సమస్యలను సత్వరమే సరిదిద్దుకోవాలి. వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడం కోసం చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార తయారీలో జాగ్రత్తలు పాటించాలి. అవసరమైన వ్యాక్సిన్లు వేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ, సమతులాహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. విటమిన్‌ డి లోపం తలెత్తకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటంటే....

  • కొత్తగా చేతులు, కాళ్లలో బలహీనత తలెత్తి, సమస్య తీవ్రమవుతూ ఉండడం

  • శ్వాస తీసుకోలేకపోవడం, దగ్గు, మింగడంలో ఇబ్బంది

  • అయోమయం, మూర్ఛలు, స్పృహ తగ్గడం, ప్రవర్తనా మార్పులు

  • దృష్టి లోపాలు

  • హృదయ స్పందన, రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు

గుండెపోటు, ఇన్‌ఫెక్షనన్‌, స్పైనల్‌ కంప్రెషన్‌ లేదా ఇతరత్రా అత్యవసర ఆరోగ్య సమస్యల్లో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వాటన్నిటినీ ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌తో ముడి పెట్టకుండా వెంటనే అప్రమత్తం కావాలి.

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 27 , 2026 | 05:28 AM