అమేయ... అందరి వేదిక..!
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:37 AM
శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతం కావచ్చు. వినోదాన్ని పంచే సినిమా పాటలు కావచ్చు. ఫక్కున నవ్వించే స్టాండప్ కామెడీ కావచ్చు. ఎవరు ఏ కళను ప్రదర్శించాలనుకున్నా...
విభిన్నం
శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతం కావచ్చు. వినోదాన్ని పంచే సినిమా పాటలు కావచ్చు. ఫక్కున నవ్వించే స్టాండప్ కామెడీ కావచ్చు. ఎవరు ఏ కళను ప్రదర్శించాలనుకున్నా, అందుకు వేదికగా మారి, కళాపోషణకు తోడ్పడుతోంది హైదరాబాద్‌లోని ‘అమేయ సోషల్’. ఈ సంస్థను స్థాపించి అటు కళాకారులనూ, ఇటు సందర్శకులనూ అలరిస్తున్న రాధా కృష్ణవేణితో నవ్య మాటా మంతీ...
చాలా మంది పాటలు పాడగలుగుతారు. కొందరు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటారు. కానీ అందరూ వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వలేరు. సినిమాల్లో పాటలు పాడే స్థాయికీ చేరుకోలేరు. ఇలాంటి వాళ్లకు, వాళ్ల కళను ప్రదర్శించే అవకాశం కల్పించడమే అమేయ సోషల్ ఉద్దేశం. ఈ వేదికను 2024, డిసెంబరులో ప్రారంభించాం. మా ఫ్లాగ్‌షిప్ ఈవెంట్.. ఓపెన్ మై కారియోకె, ఓపెన్ మై కర్నాటిక్’! ప్రతి శని లేక ఆదివారాల్లో స్టేజ్ స్పేస్ బుకింగ్ కోసం, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటిస్తాం! పది నిమిషాల నిడివితో కూడిన ఈ స్టేజ్ స్పేస్‌ను పాటలు పాడడానికీ, కళల ప్రదర్శనకూ వాడుకోవచ్చు. రెండు సినిమా పాటలు లేదా రెండు కీర్తనలు లేదా కృతులు పాడుకోవచ్చు. ఈ వేదిక మీద కళాకారులు పాడే పాటలను ప్రేక్షకులెవరూ విమర్శించరు. బదులుగా ప్రోత్సహించడం అమేయ విశేషం.
నామమాత్రపు రుసుముతో...
వేదికను పంచుకోవాలనుకునేవారి నుంచి తలకు 400 రూపాయల చొప్పున, ప్రదర్శనకు విచ్చేసే ప్రేక్షకుల నుంచి తలకు 200 రూపాయల చొప్పున వసూలు చేస్తాం. దిబ్బరొట్టె, తేనె పానకం, ఉప్పుడు పిండి, ఉగ్గాణి బజ్జి మొదలైన సాంస్కృతిక మూలాలు కలిగిన రుచికరమైన పదార్థాలను అందరికీ అందిస్తాం! వేదిక పంచుకున్న గాయనీగాయకులు, కళాకారులు ఎంత బాగా పాడారు? అన్నది ఏమాత్రం ముఖ్యం కాదు. పదుగురి ఎదుట ప్రదర్శించగలిగాననే సంతృప్తి పొందగలిగితే మాకదే పది వేలు. అమేయ స్థాపన వెనకున్న ఉద్దేశం కూడా అదే! కాబట్టే ఓపెన్ మైక్ ప్రకటన్ కోసం కళాకారులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. వారాంతాల్లో ఏదో ఒక రోజు మాత్రమే ఇందుకోసం కేటాయిస్తాం. ఉదయం కర్నాటిక్ మ్యూజిక్, మధ్యాహ్నం, సాయంత్రం సినిమా సంగీతానికి కేటాయిస్తున్నాం. కేవలం సంగీతానికే పరిమితం కాకుండా, వ్యక్తిగత షూట్స్‌ను కూడా అనుమతిస్తూ ఉంటాం. కొందరు స్టాండప్ కామెడీ కోసం, ఇంకొందరు యూట్యూబ్ షూట్స్, పాడ్‌కాస్ట్ కోసం అమేయను ఎంచుకుంటూ ఉంటారు.
ప్రత్యేక ప్రదర్శనలు సైతం...
పెద్దలను, ప్రముఖులను గౌరవించుకోవడం కోసం కూడా అమేయను వినియోగించుకుంటూ ఉంటాం. తమ తమ రంగాల్లో లబ్దప్రతిష్ఠులైన ప్రముఖులను సాదరంగా ఆహ్వానించి, వారి అనుభవాలను ప్రేక్షకులను పంచుతూ ఉంటాం. హరిప్రియ, నాదప్రియ, కారుణ్య, మాళవిక మొదలైన శిక్షణ పొందిన గాయనీగాయకులను పిలిపించి, వారి చేత పాటలు పాడించి, కళామతల్లికి వారందించిన సేవలను, అనుభవాలను వారి చేత చెప్పించాం. ఏప్రిల్ ఒకటి విడుదల సినిమా వేడుక సందర్భంగా దర్శకులు వంశీ గారిని పిలిచి, సినిమా ప్లే చేసి, ఆయన చేత కబుర్లు చెప్పించి, ప్రేక్షకులను అలరించాం. గాయని సుశీల గారితో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. త్వరలో నేపథ్య గాయని జానకి గారిని ఆహ్వానించబోతున్నాం. దివంగత నేపథ్య గాయకులు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా గారి పుట్టిన రోజుల సందర్భంగా వారి పాటలతో ఒక ప్రత్యేక ప్రదర్శనను కూడా ప్లాన్ చేస్తున్నాం.
గోగుమళ్ల కవిత
ముగ్గురం కలిసి...
నాతో పాటు నటరాజ్ దేవరకొండ, ద్వారకానాధ్ పద్మనాభన్.. మేం ముగ్గురం కలిసి అమేయను స్థాపించాం. నటరాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. పద్మనాభన్ షికాగోలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నేను ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూనే అమేయ కార్యకలాపాలను, ప్రదర్శనలనూ పర్యవేక్షిస్తున్నాను. మేం ముగ్గురం పాటలు పాడతాం! మాలా పాటలు పాడేవాళ్లకు ఒక వేదికను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అమేయ సోషల్‌ను స్థాపించాం!
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News