Share News

భోజన కుతూహలం

ABN , Publish Date - May 02 , 2026 | 01:17 AM

ఆమలకి అంటే పొట్ట నిండా పోషకాలు నిండిన అమృత భాండం అని. ఉసిరికాయలు పూర్వం కార్తీక మాసం సమయంలోనే అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు వివిధ ప్రాంతాలకు...

భోజన కుతూహలం

వృద్ధాప్యాన్ని జయించే ఉసిరి ఆమలకం కషాయామ్లం మధురం శీతలం లఘు!

దాహపిత్తవమీమేహా శోషఘ్నంచ రసాయనం!

ఆమలకి అంటే పొట్ట నిండా పోషకాలు నిండిన అమృత భాండం అని. ఉసిరికాయలు పూర్వం కార్తీక మాసం సమయంలోనే అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు వివిధ ప్రాంతాలకు చెందిన ఉసిరికాయలు ఏడాది పొడవునా మార్కెట్టుకు వస్తున్నాయి. కాబట్టి, రకరకాల పద్ధతుల్లో తాజా ఉసిరికాయల్ని అనునిత్యం వాడుకునే అవకాశం ఇప్పుడుంది.

  • ఆమలకిని ఆహారానికి ముందు, ఆహారంతో పాటుగానీ, ఆహరంగానూ, ఆహారం తరవాత కూడా తీసుకోవచ్చు. కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, పక్షవాతంలాంటి వాత వ్యాధులున్నవారికి, గ్యాసు, ఉబ్బరం ఉన్న వాళ్లకి ఆమలకి దివ్యౌషధం. దీని గుజ్జులో ఒక చెంచా స్వచ్ఛమైన నువ్వుల నూనె కలిపి తీసుకుని, తరువాత వేడి నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • స్థూలకాయం, షుగరు వ్యాధి, ఉబ్బసం ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు రోజూ ఒక ఉసిరికాయ తినటం వలన మేలు కలుగుతుంది. ఉసిరికాయ గుజ్జులో పసుపు, అల్లం మిరియాల పొడి, కొత్తిమీర, పొదీన లాంటివి కలిపి టీ కాచుకుని ఉదయం తాగితే ఉపయోగకరంగా ఉంటుంది.

  • కడుపులో మంట, అల్సర్లు, వాంతి, వేడి చేసిన లక్షణాలతో బాధపడేవారికి ఉసిరికాయ గుజ్జుతో తేనె కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

  • ఉసిరికాయల గుజ్జు, దాల్చినచెక్క పొడి, పసుపు ఒక కప్పు నీళ్లలో కలిపి మరిగించి రోజూ తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల వ్యాధుల్లో ఉపయోగకరం. దగ్గు, తీవ్రమైన జలుబు, పడిశ భారానికి ఇది మంచి ఔషధం.

  • ఉసిరికాయలు అమితంగా చలవనిస్తాయి. వేసవిలో దప్పిక తీరుతుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. జీర్ణశక్తిని పెంపు చేస్తుంది. వెన్నపూసతో తీసుకుంటే పేగులకు చలవతో పాటు మృదుత్వం కలుగుతుంది. కొద్దిగా బెల్లం, ఉసిరికాయ గుజ్జు కలిపి, ఓ కప్పు నీళ్లు పోసి మిక్సీ పట్టి తాగితే వెంటనే ఉపశమనం కనిపిస్తుంది. మూత్రాశయానికి సంబంధించిన సమస్యలన్నిటికీ ఉపయోగపడుతుంది.


  • రోజూ ఒక ఉసిరికాయ తీసుకొంటే మూత్రపిండాలు, లివరు ఆరోగ్యవంతంగా ఉంటాయి. కలబంద, ఆమలకీ కలిపి జ్యూసు తీసుకుని, అర కప్పు చొప్పున రోజూ తాగుతుంటే లివర్‌ బల సంపన్నం అవుతుంది.

  • ఆమలకి తీపి క్యాండీలు బజార్లో దొరుకుతాయి. పిల్లలకు రోజూ రెండు లేదా మూడు క్యాండీలు ఇస్తుంటే వారి శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది.

  • ఉసిరి మన ఆరోగ్య ఆరోగ్యసిరి. తేనెతోనో బెల్లంతోనో రోజూ కొద్దిగా ఉసిరి జ్యూసు ఇస్తూ ఉంటే పిల్లల్లో మేథాసంపత్తి పెరుగుతుంది. దురదలు, దద్దుర్లు, అకారణంగా వచ్చే జ్వరాలు, దప్పిక, అరికాళ్ల మంటలు, అజీర్తి, అన్నహితవు లేకపోవటం, మలబద్కం లాంటి సమస్యలన్నీ తగ్గటానికి ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆమలకీతో పప్పు, రోటిపచ్చడి చేసుకోవచ్చు. చారు కాచుకోవచ్చు. ఆమలకి పులిహార కమ్మగా ఉంటుంది. ఉసిరికాయ అంటే పోషకం మాత్రమే కాదు... ముసలితనం ముంచుకురాకుండా శరీర కాంతిని కాపాడుతుంది.

గంగరాజు అరుణాదేవి

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 01:17 AM