Share News

ఈ మామిడి అమృతం ఏ సీజన్లోనైనా...

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:38 AM

అమృతం మ్యాంగో... ఏ సీజన్‌లోనైనా తినగలిగేలా నిల్వ ఉండే ఈ రకం మామిడిని విశాఖ జిల్లా రైతు కొంగర రమేష్‌ ఆవిష్కరిస్తే... దాన్ని వినియోగదారులకు...

ఈ మామిడి అమృతం ఏ సీజన్లోనైనా...

అమృతం మ్యాంగో... ఏ సీజన్‌లోనైనా తినగలిగేలా నిల్వ ఉండే ఈ రకం మామిడిని విశాఖ జిల్లా రైతు కొంగర రమేష్‌ ఆవిష్కరిస్తే... దాన్ని వినియోగదారులకు చేరువ చేయడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన కుమార్తె కొంగర హరిత. రైతులకు ప్రయోజనకరంగా ఉండే అమృతం మ్యాంగో ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ హార్టికల్చర్‌రీసెర్చ్‌’ నుంచి అత్యున్నత స్కోరింగ్‌ సాధించింది. వివిధ ప్రదర్శనల్లో ప్రశంసలు అందుకుంది. దీని వెనుక ఉన్న కథను హరిత ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘మాది వ్యవసాయ కుటుంబం. నాన్న కొంగర రమేష్‌ వ్యవసాయంతో పాటు రైతులకు అధిక ఆదాయాన్ని అందించే కొత్త వంగడాల అభివృద్ధి, బయో పెస్టిసైడ్స్‌ మీద పరిశోధనలు చేశారు. పత్తి, మిరపలో కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. మరోవైపు హోమియోపతి వైద్యం చేసేవారు. నేను విశాఖపట్నంలోని గుడిలోవ విజ్ఞాన్‌ విహార్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదివాను. నాన్న చేసే పరిశోధనలకు సహకారం అందించేదాన్ని. ఇంటర్‌లో బైపీసీ చేశాక... హోమియోలో సీటు వచ్చింది. అదే సమయంలో తాడేపల్లిగూడెం డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు కావడంతో... అందులో చేరాలని నాన్న సూచించారు. అప్పుడే నాన్న అభివృద్ధి చేసిన ఒక మిరప వంగడాన్ని ‘నేషనల్‌ జీన్‌ బ్యాంక్‌’లో రిజిస్టర్‌ చేశారు. క్రమంగా నాన్న చేసే ప్రయోగాలన్నీ అర్థమవుతూ వచ్చాయి. సెలవుల్లో వచ్చినప్పుడు మ్యాంగో రీసెర్చ్‌, బ్రీడింగ్‌ గురించి తెలుసుకున్నాను. తరువాత తమిళనాడు యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివాను. 2015లో హార్టికల్చర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. రామభద్రాపురంలో చేరాల్సి ఉంది. కానీ నాన్న పరిశోధనలో భాగస్వామిగా కావాలని నిర్ణయించుకున్నాను.


15 ఏళ్ల శ్రమకు ఫలితం

అమృతం మ్యాంగో వంగడాన్ని అభివృద్ధి చేయడానికి నాన్న 15 ఏళ్లపాటు శ్రమించారు. వాజ్‌పేయికి పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మామిడి పండ్లు పంపించారన్న వార్త విన్న ఆయన ‘మన జాతీయ ఫలం మామిడి అయి ఉండి ఎవరో మనకు మామిడి పండ్లను పంపించడం ఏమిటి’ అనుకున్నారు. అలా 1993లో సరికొత్త మామిడి వంగడాన్ని సృష్టించడం కోసం పరిశోధన ప్రారంభించారు. 2008 నాటికి అమృతం మ్యాంగోను అభివృద్ధి చేయడంలో విజయం సాధించారు. ఈ పరిశోధన ప్రక్రియలో నావంతు సహకారం అందించాను. చిన్న రసం, ఆమ్రపాలి ఫలాలు... ఈ రెండింటిని క్రాస్‌ చేసి ‘అమృతం మ్యాంగో’ను అభివృద్ధి చేశాం. జర్మ్‌ ప్లాజమ్‌ను తెచ్చి పెంచడానికి రెండు నుంచి నాలుగేళ్లు, పూత వచ్చిన తరువాత క్రాసింగ్‌కు రెండేళ్లు పడుతుంది. క్రాస్‌ అయిన తరువాత అదే ఏడాది పండు వస్తుంది. ఆ పండును నాటిన ఎనిమిది నుంచి పదేళ్ల తరువాత

కాపు వస్తుంది. మొత్తంగా అమృతం రకం మామిడిని అభివృద్ధి చేయడానికి 12 నుంచి 15 ఏళ్లు పట్టింది. వందకుపైగా క్రాసింగ్‌ చేస్తే ఒకటి, రెండు మాత్రమే విజయవంతం అవుతాయి. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని వేళలు ఉంటాయి. అప్పుడు చేస్తేనే సక్సె్‌సకు అవకాశం ఉంటుంది.

55-Navya.jpg

ఇదీ ప్రత్యేకత...

ఈ మామిడికి సంబంధించి వంద గ్రాముల్లో టోటల్‌ సాలిబుల్‌ సాలిడ్స్‌ (టీఎ్‌సఎస్‌) 24 గ్రాములు, కెరోటినాయిడ్స్‌ రెండు నుంచి 2.5 మిల్లీ గ్రాములు, విటమిన్‌-సి 40 నుంచి 100 మిల్లీ గ్రాములు ఉంటాయనీ, యాంటీ ఆక్సిండెంట్స్‌ లాంటివన్నీ ఉన్నాయని గుర్తించాం. ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌’లో అనాలసిస్‌ చేయించాం. 40 మంది శాస్త్రవేత్తలతో రీవేల్యుయేషన్‌ను అదే ఇనిస్టిట్యూట్‌లో చేయించాం. రుచి, రంగు, ఆకృతి, పల్ప్‌, వాసన, ఫీల్‌, ఫైబర్‌ లాంటి అంశాల్లో ఈ మామిడి అద్భుతంగా ఉందం టూ అత్యున్నతంగా ఐదు స్కోరింగ్‌ ఇచ్చారు. దీంతో ఈ మామిడికి తగిన గుర్తింపు లభించినట్టయింది. అయితే... అంతా బాగున్నా కాయ చిన్నగా ఉందన్న విమర్శ వచ్చింది. అప్పుడు ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేశాం. ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంటుందని గుర్తించి, ఫ్రీజ్‌ చేసి కింద ఒక పుల్ల పెట్టాం. దీన్ని ‘అమృతం ఐస్‌ఫ్రూట్‌ మ్యాంగో’ పేరుతో మార్కెట్‌లోకి తీసుకెళుతున్నాం. దీన్ని ఆరేళ్లపాటు కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ ఉంచవచ్చు. రుచి, నాణ్యత పాడవదు.


మంచి ఆదాయానికి అవకాశం

మామిడి పండు తినాలంటే వేసవి వరకు వేచి ఉండాల్సిందే. ఇప్పుడిప్పుడు కొన్ని రకాల మామిడి కాయలు సీజన్‌తో సంబంధం లేకుండా మార్కెట్‌లో లభ్యమవుతున్నా సీజన్‌లో దొరికే మామిడి పండ్లంత రుచి ఉండడం లేదు. అదే సమయంలో మామిడి పండించే రైతులకు గిట్టుబాటు ధర లేక, పంటను ఎక్కువ కాలం స్టోర్‌ చేసుకునే అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఉంటోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారాన్ని చూపించడంతోపాటు రైతుకు, దేశానికి కూడా మామిడి ద్వారా ఎక్కువ ఆదాయాన్ని కల్పించేలా చేసేందుకు నాన్న కృషి చేశారు. ఆసక్తితో వచ్చిన రైతులకు ఐదు వేల మొక్కలు అందించాం. ఇప్పటి వరకు 20 ఎకరాల్లో రెండువేల మొక్కలను పలువురు రైతులు నాటారు. ఒక చెట్టుకు మూడేళ్ల తరువాత 100 కాయలు, పదేళ్ల తరువాత వెయ్యి కాయలు వస్తాయి. అంటే పదేళ్ల తరువాత ఒక్కో చెట్లు నుంచి లక్షల రూపాయల ఆదాయం సంపాదించుకొనే అవకాశం రైతులకు లభిస్తుంది. ఇంటి ముందు మొక్క వేస్తే పదేళ్ల తరువాత ఏడాదికి రూ.50 వేలు నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుంది. ఐస్‌ క్రీమ్‌ మాదిరిగా తినేందుకు అవకాశం ఉండడంతో వినియోగదారులు ఇష్టపడుతున్నారు. రైతులు, టెర్రస్‌ గార్డెనింగ్‌ చేసేవాళ్లు వీటిని వినియోగించుకోవచ్చు. ఇప్పటివరకు అనేక రాష్ట్రాలకు చెందిన రైతులు, పలువురు శాస్త్రవేత్తలు ఈ మొక్కలను తీసుకెళ్లి సాగు ప్రారంభించారు. ఈ చెట్టు ఆకులో ఔషధ విలువలు కూడా ఉన్నాయి.’’

బూటు శ్రీనివాస్‌,

ఫొటోలు: వై.రామకృష్ణ


ఏడాది పొడవునా తినేలా...

ఉత్తర భారతదేశానికి చెందిన కొన్ని రకాల మామిడి కాయలను కిలో రూ.500 వరకు విక్రయిస్తున్నారు. మనవి తక్కువకు ఎందుకని భావించి ఢిల్లీ ఎగ్జిబిషన్‌లో కేజీ రూ.700కు పెడితే భారీగా అమ్ముడయ్యాయి. ఇప్పటికీ మార్కెట్‌లో అదే రేటుతో విక్రయాలు సాగిస్తున్నాం. దాంతో దీనికి ఒక బ్రాండ్‌ ఏర్పడింది. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా రుచి పాడవకుండా నిల్వ చెయ్యవచ్చు.. డీప్‌ ఫ్రిజ్‌లో నుంచి తీసి రెండు నిమిషాలు నీటిలో ఉంచితే మెత్తబడి... ఐస్‌ మాదిరిగా తినేందుకు వీలుగా ఉంటుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఒక స్టోర్‌లో వీటి అందిస్తున్నాం. ఉత్పత్తి పెరిగితే మరిన్ని స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది.

ఇవి కూడా చదవండి..

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

Updated Date - Apr 01 , 2026 | 01:39 AM