సవాళ్ల మైనింగ్‌లో కీర్తిపతాకం!
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:14 AM
సవాళ్లు విసిరే మైనింగ్ రంగంలో అడుగుపెట్టి.. అద్భుత విజయాలతో దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్త, ‘నెమ్మలి మైనింగ్స్ పైవ్రేట్ లిమిటెడ్’ డైరెక్టర్...
స్ఫూర్తి
సవాళ్లు విసిరే మైనింగ్ రంగంలో అడుగుపెట్టి.. అద్భుత విజయాలతో దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్త, ‘నెమ్మలి మైనింగ్స్ పైవ్రేట్ లిమిటెడ్’ డైరెక్టర్ నెమ్మలి కీర్తిరెడ్డి. ‘జీరో సిలికా’ ఆవిష్కరణతో ‘గ్రీన్ విప్లవం’ సృష్టించిన ఆమెను ‘నవ్య’ పలకరించింది. తన జీవిత ప్రయాణంతో పాటు, పారిశ్రామిక రంగానికి అవసరమైన సంస్కరణలపై కీర్తిరెడ్డి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
‘‘మనం ఒకటి తలిస్తే.. దైవం మరోటి తలుస్తుందని అంటారు కదా, నా విషయంలోనూ అదే జరిగింది. నేను పుట్టిపెరిగింది అమ్మమ్మ ఊరైన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో. ఆ తర్వాత మా కుటుంబం చిత్తూరు వచ్చేసింది. పదో తరగతి వరకు అక్కడే ప్రభుత్వ స్కూల్‌లో చదువుకున్నాను. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ప్యూర్ మ్యాథ్స్‌లో ఎంఎస్సీ చేశాను. చిన్నప్పటి నుంచి సైన్యం అన్నా, దేశసేవ అన్నా ప్రాణం. ఎనిమిదేళ్లపాటు ఎన్‌సీసీలో సీనియర్ అండర్ ఆఫీసర్‌గా సేవలు అందించాను. సైనిక దుస్తులు ధరించి దేశానికి సేవ చేయాలన్న ఆలోచనతో ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యాను. కానీ, నాన్న అనారోగ్యం కారణంగా నా జీవితం ఊహించని మలుపు తిరిగింది.
కదిలించిన విదేశీ దోపిడీ
2007లో నెమ్మలి పార్థసారథిరెడ్డితో నా పెళ్లి జరిగింది. ఆ తరువాత మా మకాం తిరుపతికి మార్చాం. మా వారు, నేను కలిసి 15 ఏళ్లపాటు వివిధ వ్యాపారాలు చేశాం. ఈ క్రమంలో చిత్తూరులో ఒక గ్రానైట్ గనిని తీసుకున్నాం. కానీ గ్రానైట్‌లో కొత్తగా సాధించేదేమీ లేదనిపించింది. దీంతో క్వార్ట్జ్ ఖనిజంపై దృష్టిపెట్టాం. నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ క్వార్ట్జ్ నిల్వలు ఉన్నాయి. కానీ మన దగ్గర ప్రాసెసింగ్ టెక్నాలజీ లేకపోవడంతో చైనా, జపాన్ కంపెనీలు మన సంపదను టన్ను కేవలం రూ. 12 వేలకే కొనుక్కెళ్లి.. ప్రాసెస్ చేసి, తిరిగి మనకే రూ. 2 లక్షలకు అమ్ముతున్నాయి! మన సంపదనే మనకు కొండంత ధరకు అమ్మడం నన్ను ఆలోచింపజేసింది. సొంతంగా మనమే ఆ పని ఎందుకు చేయకూడదన్న తపనతో ‘క్వార్ట్జ్’ ఖనిజ రంగంలోకి అడుగుపెట్టాం.
‘జీరో సిలికా’ విజయం
క్వార్ట్జ్ పౌడర్‌తో తయారుచేసే స్లాబ్స్ కట్ చేసినప్పుడు వచ్చే సూక్ష్మమైన ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరితే ‘సిలికోసిస్’ అనే ప్రాణాంతక వ్యాధి వస్తుంది. అది పీల్చే కార్మికులు కొన్నేళ్లలోనే చనిపోతారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఈ ధూళికి బలైపోయారు. అందుకే 2024లో ఆస్ట్రేలియా క్వార్ట్జ్ స్లాబ్‌లను నిషేధించింది. మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో ఉన్నాయి. దీంతో మన దగ్గర ఆ పరిస్థితి రాకూడదని అనుకున్నాను. అందుకోసం ఏదో ఒకటి చేయాలని రాత్రీపగలు ఆలోచించాను. చివరికి రూ. 19.5 కోట్ల భారీ వ్యయంతో పరిశోధన ప్రారంభించాం. తొలుత ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయి. అయినా వెనకడుగు వేయలేదు. చివరికి ఆరేడేళ్ల పరిశోధన తర్వాత ‘జీరో పర్సంట్ సిలికా’ గ్రీన్ టెక్నాలజీని ఆవిష్కరించాం. ఈ టెక్నాలజీ ద్వారా 99.9 శాతం సిలికా రహిత క్వార్ట్జ్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ తరహా సాంకేతిక దేశంలో ఇదే తొలిసారి. దీంతో దేశ, విదేశీ మైనింగ్ రంగంలో ఒక కొత్త ఒరవడి ప్రారంభమైంది. అంతేకాదు, ఖనిజ తవ్వకాలతో పనిలేకుండా రీసైకిల్ చేసిన మెటీరియల్‌తో క్వార్ట్జ్ కంటే పటిష్ఠమైన స్లాబ్‌లను తయారుచేయడం మొదలుపెట్టాం. ఇది మానవాళి ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి లభించిన గొప్ప వరం. ఇప్పుడు మా జీరో సిలికా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇటీవలే ఐరోపాకు ఆరు కంటెయినర్లు పంపించాం. డిసెంబర్ నాటికి ఆర్‌అండ్‌డీ పూర్తిచేసి ‘హై ప్యూరిటీ క్వార్ట్జ్ శాండ్’ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
ముడి ఖనిజాల ఎగుమతిని నిషేధించాలి
మనదేశం నుంచి ముడి ఖనిజాల ఎగుమతిని పూర్తిగా నిషేధించాలి! క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పర్ వంటి ఖనిజాలను ఉన్నది ఉన్నట్లు అమ్మేయకుండా.. ప్రాసెస్ చేసి విలువను జోడించి తుది ఉత్పత్తిగా మారిస్తే మన ఉత్పత్తులకు మంచి ధర రావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది.
చైనాతో మనకు ప్రమాదం
చైనా మనకన్నా ముందుండటానికి కారణం.. వాళ్లు పాతికేళ్ల ముందే ఆర్‌అండ్‌డీపై భారీగా పెట్టుబడులు పెట్టడమే. చైనా తమ దగ్గరున్న క్వార్ట్జ్ నిల్వలను కాపాడుకుంటూ మన దగ్గరున్న నిల్వలను ఖాళీ చేస్తోంది. మోదీ ప్రభుత్వం 50 గిగావాట్ల సోలార్ ఎనర్జీ లక్ష్యాన్ని ఇచ్చినా మనం చేరుకోలేకపోతున్నాం, కారణం.. సరైన సబ్సిడీలు లేకపోవడమే. విద్యుత్ కోతలు వంటి క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించి, గుజరాత్ తరహాలో ఏపీలోనూ పన్ను మినహాయింపులు కల్పిస్తే మరింతమంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు.
ఉపాధి కల్పనతోనే శాశ్వత వికాసం
పరిశ్రమలకు, నిరుద్యోగ యువతకు, మహిళా పారిశ్రామి కవేత్తలకు ప్రభుత్వం నేరుగా ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణ అందిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా.. శ్రామిక శక్తికి సరైన ఉపాధి మార్గాలు చూపి, పరిశ్రమలతో అనుసంధానిస్తే వాళ్ల కుటుంబాల ఆర్థిక స్థితిగతులు శాశ్వతంగా మారుతాయి. ఎంఎ్‌సఎంఈ లకు ఆసరా లభిస్తే మాలాంటి పరిశ్రమలు వందలాది మందికి గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించగలవు. నా ప్రయాణంలో పొందిన జ్ఞానాన్ని ఆన్‌లైన్ ద్వారా కొత్తవారికి ఉచితంగా అందించడమే నా ఆశయం. అమ్మాయిలకు నేను చెప్పేదొక్కటే. చేసే పనిపై స్వచ్ఛమైన ప్రేమ, పట్టుదల ఉంటే మిమ్మల్ని ఆపే శక్తి ఏదీ ఏదీ ఉండదు.
పనితో సమాధానం
మైనింగ్ క్షేత్రంలోకి నేను రావడాన్ని తొలుత చాలామంది జీర్ణించుకోలేకపోయారు. వారికి నా పనితోనే సమాధానం చెప్పాను. ఈ పోరాటంలో నా భర్త, అత్త, అమ్మ కొండంత అండగా నిలిచారు. మా కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 47 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు చేరడం వెనక మా కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. నా కుమారుడు రాజా జగన్‌రెడ్డి కెమికల్ అండ్ మెటీరియల్ సైన్స్, కుమార్తె నెమలి లక్ష్యారెడ్డి ఈసీఈ చదువుతున్నారు. నాడు నా ఆర్మీ కల నెరవేరకపోయినా ఈ రోజు మా కంపెనీ నెమ్మలి మైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఒక ‘లెఫ్టినెంట్ కల్నల్’ స్థాయి క్రమశిక్షణతో నడుపుతున్నప్పుడు నా కల ఇలా నెరవేరిందని సంతృప్తి చెందుతుంటాను.
గురులింగాచారి
క్వార్ట్జ్‌తో ఉపయోగాలేంటి?
క్వార్ట్జ్ అనేది భూమిలో లభించే అత్యంత దృఢమైన సహజ ఖనిజం. దైనందిన జీవితం మొదలుకొని ఆధునిక హైటెక్ పరిశ్రమల వరకు దీని వినియోగం విరివిగా ఉంటుంది. స్వల్ప విద్యుత్ స్పందనతో కచ్చితమైన కంపనాలను ఇచ్చే గుణం ఉండటం వల్లే ప్రతి వాచ్‌లోనూ కాలాన్ని లెక్కించడానికి దీనిని వాడతారు. ఎలకా్ట్రనిక్స్ రంగంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో వాడే సెమీకండర్ చిప్స్, సోలార్ ప్యానెల్ తయారీకి శుద్ధమైన క్వార్ట్జ్ ప్రాథమిక ముడిసరుకు. ఇది అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. కాబట్టి బంగారం, వజ్రాలను కరిగించే పాత్రల తయారీలోను, ల్యాబ్ గ్లాస్‌వేర్‌లోనూ దీనిని వాడతారు. గృహ నిర్మాణ రంగంలో గ్రానైట్‌ను మించి మన్నిక ఇచ్చే కిచెన్ కౌంటర్ టాప్స్, స్లాబ్స్ తయారీలోనూ క్వార్ట్జ్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు