Share News

అడవి నుంచి అక్షరానికి..

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:32 AM

అస్సాంలోని పచ్చని అడవులు.. తేయాకు తోటల మధ్య ఓ నిశ్శబ్ద విప్లపం జరుగుతోంది. అక్కడి అడవి దారుల్లో వ్యర్థాలుగా పడి ఉండే ఏనుగులు, ఖడ్గమృగాల పేడ ఇప్పుడు ‘నల్లబంగారం’గా...

అడవి నుంచి అక్షరానికి..

అస్సాంలోని పచ్చని అడవులు.. తేయాకు తోటల మధ్య ఓ నిశ్శబ్ద విప్లపం జరుగుతోంది. అక్కడి అడవి దారుల్లో వ్యర్థాలుగా పడి ఉండే ఏనుగులు, ఖడ్గమృగాల పేడ ఇప్పుడు ‘నల్లబంగారం’గా మారింది. ఎవరూ ఊహించని ఓ అసాధారణ ఆలోచన.. ఓ తండ్రీకూతుళ్ల పట్టుదల వందలమంది గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మానవులకు, వన్యప్రాణులకు మధ్య తరతరాలుగా ఉన్న సంఘర్షణకు స్వస్తి పలికి.. సహజీవనానికి సరికొత్త బాటలు వేస్తున్నారు నిషా బోరా.

‘‘నేను దాదాపు 17 ఏళ్లపాటు ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో కార్పొరేట్‌ ప్రపంచంలో మునిగిపోయాను. మార్కెట్‌ రీసెర్చ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో హై ప్రొఫైల్‌ ఉద్యోగం, మంచి జీతం, ఆధునిక జీవనశైలి.. అన్నీ ఉన్నాయి. కానీ ఏదో తెలియని వెలితి. నా మూలాలను, నా నేలను వదిలి వచ్చాననే భావన నన్ను వెంటాడుతూ ఉండేది. సరిగ్గా అదే సమయంలో మా నాన్న మహేశ్‌చంద్ర బోరా నుంచి పిలుపు వచ్చింది. ఆయన రిటైర్డ్‌ మైనింగ్‌ ఇంజినీర్‌.

ఆయన మనసులో మెదిలిన ఓ చిన్న ఆలోచన ఇప్పుడు మా జీవితాలను, మరెందరో గ్రామీణుల బతులకులను మార్చేసింది. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నా కార్పొరేట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికి మా సొంతగడ్డ అస్సాంకు తిరిగి వచ్చేశాను’’ అంటూ తన ప్రయాణాన్ని వివరించారు నిషా.

విమానంలో మొలకెత్తిన ఆలోచన

ఓసారి నిషా తండ్రి మహేశ్‌చంద్ర బోరా విమానంలో ప్రయాణిస్తున్నారు. కాలక్షేపం కోసం ఓ మ్యాగజైన్‌ తిరగేస్తుండగా, రాజస్థాన్‌లోని ఓ చిన్న గ్రామంలో ఏనుగు పేడతో కాగితం తయారుచేస్తున్నారనే ఆర్టికల్‌ ఆయన కంటపడింది. ఆ క్షణం ఆయన మదిలో ఒక మెరుపు మెరిసింది. ‘‘రాజస్థాన్‌లో కొన్ని వందల ఏనుగులు ఉంటేనే ఇది సాధ్యమైనప్పుడు.. వేలాది ఏనుగులు, ప్రపంచంలోనే అరుదైన ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు పుట్టినిల్లయిన మన అస్సాంలో ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు?’’ అనే ఆలోచన ఆయన మదిలో పడింది. అది మొలకెత్తి, మహావృక్షంలా మారేదాకా ఆయనకు నిద్రపట్టనివ్వలేదు.


ఎల్‌రైనో ఆవిర్భావం

మహేశ్‌చంద్ర వ్యక్తిగత ప్రాజెక్టుగా మొదలైన ఈ ప్రయోగం.. ఆయన కుమార్తె నిషా రాకతో ఓ వ్యవస్థీకృత వ్యాపార ఆలోచనగా రూపుదిద్దుకుంది. ‘‘నాన్నకు సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణంపై ప్రేమ ఉన్నాయి. నాకు కార్పొరేట్‌ అనుభవం, మార్కెటింగ్‌ వ్యూహాలు తెలుసు. ఇద్దరి బలాలు కలిస్తే అద్భుతాలు చేయొచ్చని అనిపించింది’’ అంటారు నిషా. అలా 2014లో తండ్రీకూతుళ్లు కలిసి అధికారికంగా ‘ఎల్‌రైనో ఎకో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను ప్రారంభించారు. ఎలిఫెంట్‌ నుంచి ‘ఈఎల్‌’.. రైనో నుంచి ‘ఆర్‌హెచ్‌ఐఎన్‌వో’ తీసుకుని ‘ఎల్‌రైనో’ అని నామకరణం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, ఆర్థిక స్వావలంబన అనే మూడు సూత్రాలే లక్ష్యంగా వారి ప్రస్థానం మొదలైంది.

4-navya.jpg

పేడ నుంచి కాగితం తయారీ

ఈ ప్రక్రియ చూడటానికి వింతగా ఉన్నా పూర్తిగా పర్యావరణ హితమైనది. గ్రామస్థుల నుంచి ఎండిన ఏనుగు, ఖడ్గమృగం పేడను కిలోల లెక్కన కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత దానిని శుభ్రం చేసి అందులోని క్రిములన్నీ నశించే వరకు కొన్ని గంటలపాటు ఉడకబెడతారు. అది మెత్తని గుజ్జుగా మారాక సహజమైన రంగులు కలిపి కాగితాన్ని తయారుచేస్తారు. ఈ కాగితంతో నోట్‌బుక్స్‌, డైరీలు, జర్నల్స్‌, పేపర్‌ బ్యాగులు, ఫొటో ఫ్రేమ్‌లు, ల్యాంప్‌షేడ్స్‌ వంటి 200కుపైగా రకాల ఉత్పత్తులను తయారుచేస్తున్నారు.

ఉపాధి.. వన్యప్రాణి సంరక్షణ

అస్సాంలోని అనేక గ్రామాల్లో పంట పొలాలపై ఏనుగుల దాడులు సర్వసాధారణం. దీంతో గ్రామస్థులు వాటిని శత్రువులుగా, తమ జీవనాధారాన్ని దెబ్బతీసేవిగా చూసేవారు. కానీ ‘ఎల్‌రైనో’ వచ్చాక పరిస్థితి మారింది. వారు గ్రామస్థుల నుంచే పేడ కొనడం మొదలుపెట్టాక, వారికి అది ఒక అదనపు ఆదాయ మార్గంగా మారింది. ‘‘ఒకప్పుడు ఏనుగులు వస్తే పంట పోయిందని ఏడ్చేవాళ్లం. ఇప్పుడు వాటి పేడ మాకు నెలకు కొన్ని వేల రూపాయల అదనపు ఆదాయం తెచ్చిపెడుతోంది. వాటిని కాపాడుకుంటనే మాకు ఉపాధి దొరుకుతుందని గ్రహించాం’ అని గ్రామస్థులు చెబుతుండటం వారిలో వచ్చిన మార్పుకు నిదర్శనం. మానవ.. వన్యప్రాణి సంఘర్షణను వారు ఇలా సహజీవనంగా మార్చడంలో విజయం సాధించారు.

‘‘ఒక ఆలోచన వింతగా అనిపించొచ్చు.. కానీ అటవీదారుల్లో వ్యర్థాలుగా పడి ఉండే పేడతో కూడా ఒక నోట్‌బుక్‌ కథ మొదలవుతుందని, దాని వెనుక వందలమంది జీవితాలు ముడిపడి ఉంటాయని మేము ఇప్పుడు గర్వంగా చెబుతున్నాం’’ అంటారు నిషా బోరా.


వంటిల్లే ప్రయోగశాలగా..

రిటైర్మెంట్‌ తర్వాత వచ్చిన తీరిక సమయాన్ని మహేశ్‌ చంద్ర పూర్తిగా ఈ ఆలోచనపైనే కేంద్రీకరించారు. ఏనుగులు, ఖడ్గమృగాలు భారీగా గడ్డి, ఆకులు, చెట్ల బెరళ్లు తింటాయని, వాటి జీర్ణవ్యవస్థ వాటిని పూర్తిగా జీర్ణం చేసుకోలేదని ఆయన శాస్త్రీయంగా తెలుసుకున్నారు. అందుకే, వాటి పేడలో కాగితం తయారీకి అత్యవసరమైన ఫైబర్‌ (పీచు) పుష్కలంగా ఉంటుందని గ్రహించారు. వెంటనే ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. దీనికోసం పెద్దపెద్ద ల్యాబ్‌ల అవసరం రాలేదు. తన ఇంటి వంటగదినే ప్రయోగశాలగా మార్చుకున్నారు. రోజూ వాడే మిక్సీ గ్రైండర్‌, పాత కిటికీలకు ఉన్న తెరలు, ఇంట్లోని బకెట్లే ఆయనకు పరికరాలయ్యాయి. ఎన్నో వైఫల్యాలు, మరెన్నో ప్రయోగాలు.. కొన్నిసార్లు పేడ వాసన భరించలేకపోవడం, కొన్నిసార్లు గుజ్జు సరిగా రాకపోవడం వంటి ఎన్నో అడ్డంకులను ఆయన పట్టుదలతో అధిగమించారు. చివరికి ఆయన శ్రమ ఫలించి.. చేతితో చేసిన మొట్టమొదటి కాగతం షీట్‌ రూపుదిద్దుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

Updated Date - Nov 16 , 2026 | 03:34 AM