మూగజీవాల డిజిటల్ మార్కెట్!
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:25 AM
రైతులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలేమిటి?... ఇద్దరు ఐఐటీ ఢిల్లీ విద్యార్థినుల్లో మెదిలిన ఈ ప్రశ్న... లక్షలమంది పాడి రైతులకు దళారుల నుంచి విముక్తి కల్పించి, మెరుగైన ధరలు పొందేలా...
రైతులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలేమిటి?... ఇద్దరు ఐఐటీ ఢిల్లీ విద్యార్థినుల్లో మెదిలిన ఈ ప్రశ్న... లక్షలమంది పాడి రైతులకు దళారుల నుంచి విముక్తి కల్పించి, మెరుగైన ధరలు పొందేలా చేసింది. కీర్తి జంగ్రా, నీతూ యాదవ్ ఆరంభించిన స్టార్టప్ ఇప్పుడు వందల కోట్ల టర్నోవర్‌తో దూసుకెళ్తోంది.
‘‘ఏ పని చేసినా దానికి ఎంతో కొంత సామాజిక ప్రయోజనం ఉండాలి. ఆత్మ సంతృప్తిని ఇవ్వాలి... ఇది నేను చాలా గట్టిగా నమ్మే విషయం. నీతూ అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరి పరిచయాన్ని బలమైన స్నేహంగా మార్చిన విషయం కూడా అదే’’ అని చెబుతుంది కీర్తి జంగ్రా. ఆమె స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణం. ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్‌లో చేరినప్పుడు... క్లాస్‌మేట్‌గా నీతూ యాదవ్ పరిచయమయింది. ఆ తరువాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఏదైనా కొత్తగా చెయ్యాలని కలలు కనేవాళ్ళు. చదువు పూర్తయ్యాక... ఇద్దరూ కార్పొరేట్ రంగంలో ఉద్యోగాల్లో చేరి బిజీ అయిపోయారు. అయినా... తమ లక్ష్యాన్ని మరచిపోలేదు.
ఎంచుకొనే అవకాశం ఉండాలి
‘‘మాది రాజస్థాన్‌లోని నవల్పురా. నా బాల్యం గ్రామీణ వాతావరణంలో గడిచింది. అక్కడ రైతులు పడే ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాను. వారికి ఉపయోగపడేది చెయ్యాలన్న నా ఆలోచనను కీర్తితో పంచుకున్నాను. కొన్నాళ్ళు ఆలోచించాం. మన దేశానికి, సంస్కృతికి పునాది గ్రామాలే. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆవులు, గేదెల మీద లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కానీ వాటిని కొనడానికైనా, అమ్మడానికైనా బ్రోకర్లు, స్థానిక మార్కెట్లే దిక్కు. రైతులు తరచుగా సరైన కొనుగోలుదారుల్ని గుర్తించడంలో, మంచి ధరను పొందడంలో, పశువుల గురించి నమ్మకమైన సమాచారం పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు, మోసపోతున్నారు. సాంకేతికత వారికి అందుబాటులో లేదు. మా ఊరు వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ గమనించాను. కీర్తితో వాటి గురించి చర్చించాను’’ అని అంటోంది నీతూ. ఒక ఇయర్‌ఫోన్ కొనాలనుకున్నప్పుడు... డజన్ల కొద్దీ బ్రాండ్ల నుంచి ఎంచుకొనే వీలుంది. మరి రైతులు తాము ఒక ఆవునో, గేదెనో కొనాలనుకున్నప్పుడు... అలాంటి ఎంపికలు ఎందుకు ఉండకూడదు?... ఈ సమస్యకు పరిష్కారాన్ని స్నేహితులిద్దరూ ఆలోచించారు. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చినదే ‘యానిమాల్’.

నమ్మకం వమ్ముకాలేదు
2019లో... బెంగళూరులోని ఒక చిన్న గదిలో... వారాంతపు ప్రాజెక్ట్‌గా కీర్తి, నీతూ ‘యానిమాల్’ను ప్రారంభించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా... సమగ్రమైన ఒక యాప్ విడుదల చేశారు. దాని గురించి సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేశారు. గ్రామీణులకు అర్థమయ్యేలా... స్థానిక భాషల్లో వారు లావాదేవీలు సాగించే వీలు కల్పించారు. అయితే... వారి ప్రయాణం మొదట్లో అంత సజావుగా సాగలేదు. మొబైల్ యాప్‌ను ఉపయోగించి పశువుల్ని ఎవరు కొంటారంటూ చాలామంది పెదవి విరిచారు. కానీ తమ ఆలోచన పట్ల వారిద్దరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. త్వరలోనే వారి యాప్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘యానిమాల్.. యాప్ కాదు, అదొక విప్లవం’’ అంటాడు రామ్‌పాల్. అతనిది రాజస్థాన్‌లోని ఒక కుగ్రామం. అతని తండ్రి తన పశువుల్ని అమ్ముకోవడానికి కొన్ని నెలల నుంచి ప్రయత్నిస్తున్నా... కొనేవారు దొరక లేదు. ఈ కొత్త యాప్ గురించి తెలిసి... తమ పశువుల వివరాలను అందులో నమోదు చేశాడు. ఇరవై నాలుగు గంటల్లో మూడు పశువులు అమ్ముడైపోయాయి. ‘‘అలాంటి వ్యక్తుల నుంచి వచ్చిన ప్రశంసలతోపాటు సూచనలను కూడా జాగ్రత్తగా పరిశీలించి, మార్పు చేర్పులు చేసుకున్నాం. వాస్తవానికి... సోషల్ మీడియాలో మేము చేసిన ప్రచారం కంటే... రామ్‌పాల్ లాంటి వారి ద్వారా జరిగిన ప్రచారమే ఎక్కువ’’ అని చెబుతోంది కీర్తి.
ఆ ప్రయత్నం అందుకోసమే...
ఏడాది తిరిగేసరికి... పలువురు ఇన్వెస్టర్లను వారి స్టార్టప్ ఆకర్షించింది. దాంతో కార్యకలాపాల విస్తరణ కోసం అవసరమైన పెట్టుబడి సమకూరింది. ‘‘మంచి ఆశయం ఎపుఁడూ మంచి ఫలితాలనే ఇస్తుందనడానికి ఇది నిదర్శనం. మా యాప్ 80 లక్షలమందికి పైగా రైతులకు చేరువయింది. పది లక్షలకు పైగా పశువులను ఇప్పటివరకూ ‘యానిమాల్’ ద్వారా విక్రయించారు. ఆ లావాదేవీల విలువ దాదాపు 5,800 కోట్ల రూపాయలు. ప్రస్తుతం మా సంస్థ విలువ సుమారు 670 కోట్లు. ఇప్పుడు పశువుల ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ గర్భధారణ, పశువుల కొనుగోలుకు రుణాలు, బీమా తదితర సేవలను అందిస్తున్నాం. సాంకేతికత నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగుపడడానికి దోహదం చేయాలి. మా ప్రయత్నమంతా అందుకోసమే’’ అంటున్నారు ఆ సంస్థ సీఈఓ నీతూ యాదవ్, సీఓఓ కీర్తి జంగ్రా.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..