Share News

ఉపాధి కోసం బయలుదేరి...

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:22 AM

ఉన్న ఊరిలో బతకడం కష్టమవుతోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఈ కష్టాల నుంచి బయట పడేందుకు ఉన్న ఊరికి.. కన్నవారికి దూరంగా భీమవరంలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడా వ్యక్తి.

ఉపాధి కోసం బయలుదేరి...
వెంకటరావు (ఫైల్‌)

  • రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కంచిలి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఉన్న ఊరిలో బతకడం కష్టమవుతోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఈ కష్టాల నుంచి బయట పడేందుకు ఉన్న ఊరికి.. కన్నవారికి దూరంగా భీమవరంలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడా వ్యక్తి. ఈ క్రమంలో తాను పని చేసే చోటుకు బయలుదేరిన ఆ వ్యక్తిని రైలు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటన బుధవారం మధ్యాహ్నం కంచిలి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివీ... కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామానికి చెందిన తోట వెంకటరావు(47) అనే వ్యక్తి స్థానికంగా చిన్న టిఫిన్‌ దుకాణం నడుపుతూ జీవనం సాగించేవాడు. అతడికి భార్య సుజాతతో పాటు కుమారుడు మణికంఠ, డిగ్రీ చదువుతున్న కుమార్తె మనీష ఉన్నారు. కుమారుడు ఉత్తరప్రదేశ్‌లో ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. గ్రామంలోని టిఫిన్‌ షాపు సరిగా నడవకపోవడం.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతుండడంతో ఉపాధి కోసం వెంకటరావు భీమవరం వెళ్లాడు. అక్కడే ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల భార్యాబిడ్డలను చూసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో బుధవారం విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు కంచిలి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. రైలు ఎక్కే సమయంలో కాలు జారిపడి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై పలాస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుపేద కుటుంబం కావడం... ఇంటి పెద్ద ఇలా దుర్మరణం పాలవడంతో భార్య సుజాతతో పాటు కుమార్తె విలపించిన తీరు చూపరుల కంటతడి పెట్టించింది. ఓ గంట క్రితం వరకూ తమ ముందే ఉన్న వెంకటరావు అంతలోనే మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Updated Date - Aug 27 , 2026 | 12:22 AM