వేట ఇప్పుడే మొదలైంది
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:07 AM
పుట్టింది సాధారణ రైతు కుటుంబం... అడుగడుగునా ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు... అయినా కలలను వెంటాడడం ఆపలేదు. లక్ష్యం నుంచి గురి మరల్చలేదు. ప్రస్తుత ఆసియా క్రీడల్లో... ఆర్చరీలో...
విజేత
పుట్టింది సాధారణ రైతు కుటుంబం... అడుగడుగునా ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు... అయినా కలలను వెంటాడడం ఆపలేదు. లక్ష్యం నుంచి గురి మరల్చలేదు. ప్రస్తుత ఆసియా క్రీడల్లో... ఆర్చరీలో డబుల్ గోల్డ్ సాధించిన తానిపర్తి చికితారావు మరిన్ని పతకాలు సాధిస్తానని చెబుతోంది. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన చికిత స్ఫూర్తిదాయకమైన క్రీడా ప్రస్థానం గురించి ఆమె మాటల్లోనే...
‘‘ఆసియా క్రీడల్లో పతకాలు గెలవాలనే నా చిరకాల స్వప్నం నెరవేరింది. 2028 లాస్‌ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో భారత్‌కు మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో పాల్గొనే అవకాశం సాధించడం గర్వంగా ఉంది. అయితే, నా పతకాల వేట ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికి టీమ్, మిక్స్‌డ్‌లోనే స్వర్ణాలు సాధించా. గురువారం జరిగే వ్యక్తిగత విభాగంలోనూ పసిడి పతకం సాధించాకే నేను జపాన్‌కి వచ్చిన లక్ష్యం పూర్తవుతుంది. నా ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు అన్నీ ఇన్నీ కావు. తల్లిదండ్రులు శ్రీలత, శ్రీనివాసరావు ప్రోత్సాహంతోనే ఇక్కడ వరకు రాగలిగాను. పెద్దపల్లిలోని సుల్తాన్‌పూర్ గ్రామం మా స్వస్థలం. నాన్న రెండెకరాల చిన్న రైతు. ఆయన ఆరుగాలం కష్టపడితే కానీ మా కుటుంబం కడుపు నిండదు. అలాంటి సాధారణ పేద రైతు ఇంట్లో నుంచి నేను ఈ స్థాయికి వచ్చానంటే పట్టుదల, క్రమశిక్షణ, దేశం గర్వించేలా ఏదైనా సాధించాలనే తపనే నన్ను ఇంత దూరం నడిపించాయి. కెరీర్ ప్రారంభంలో మా పొలంలోనే నాన్న టార్గెట్ ఏర్పాటు చేసి, నాతో సాధన చేయించేవాడు. కొద్ది రోజుల తర్వాత నన్ను చూసి తమ్ముడు యశ్వంత్ కూడా ఆర్చరీలో మెళకువలు నేర్చుకోవడం ప్రారంభించాడు. నాన్నే నా తొలి కోచ్.
నాన్నకు అంకితం...
నేను సాధించిన ఈ పతకాలు మా నాన్నకు, దేశానికి అంకితమిస్తున్నా. నా ప్రతి అడుగులో, బాధలో, సంతోషంలో, కష్టంలో నీడలా వెంటే ఉంటూ నాన్న చేయి పట్టుకొని ముందుకు నడిపించారు. ఆయన లేకుంటే ఇక్కడవరకు వచ్చేదాన్ని కాదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో, జాతీయ ట్రయల్స్‌లో చాంపియన్‌గా నిలిచి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సోనిపట్ కేంద్రంలో శిక్షణకు ఎంపికయ్యాక నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. సీనియర్ ఆర్చర్ అభిషేక్‌వర్మ నాకు ఒక మెంటారుగా ఉంటూ చేసిన దిశానిర్దేశం ఎంతో ఉపయోగపడింది. మిక్స్‌డ్ ఈవెంట్ పోటీలకు ముందు కూడా ఆయన నాతో మాట్లాడి, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆర్చర్‌గా నా ఎదుగుదలలో అభిషేక్ పాత్ర కీలకమైనది. వ్యక్తిగతంగా, ఆటపరంగా ఆయన ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పడం చాలా చిన్నది.
తొలి యూత్ వరల్డ్ చాంపియన్...
గత ఏడాది ఆగస్టులో కెనడాలో జరిగిన యూత్ వరల్డ్ చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలవడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇప్పటివరకు దేశం తరఫున ఈ టైటిల్‌ను సాధించిన ఏకైక ఆర్చర్‌ను నేనేనని తెలిశాక నా సంతోషానికి అవధులు లేవు. ఆ తర్వాత ఆసియా కప్‌లో, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించినా సరైనా గుర్తింపు, ప్రోత్సాహం లభించకపోవడంతో ఒక దశలో చాలా నిరాశ చెందాను. అయితే, ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇవేమి పట్టించుకోవద్దు... కచ్చితంగా ఏదోఒక రోజు నీ కష్టానికి తగిన గుర్తింపు వస్తుంద’ని నాన్న చెప్పిన మాటలు నా ఆలోచనలను మార్చాయి.

సైనా ప్రేరణతో...
2012లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించినప్పుడు అందరూ ఆమెను గొప్పగా పొగుడుతుంటే తన గురించి తెలుసుకున్నా. సైనా ప్రయాణం ప్రేరణ కలిగించింది. నేను కూడా దేశం గర్వించే అథ్లెట్ కావాలని ఆరోజే నిర్ణయించుకున్నా. నాన్న స్వతహాగా వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో నేను క్రీడలను కెరీర్‌గా ఎంచుకుంటానంటే వెంటనే ఒప్పుకున్నారు. అయితే మా గ్రామానికి దగ్గరలో బ్యాడ్మింటన్ శిక్షణ సదుపాయాలు లేకపోవడంతో ఏ క్రీడను కెరీర్‌గా ఎంచుకుంటే బాగుంటుందని నాన్న పలువురు సూచనలు, సలహాలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న వనరులతో ఆర్చరీలో శిక్షణ తీసుకోవచ్చని ఒక నిర్ణయానికి వచ్చి ఈ క్రీడను కెరీర్‌గా మలుచుకున్నాను. కొద్ది రోజుల తర్వాత జాతీయ స్థాయి ఆర్చర్‌గా ఎదగడానికి ఈ శిక్షణ సరిపోదని గ్రహించా. అయితే, మా గ్రామం నుంచి కరీంనగర్ 20 కిలోమీటర్ల దూరం. అక్కడ నుంచి మా పాఠశాల మరో 20 కి.మీ. రోజూ ఉదయం ఐదున్నరకు ఇంటి నుంచి బయలుదేరి శిక్షణ కేంద్రానికి చేరుకుని, అక్కడ రెండు గంటలు సాధన చేశాక మరో 20 కి.మీ. ప్రయాణించి సగ్నూర్‌లోని పాఠశాలకు వెళ్లేదాన్ని. ఆ ప్రయాణ దూరం, సాధన వ్యయప్రయాసలేవీ నేను నిర్దేశించుకున్నా లక్ష్యాన్ని తలుచుకున్నప్పుడు కష్టంగా అనిపించేవి కాదు.’’
ఎస్.ఎస్.బి సంజయ్
టార్గెట్ ఒలింపిక్స్...
లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్ బెర్త్ సాధించడంతో పనైపోలేదు. మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. అయితే ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది. ఆసియా క్రీడల అనంతరం ‘టార్గెట్... ఒలింపిక్స్’గా సన్నద్ధం కావాల్సి ఉంది. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే నా అంతిమ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తే భవిష్యత్‌లో మరిన్ని పతకాలు అందిస్తాను.
ఈ వార్తలూ చదవండి
దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..
దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు..