కళలు జీవనశైలిలో అంతర్భాగాలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:35 AM
కళలు శాశ్వతంగా సజీవంగా ఉండాలంటే, మరుగున పడిపోయే కళాఖండాలతో పాటు, కళాకారులకు గుర్తింపును చేకూర్చాలి. అంతకంటే ముఖ్యంగా కళల విలువ పట్ల అవగాహన పెంచాలి. ఇదే...
కళలు శాశ్వతంగా సజీవంగా ఉండాలంటే, మరుగున పడిపోయే కళాఖండాలతో పాటు, కళాకారులకు గుర్తింపును చేకూర్చాలి. అంతకంటే ముఖ్యంగా కళల విలువ పట్ల అవగాహన పెంచాలి. ఇదే లక్ష్యంతో ‘ఏక్‌చిత్ర’ ఆర్ట్ గ్యాలరీ వేదికగా కీర్తనం, బవోలి ఆర్ట్ సంగమ్ అనే రెండు విభిన్నమైన లక్ష్యాలను ఎంచుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ఆర్ట్ క్యురేటర్, అన్నపూర్ణ మడిపడిగ. ఆమె నవ్యతో పంచుకున్న కళా నేపథ్యం, కళా వేదికల విశేషాలివి...
కళల పట్ల ఆసక్తి నాకు చిన్నతనంలోనే ఏర్పడిందని చెప్పాలి. నాన్నగారు రోహిణి కుమార్ కూడా కళాకారులే! దాంతో కళను దగ్గరి నుంచి గమనించి, అర్థం చేసుకునే అవకాశం లభించింది. నాన్న తాను ఎక్కడకు వెళ్లినా వెంట తీసుకువెళ్తూ, పెయింటింగ్స్‌తో పాటు శిల్పకళ విశేషాలను వివరించేవారు. అలా చిన్నతనం నుంచి ప్రతిదాన్నీ కళా దృష్టితో చూసే అలవాటు అలవడింది. అయితే కళలకు ఆదరణ కాలక్రమేణా తగ్గుతోంది. ఆర్ట్ గ్యాలరీలోకి అడుగుపెట్టి, పెయింటింగ్‌ల సౌందర్యాన్ని ఆస్వాదించే కళాత్మక హృదయం అందరికీ ఉండకపోవచ్చు. ఆసక్తి ఉన్న కొద్దిమంది కూడా అవగాహనా లోపం వల్ల గ్యాలరీలకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం అవసరమనే ఆలోచనతో, ఒక నిర్దిష్టమైన కథా వస్తువుతో కళలను ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఏక్‌చిత్ర ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించబోతున్నాను.
వాళ్లు సజీవ ఆలయాలు
మనకు అపారమైన, అద్భుతమైన సంప్రదాయ కళలున్నాయి. ప్రాచీన ఆలయాల నిర్మాణ రహస్యాలను ఇప్పటివరకూ కనిపెట్టలేకపోతున్నాం. గతంలో వాస్తుశిల్పం, కళలు మన దైనందిన జీవితాల్లో భాగాలుగా ఉండేవి. ప్రతి ఇంటికీ ఒక మెట్ల భావి ఉండేది. జీవన విధానంలో అదొక భాగం. కానీ మనమిప్పుడు జీవితాన్నీ కళలనూ వేర్వేరుగా విడదీసి చూస్తున్నాం. కళలు ఆర్ట్ గ్యాలరీలకే పరిమితమైపోయాయి. కానీ అప్పట్లో సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అన్నీ గుళ్లోనే నెలవై ఉండేవి. ఈ పరిస్థితిని మనమిప్పుడు కల్పించలేకపోయినా, ప్రజలకు కళలను మరింత చేరువ చేయడం కోసం గతంలో ‘లివింగ్ టెంపుల్’, ఇప్పుడు ‘కీర్తనం’ కళా ప్రదర్శనలకు సంకల్పించాను. లివింగ్ టెంపుల్ కోసం కళలనే జీవితంగా మలుచుకున్న మెట్ల బావుల పునరుద్ధణ చేపట్టే, కల్పనా రమేశ్, శిల్పశాస్త్రాన్ని ఔపాసన పట్టి, ఉడిపిలో స్థిరపడిన త్రిథ అనే స్పానిష్ కళాకారుడు, గుళ్లను పునరుద్ధరించిన కె.కె మొహమ్మద్ గారు వీళ్లందరూ నాకు సజీవ ఆలయాల్లాంటివాళ్లే!
కళాకారులకు కొత్త జీవం... కీర్తనం
మన దేశంలో అందుబాటులో ఉన్న చరిత్ర పుస్తకాల్లో సంప్రదాయ కళలకు పరిమిత స్థానాన్ని కేటాయించి, పాశ్చాత్య, యూరోపియన్ కళా ప్రభావాలకు ఎక్కువ స్థానాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగని మన కళలు తక్కువ ప్రాధాన్యం కలిగినవేమీ కావు. వాటికి సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది. ఆ లోటును నేను భర్తీ చేయాలనుకున్నాను. అందుకోసం డాక్యుమెంట్ చేయని పాత తరం కళాకారుల కళాఖండాలను సమీకరించి, వారి వారసులను కలిసి, వివరాలను సేకరించి నేటి కళాకారులకు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ‘కీర్తనం’ వేదికగా కళాఖండాలను ప్రదర్శించడం, స్లైడ్స్ చూపించడం లాంటి మార్గాలను ఎంచుకున్నాను. కీర్తనం ఇనీషియేటివ్ కోసం దామర్ల రామారావు, పైడి రాజు, శేషగిరిరావు, ఉల్చి ఇలా 200 మంది పాత తరం కళాకారుల భౌతిక కళాకృతులను సమీకరించి డాక్యుమెంట్ చేయాలని సంకల్పిస్తున్నాను.

బౌలి ఆర్ట్ సంగమ్‌తో ఆర్ట్ టూరిజం
‘బౌలి’ అంటే మెట్ల బావి. గతంలో ఈ బావులు మన దైనందిన జీవితాల్లో భాగాలు. గ్రామీణులందరూ మెట్ల బావుల ద్గగర చేరి, సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనేవారు. కాలక్షేపాలకూ, విశ్రాంతికి వాటిని వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ మెట్ల బావులన్నీ వాడుకలో లేకుండా పోయాయి. ఒక మెట్ల బావిని పునరుద్ధరిస్తే, దాని చుట్టూరా ఉన్న దాదాపు 200 బోర్లలోకి నీళ్లు చేరుకుంటాయి. దాంతో పరిసరాల్లో నీటి కొరత తీరుతుంది. కాబట్టి వాటిని పునరుద్ధరిస్తున్న కల్పనా రమేశ్‌తో కలిసి వాటి పరిసరాల్లో ఆర్ట్ ఇన్‌స్టలేషన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. మన దేశంలో కొచ్చి, బెంగాల్‌లో ఇదే తరహా ఆర్ట్ టూరిజంలను నిర్వహిస్తూ ఉంటారు. కానీ మన తెలంగాణాలో ఈ పోకడ మనుగడలో లేదు. కాబట్టి మన సంస్కృతితో ముడిపడి ఉన్న మెట్ల బావులు కేంద్రంగా, ఆర్ట్ బౌలి ఆర్ట్ సంగమ్‌ను నిర్వహించాలని సంకల్పించాను. 13 మెట్ల బావుల దగ్గర నిర్వహించే ఈ కళా ప్రదర్శన 40 రోజుల పాటు కొనసాగుతుంది. డిసెంబరు 1 నుంచి జనవరి 10 జరిగే బౌలి ఆర్ట్ సంగమ్‌తో ఆర్ట్ టూరిజం కూడా పెరుగుతుంది.
గోగుమళ్ల కవిత
ఒక క్యురేటర్‌గా కళాకారుల కళాఖండాలకు పరిశోధనాత్మక కోణాన్ని జోడించే బాధ్యత నాది. 2022లో ఏక్‌చిత్ర క్యురేటోరియల్ వేదికను స్థాపించాను. అంతకంటే ముందు ఎనిమిదేళ్ల నుంచి క్యురేటర్‌గా వ్యవహరిస్తున్నాను. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఇలా వేర్వేరు గ్యాలరీలకు పని చేయడంతో పాటు స్వతంత్ర ప్రదర్శనలు నిర్వహించాను. తాజాగా ఏక్‌చిత్ర ఆర్ట్ గ్యాలరీని కూడా ప్రారంభించాను. కళకు రూపం లేదు. పాడడం, రాయడం, చిత్రించడం ఇవన్నీ కళలే! కాబట్టి ఏక్‌చిత్రలో కళలన్నిటికీ స్థానం కల్పించాను. పుస్తకావిష్కరణలు, కవితా గోష్ఠులు, దృశ్యకళలకు ఏక్‌చిత్ర ఒక వేదిక. ఈ గ్యాలరీలో బౌలి ఆర్ట్ సంగమ్, కీర్తనం ఇనీషియేటివ్స్‌కు పూనుకోబోతున్నాను. మాది హైదరాబాదే! ఇక్కడే జెఎన్‌టియులో పెయింటింగ్‌లో మాస్టర్స్ చేశాను. మా వారు హిమదీప్ మీడియాలో పని చేస్తారు. మా బాబు బృహత్‌కు ఆరేళ్లు.