Share News

యాచించే చేతులు దాతృత్వానికి జోతలు

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:56 AM

బతుకు భారమై భిక్షాటన చేసుకొంటున్న ఓ వృద్ధురాలు... తనపై దయ చూపి ఇంత అన్నం పెడుతున్న భగవంతుడి రుణం తీర్చుకొంటోంది. గుడి మెట్లపై బిచ్చమెత్తి....

యాచించే చేతులు దాతృత్వానికి జోతలు

బతుకు భారమై భిక్షాటన చేసుకొంటున్న ఓ వృద్ధురాలు... తనపై దయ చూపి ఇంత అన్నం పెడుతున్న భగవంతుడి రుణం తీర్చుకొంటోంది. గుడి మెట్లపై బిచ్చమెత్తి... ఆ మొత్తం ఆ దేవుడికే విరాళంగా ఇస్తోంది. చిత్రంగా... ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కాకినాడ జిల్లా... తుని పట్టణంలో ఎన్నో ఏళ్లుగా యాచక వృత్తి కొనసాగిస్తున్న గోర్లి నర్సియమ్మ కథ ‘నవ్య’ పాఠకుల కోసం.

సాధారణంగా యాచకులు ఆ పూటకు ‘ఎవరైనా ఇంత భోజనం పెడితే చాలు దేవుడా’ అనుకుంటారు. ఓ పది రూపాయలు దానం చేస్తే ఆనందంతో ఉప్పొంగుతారు. కానీ గోర్లి నర్సియమ్మ రూటే సెపరేటు. ఆమె వయస్సు 65. కాకినాడ జిల్లా తుని పట్టణంలో కొన్నేళ్లుగా పలు ఆలయాల వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. నర్సియమ్మ మాటల్లో ఆమె దాతృత్వానికి ఆధ్యాత్మిక నేపథ్యం కనిపిస్తోంది. ‘‘ఒకసారి కలలో పరమశివుడు కనిపించి, నాకు ఆశ్రయం కల్పించిన ఆలయాలకు సహాయం చేయాలని సూచించాడు’’ అంటున్న నర్సియమ్మ ఆ కలను సాధారణంగా తీసుకోలేదు. తన జీవితానికి దిశానిర్దేశం చేసిన అనుభూతిగా భావించింది. అప్పటి నుంచి తనకు వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ఆలయాల కోసం దాచడం ప్రారంభించింది. ఆమెకు భక్తులు ఇచ్చే రూపాయి కేవలం చిల్లర కాదు. అది ఒకరి భక్తి.. మరొకరి దయ.. ఇంకొకరి మానవత్వం. అలా తన చేతికి వచ్చిన డబ్బును తిరిగి దైవ సేవకు సమర్పించాలన్న సంకల్పం ఆమెను ముందుకు నడిపిస్తోంది. రోజూ జీవనం కోసం చేయి చాచే వ్యక్తి... అదే చేతులతో ఆలయాలకు విరాళాలు అందించడం సాధారణ విషయం కాదు.

అదే ఆమె ప్రపంచం...

ఈ వృద్ధురాలి దాతృత్వం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నర్సియమ్మ స్వస్థలం తిరుపతి. జీవితంలో ఎదురైన పరిస్థితులు ఆమెను కొన్ని దశాబ్దాల కిందట రైల్లో తునికి తీసుకొచ్చాయి. అక్కడే జీవన ప్రయాణం మొదలైంది. కాలం మారింది.. తరాలు మారాయి.. పట్టణం విస్తరించింది. కానీ ఆమె జీవన విధానంలో పెద్దగా మార్పు రాలేదు. సుమారు మూడు దశాబ్దాలుగా ఆమె భిక్షాటననే జీవనాధారంగా కొనసాగిస్తోంది. ఉదయం లేవగానే తునిలోని వివిధ ఆలయాల వద్దకు వచ్చే భక్తులే ఆమెకు ఆధారం. కొందరు పదో పరకో బిచ్చమేస్తారు. మరికొందరు భోజనం పెడతారు. అలా రోజంతా వచ్చిన కొద్ది మొత్తంలోనే కొంత పొదుపు చేస్తోంది. ప్రస్తుతం గొల్ల అప్పారావు సెంటర్‌ సమీపంలోని శివాలయం వద్ద తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఆలయ ప్రాంగణమే ఆమెకు ఆశ్రయం. అదే ఆమెకు పరిచయమైన ప్రపంచం.


5-navya.jpg

అన్నదానానికి బియ్యం...

గొల్ల అప్పారావు సెంటర్‌ సమీపంలోని శివాలయంతో నర్సియమ్మకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తనకు ఆశ్రయం కల్పించిన ఆ ఆలయానికి ఆమె రూ.50 వేల విరాళం అందించింది. గత ఏడాది ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి నాలుగు బస్తాల బియ్యం కూడా సమర్పించింది. తనకు భోజనం పెట్టిన ప్రపంచానికి.. తన వంతుగా మరికొందరికి భోజనం అందించాలన్న ఆలోచన ఆమెది. కార్తిక మాసం సందర్భంగా ఇటీవల తుని గాంధీ సత్రంలోని శ్రీఅన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయానికి మరో రూ.50 వేల విరాళం అందించింది. ఆలయ అభివృద్ధి, భక్తుల సేవా కార్యక్రమాల కోసం తన పొదుపును సమర్పించింది. ఒకప్పుడు ఇతరులు పెట్టిన అన్నం ఆమె ఆకలిని తీర్చింది. ఇప్పుడు అదే అన్నదానానికి ఆమె బియ్యం అందిస్తోంది.

భ్రమరాంబికకు బంగారు కళ్లు...

నర్సియమ్మ భక్తి తుని ఆలయాలకే పరిమితం కాలేదు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారికి బంగారు కళ్లు సమర్పించింది. మరో మూడు ఆలయాలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు విరాళాలు అందించినట్లు ఆమె తెలిపింది.

నర్సియమ్మకు సొంత గూడు లేదు. స్థిరమైన ఆదాయం లేదు. భవిష్యత్తుపై భరోసా లేదు. అయినా తనకు వచ్చిన కొద్దిపాటి మొ త్తంలో కొంత ఇతరుల కోసం కేటాయిస్తోంది. ఆలయాలకు విరాళాలు అందించినప్పుడు ఆమెను గౌరవిస్తున్న ఆలయ కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవా సంస్థలు... ఆమెకు అవసరమైనపుడు కూడా అదే ఆప్యాయతతో అండగా నిలవాలని భక్తులు కోరుతున్నారు. నర్సియమ్మ జీవితాన్ని కేవలం ఒక యాచకురాలి దాతృత్వ కథ మాత్రమే కాదు... విశ్వాసానికి, కృతజ్ఞతకు అద్దం పట్టే జీవన ప్రస్థానం.


ధారాలమ్మకు రూ.లక్ష...

నర్సియమ్మ దాతృత్వానికి నిదర్శనం తుని ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ధారాలమ్మ ఆలయానికి అందించిన లక్ష రూపాయల విరాళం. ఆలయంలో భారీ త్రిశూలం తయారీ కోసం ఆమె ఈ మొత్తాన్ని సమర్పించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుమలశెట్టి సత్తిబాబు వెల్లడించారు. రోజూ భక్తులు ఇచ్చే చిల్లర డబ్బుతో జీవనం సాగించే ఓ మహిళ... లక్ష రూపాయలు ఎలా సమకూర్చుకుంది? ఎన్ని రోజుల ఆకలి, ఎన్ని చిన్నచిన్న పొదుపులు, ఎన్ని ఆశలను పక్కనపెట్టి ఆ మొత్తాన్ని కూడబెట్టిందో. విరాళం ఇచ్చిన తర్వాత కూడా ఆమె జీవితం మారలేదు. అదే ఆలయాల వద్ద భిక్షాటన చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 05:56 AM