అనుభవాలకు దృశ్య రూపం
ABN , Publish Date - May 04 , 2026 | 05:47 AM
అథ్లెట్, రచయిత్రి, నటి, స్టాండప్ కమెడియన్, మోటివేషనల్ స్పీకర్... ఏ రంగంలోనైనా అనూ వైద్యనాథన్‌ది తనదైన ముద్ర....
అథ్లెట్, రచయిత్రి, నటి, స్టాండప్ కమెడియన్, మోటివేషనల్ స్పీకర్... ఏ రంగంలోనైనా అనూ వైద్యనాథన్‌ది తనదైన ముద్ర. కిందటి వారం మెక్సికోలోని చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఆమె తొలి డాక్యుమెంటరీ ‘డిస్పాచ్’ ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆసక్తి, అంకితభావం ఉంటే ఎన్ని బాధ్యతలు నిర్వర్తించినా అలసట ఉండదంటున్న అనూ తన ప్రయాణం గురించి ఏం చెబుతున్నారంటే...
‘‘సరిగ్గా నెల రోజుల క్రితం... నేను రూపొందించిన ‘డిస్పాచ్’ డాక్యుమెంటరీ అప్పుడే సిద్ధమయింది. నేను, నా బృందం ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో శ్రమపడ్డాం. మా కృషి, అది అందించే ఫలితం విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో.... ‘బ్యూనస్ ఎయిర్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెంట్ సినిమా’ (బిఎఎ్‌ఫఐసిఐ)లో ఏప్రిల్ 18న జరిగిన తొలి ప్రదర్శన (వరల్డ్ ప్రీమియర్) ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత ‘మెక్సికో ఫిలిమ్ ఫెస్టివల్’లో ఏప్రిల్ 27, 28 తేదీల్లో వరుసగా ప్రదర్శితమైన ‘డిస్పాచ్’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అవి నాకు అపురూపమైన క్షణాలు. ఎందుకంటే... ‘డిస్పాచ్’ నా కుటుంబానికి చెందిన సంఘటనలకు దృశ్యరూపం. కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడం నాకు కొత్తేం కాదు. నా జీవితంలో ముందుగా ఊహించనివి ఎన్నో జరిగాయి. వాటిలో ఇదొకటి.
ఆసియాలో తొలి మహిళగా...
నేను ఢిల్లీలో పుట్టాను. బెంగళూరులో పెరిగాను. మాది చాలా పెద్ద కుటుంబం. కులం, మతాలకు అతీతంగా జరిగిన వివాహాల వల్ల పలు భాషలు, సంప్రదాయాల వారు మా కుటుంబంలో భాగమయ్యారు. దేశవ్యాప్తంగా బంధువులు ఉండడంతో భిన్నమైన జీవన, ఆలోచనా విధానాలను ఆకళింపు చేసుకొనే అవకాశం నాకు బాల్యంలోనే దొరికింది. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేదాన్ని. బెంగళూరులో ఇంజనీరింగ్ చేసి, పిహెచ్‌డి కోసం అమెరికా వెళ్ళాను. అప్పుడే క్రీడలపై నా దృష్టి పడింది. రన్నింగ్, స్విమ్మింగ్ సాధన చేశాను. 2008లో ‘హాఫ్ ఐరన్ మ్యాన్-73... క్లియర్ వాటర్ వరల్డ్ ఛాంపియన్‌షి్‌ప’కు అర్హత సాధించిన తొలి భారతీయురాలిని నేనే. అలాగే 2009లో ‘అలా్ట్ర మ్యాన్ కెనడా’ (ట్రయథ్లాన్)లో పాల్గొని, విజయవంతంగా పూర్తి చేసిన తొలి ఆసియా మహిళగా నిలిచాను. అనంతరం అమెరికాలో ఆపేసిన పిహెచ్‌డిని న్యూజిలాండ్‌లో పూర్తి చేశాను. సొంతంగా ఒక కన్సెల్టెన్సీ సంస్థను ప్రారంభించాను. అయితే అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఆ క్రీడల్లో పాల్గొనడానికి తగిన స్థోమత, మద్దతు లేకపోవడంతో విరామం ఇచ్చాను. క్రీడాకారిణిగా నా అనుభవాల్ని ‘ఎనీవేర్ బట్ హోమ్’ అనే పేరుతో పుస్తకం రాశాను. దానికి మంచి ఆదరణే దక్కింది. ఆ తరువాత పెళ్ళయింది. లండన్‌లో నివాసం. వృత్తి పనులు, ఇంటి పనులు పిల్లల పెంపకంతో బిజీ అయిపోయాను. కానీ కొవిడ్ అందరిలాగే నా జీవితంలోనూ ఊహించని మార్పు తెచ్చింది.
నాలుగు వారాలు హౌస్‌ఫుల్
ప్రస్తుత యుగంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. కొవిడ్ కారణంగా అది ఇంకా పెరిగింది. వినోదం, హాస్యం, మిత్రులతో, భావసారూప్యత ఉన్నవారితో గడపడం లాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాంటి వినోదాన్ని సమాజానికి అందివ్వాలనుకున్నాను. నా పిల్లలతో నాకున్న అనుభవాలతో ‘బిఫోర్ చిల్డ్రన్: ఆఫ్టర్ డైపర్స్’ అనే స్టాండప్ కామెడీ షో తయారు చేసి, ఇడిన్‌బర్గ్‌లో ప్రదర్శించాను. దానికి వచ్చిన స్పందన నేపథ్యంలో... అదే వేదిక మీద వరుసగా నాలుగు వారాలపాటు టిక్కెట్లపై ప్రదర్శన కొనసాగించాను. అరవై సీట్ల ఆ హాల్ ప్రతిరోజూ నిండిపోయింది. ఆ తరువాత న్యూయార్క్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ నటుడు, రచయిత వాల్టర్ బ్రిడ్జ్ దాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నాను. రంగస్థలం మీద పాత్రలు పోషించాను. కొత్త స్టాండప్ షోలను తయారు చేసి, ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నాను. వాటిలో కొన్నిటితో లఘు చిత్రాలను కూడా రూపొందించాను. రోజువారీగా మనకు ఎదురయ్యే సంఘటనలే ఈ షోల్లో ప్రధానాంశాలు. ఈ గుర్తింపు నేపథ్యంలో వివిధ సంస్థల ఆహ్వానం మేరకు మోటివేషనల్ స్పీకర్‌గానూ వ్యవహరిస్తున్నాను. 2003లో ‘సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’కు వెళ్ళినప్పుడు ఒక ఆఫ్రికన్-అమెరికన్ చిత్ర నిర్మాతను కలిశాను. ఆమె తన తొలి ఫీచర్ ఫిల్మ్‌ను తక్కువ ఖర్చుతో, ఎవరి సాయం లేకుండా ఎలా నిర్మించారో నాకు చెప్పారు. కానీ షార్ట్ ఫిల్మ్‌లు తప్ప... సినిమానో, డాక్యుమెంటరీయో తీయాలనే ఆలోచన అప్పటికి నాకు లేదు.
రెండు తరాల కథ...
2024లో నాకు ఎంతో ఇష్టమైన మా అత్తగారు మరణించారు. దేశ విభజన సమయంలో ఆమె భారత్‌కు వచ్చేశారు. నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో ఆమె ఒకరు. వీటన్నిటికన్నా కుటుంబం, ప్రాంతం, సంస్కృతి పరంగా... ఒక మహిళగా ఆమె ఎదుర్కొన్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వంట గదిలో, షాపింగ్ చేస్తున్నప్పుడు, పర్యటనలకు వెళ్ళినప్పుడు మేము పంచుకున్న కబుర్లు, కష్టాలు, ఇబ్బందులు... ఇవన్నీ ఆమె మరణించిన తరువాత నాకు పదే పదే గుర్తుకు వచ్చేవి. వాటన్నిటితో ఒక డాక్యుమెంటరీ తీయాలనిపించింది. నేనే నిర్మాతగా, దర్శకురాలుగా ‘డిస్పాచ్’ను ప్రారంభించాను. 2025 వేసవిలో... మండుటెండల మధ్య మన దేశంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాను. రెండు తరాల మహిళల జీవితానుభవాలకు, భావోద్వేగాలకు, సాధికారత సాధించే క్రమంలో చేసిన పోరాటానికి దృశ్య రూపం ఈ డాక్యుమెంటరీ. అది అభినందనలకు పాత్రమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్రపంచంలోని వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ఉత్సాహం మరిన్ని చిత్రాల రూపకల్పన వైపు నన్ను నడిపిస్తుందనుకుంటున్నాను. అయితే... ఈలోగా మరో కొత్త రంగం నన్ను ఆకర్షిస్తే... అటువైపు అడుగులు వేయడానికి ఏమాత్రం సందేహించను.’’
ఇవి కూడా చదవండి..
200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే