Share News

అల్జీమర్స్‌కు ఆధునిక వైద్యం

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:57 AM

అల్జీమర్స్‌కు చికిత్స లేదు.. ఇది నిన్నటి మాట. కానీ నేడు ఈ రుగ్మతకు కచ్చితమైన వ్యాధి నిర్థారణ పరీక్షలు, సమర్థమైన చికిత్సలూ...

అల్జీమర్స్‌కు ఆధునిక వైద్యం

మతిమరుపు

అల్జీమర్స్‌కు చికిత్స లేదు.. ఇది నిన్నటి మాట. కానీ నేడు ఈ రుగ్మతకు కచ్చితమైన వ్యాధి నిర్థారణ పరీక్షలు, సమర్థమైన చికిత్సలూ అందుబాటులోకొచ్చాయి. రుగ్మత దశ, తీవ్రత ఆధారంగా రెండు విభిన్న చికిత్సా పద్ధతులతో అల్జీమర్స్‌కు చెక్‌ పెట్టొచ్చని భరోసా కల్పిస్తున్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్‌, శ్రీకాంత్‌ వేముల. ఈ ఏడాది అందుబాటులోకొచ్చిన ‘అమైలాయిడ్‌ థెరపీ’, ‘ట్రాన్స్‌క్రేనియల్‌ పల్స్‌ స్టిమ్యులేషన్‌’ చికిత్సలు, ప్రభావాల గురించి ఇలా వివరిస్తున్నారు.

బ్యాంకులో క్యాషియర్‌గా రిటైర్‌ అయిన నాన్న నోట్లు లెక్కబెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు...గంట క్రితం ఉప్మా తిన్న విషయం మర్చిపోయిన అమ్మ... పొద్దున్నుంచీ తానేమీ తినలేదని చెప్తూ ఉండొచ్చు...

ఇదంతా చూసి పైబడే వయసులో కాస్త తడబాటు, మతిమరుపు సహజమేనని సరిపెట్టుకోకూడదు. సాధారణ మతిమరుపు వేరు. అల్జీమర్స్‌ వేరు. పరధ్యానంలో మనందరం అడపాదడపా కొన్ని విషయాలను, వస్తువులను మర్చిపోతూ ఉంటాం. కానీ 65 ఏళ్లు దాటిన వాళ్లలో మతిమరుపును అల్జీమర్స్‌గానే అనుమానించాలి. సమస్య ముదిరిపోయి, కన్న పిల్లలను సైతం గుర్తుపట్టలేని స్థితికి దిగజారేవరకూ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. అందుకోసం అల్జీమర్స్‌ గురించి పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి.

అల్జీమర్స్‌ అంటే?

అల్జీమర్స్‌... నాడీక్షీణత రుగ్మత కేటగిరీకి సంబంధించిన ఆరోగ్య సమస్య. ఇన్‌ఫెక్షన్లు, దెబ్బలు, రక్తప్రసరణ లోపం.. ఇలా పలు కారణాల వల్ల మనం వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. అయితే అల్జీమర్స్‌ ఇందుకు పూర్తి భిన్నం. వయసు పైబడేకొద్దీ మెదడులో నాడుల తీరు మారుతుంది. కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఈ పరిస్థితి గురించి మనకు తెలుసు. కానీ ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? అన్నది ఎవరికీ తెలియదు. ఇంతకూ మెదడు కణాలైన న్యూరాన్లు ఎలా చనిపోతాయంటే.. ఆ కణాల పైన, లోపల కొన్ని విషపూరితమైన ప్రొటీన్లు చేరతాయి. కణాల బయట ‘అమైలాయిడ్‌’ అనే ప్రొటీన్‌ డిపాజిట్‌ అయితే, కణాల లోపల ‘ఫాస్ఫారిలేటెడ్‌ టౌ’ జమ అవుతుంది. ఈ కారణాల వల్ల అమైలాయిడ్‌ ఫ్లాక్స్‌, న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్‌ ఏర్పడి నాడీ కణాలు చనిపోతాయి. మెదడులోని కొన్ని భాగాలు ఈ పరిస్థితికి గురవడం వల్ల అల్జీమర్స్‌ తలెత్తుతుంది. అయితే గత ఏడాది వరకూ అల్జీమర్స్‌కు సమర్థమైన చికిత్సలు లేవు. క్లినికల్‌గా, సాధారణ పెట్‌ సిటి చేసి, అల్జీమర్స్‌ను నిర్ధారించి, జ్ఞాపకశక్తిని పెంచే మందులతో చికిత్స చేసేవారు. వీటితో పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వ్యాధిని కచ్చితంగా గుర్తించడంతో పాటు, దాని ఉద్ధృతిని నెమ్మదించే చికిత్సలు అందుబాటులోకొచ్చాయి.


ప్రధాన లక్షణాలు ఇవే!

అల్జీమర్స్‌ ప్రధాన లక్షణం మతిమరుపే అయినా, మర్చిపోయే విషయాలు విలక్షణంగా ఉంటాయి. అవేంటంటే...

  • తెలిసిన, చేయగలిగిన పనులను చేయలేకపోవడం

  • కొంతసేపటి క్రితం తిన్నది మర్చిపోవడం...

  • డబ్బు లెక్కపెట్టలేకపోవడం....

  • ఇంటికి దారి మర్చిపోవడం...

  • ఎంతోకాలం క్రితం జరిగినవి గుర్తున్నా, కొన్ని నిమిషాల క్రితం జరిగినవి గుర్తుండకపోవడం....

  • దుస్తులు వేసుకోవడం, గుండీలు పెట్టుకోవడం మర్చిపోవడం...

పలు కారణాలు

అల్జీమర్స్‌ ఉన్న వాళ్లు చూపులకు బాగుంటారు. నార్మల్‌గా కనిపిస్తారు. కానీ వాళ్లతో సంభాషిస్తూ, కొంత సమయం గడిపినప్పుడు అల్జీమర్స్‌ ఉన్న విషయం అర్థమవుతుంది. ప్రధానంగా ఈ రుగ్మత 60 ఏళ్లు దాటిన పెద్దల్లో కనిపిస్తుంది. అలాగని 60 ఏళ్లు దాటిన వాళ్లకే వస్తుందని అనుకోడానికి వీల్లేదు. వయసు పైబడేకొద్దీ ఈ రుగ్మత బారినపడే అవకాశాలు పెరుగుతాయి. అల్జీమర్స్‌ ముప్పు అందరికీ పొంచి ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. నిద్ర తక్కువైనా, కుటుంబ చరిత్రలో అల్జీమర్స్‌ ఉన్నా ఈ ముప్పు కొంత ఎక్కువగా ఉంటుంది. అల్జీమర్స్‌కు కచ్చితమైన కారణాలు ఇవీ అని ఇంతవరకూ నిర్ధారణ కాలేదు. కంటినిండా నిద్ర పోవడం, పిండి పదార్థాలు తగ్గించడం, సమతులాహారం తీసుకోవడం ద్వారా అల్జీమర్స్‌ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. నిద్రకూ అల్జీమర్స్‌కూ దగ్గరి సంబంధం ఉంది. పారిశుద్ధ్య వ్యవస్థలాగే మన మెదడులో గ్లింఫాటిక్‌ వ్యవస్థ ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులు ట్రాఫిక్‌ లేని రాత్రి వేళల్లోనే చెత్తను శుభ్రం చేస్తారు. మన గ్లింఫాటిక్‌ వ్యవస్థ కూడా మనం నిద్రపోయే సమయంలోనే మెదడు నాడుల మధ్య పేరుకున్న విషపూరిత రసాయనాలను తొలగించేస్తుంది. దాంతో నాడుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. నిద్ర పోవడం ద్వారా గ్లింఫాటిక్‌ వ్యవస్థ పనిచేయడానికి తగిన సమయాన్ని ఇవ్వకపోతే, న్యూరాన్ల పైన, లోపల ప్రొటీన్లు పేరుకుపోయి, నాడుల మధ్య సంబంధాలు క్షీణిస్తాయి. నాడీ కణాలు చనిపోతాయి. అలాగే తక్కువ నిద్రపోతూ, పిండిపదార్థాలు ఎక్కువగా తింటూ, వ్యాయామాలు చేయకపోతే, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరిగి, మెదడు మీద ప్రభావం పడుతుంది. అంతిమంగా అల్జీమర్స్‌కు గురవుతాం!


రుగ్మత నిర్ధారణ ఇలా...

అల్జీమర్స్‌ను నిర్ధారించడానికి గతంలో మోకా, సిడిఆర్‌ఎస్‌, అడాస్‌ కాగ్‌ అనే కొన్ని పద్ధతులను అవలంబించేవారు. మాంట్రియల్‌ కాగ్నిటివ్‌ అసె్‌సమెంట్‌ అనే పరీక్షతో కొంత మేరకు అల్జీమర్స్‌ను నిర్ధారించవచ్చు. క్లినికల్‌ డిమెన్షియా రేటింగ్‌ స్కేల్‌ పరీక్షలో అల్జీమర్స్‌ మోతాదు, దశలను తెలుసుకోగలిగేవారు. అడా్‌సకాగ్‌తో లక్షణాల తీవ్రతనూ కనిపెట్టగలిగేవారు. కానీ నిర్దిష్ట చికిత్సకు తగిన అర్హతను కనిపెట్టే కచ్చితమైన పరీక్షలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. అయితే, అన్ని పరీక్షల కంటే ముందు అల్జీమర్స్‌కు కారణమయ్యే బి12 లోపం, థైరాయిడ్‌ సమస్యలు, స్లీప్‌ ఆప్నియా మొదలైన ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. తర్వాత మునుపటి నుంచి వాడుకలో ఉన్న పరీక్షలతో పాటు కీలకమైన ‘అమైలాయిడ్‌ బీటా’, ‘ఫాస్ఫోరిలేటెడ్‌ టౌ’లను కనిపెట్టడం కోసం వెన్ను నుంచి నీరు తీసి పరీక్షించాల్సి ఉంటుంది. వెన్నులోని నీరులో ఈ ప్రొటీన్ల నిష్పత్తి ఆధారంగా అల్జీమర్స్‌ ఉందా?, లేదా? అన్నది కచ్చితంగా కనిపెట్టవచ్చు. వెన్ను నుంచి నీరు తీయడం కొంత క్లిష్టమైన వ్యవహారం. కాబట్టి ప్రత్యామ్నాయంగా రక్తపరీక్షను కనిపెట్టారు. దీంట్లో బ్లడ్‌ బేస్‌డ్‌ బయోమార్కర్ల నిష్పత్తి ఆధారంగా కూడా అల్జీమర్స్‌ను కచ్చితంగా కనిపెట్టవచ్చు. అల్జీమర్స్‌ చికిత్సకు ముందు రక్త పరీక్షతో పాటు, ఫలితం పాజిటివ్‌ వస్తే, వెంటనే వెన్ను నుంచి నీరు తీసే పరీక్ష కూడా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. చివర్లో అమైలాయిడ్‌ పెట్‌ సిటితో రుగ్మత ప్రదేశాన్ని కనిపెట్టి, చికిత్స మొదలుపెట్టుకోవచ్చు.

అమైలాయిడ్‌ థెరపీతో...

మెదడు కణాల లోపల, బయట పేరుకునే ప్రొటీన్స్‌ నాడీ కణాల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. ఈ నష్టం ఒక చోట మొదలై మెదడు మొత్తం వ్యాపిస్తుంది. అల్జీమర్స్‌ నుంచి ఎంత మెరుగ్గా కోలుకుంటారు అన్నది రుగ్మత దశ మీద ఆధారపడి ఉంటుంది. అల్జీమర్స్‌ నుంచి కోలుకోవచ్చా? అంటే.. గత ఏడాది వరకూ సాధ్యపడదనే అనుకునేవాళ్లం. కానీ ఈ ఏడాది అల్జీమర్స్‌ చికిత్సా విధానం మారింది. నాడీ కణాల మధ్య పేరుకునే అమైలాయిడ్‌ ప్లాక్స్‌ను తొలగించే మందులు నేడు అందుబాటులోకొచ్చాయి. పలు రకాల రుగ్మతల చికిత్సలో ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ్‌స’ను వినియోగిస్తూ ఉంటారు. అసాధారణ ప్రొటీన్‌ను బ్లాక్‌ చేయడానికి తయారుచేసిన ఒక యాంటీబాడీ, ఆ అసాధారణ ప్రొటీన్‌ కణాలను మరింత నష్టపరచకుండా అడ్డుకుంటుంది. లెకానిమాబ్‌, డొనానిమాబ్‌ అనే ఇలాంటి రెండు రకాల యాంటీబాడీస్‌ ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. ఇంజెక్షన్‌ రూపంలో ఉండే ఈ రెండు రకాల యాంటీబాడీ్‌సను 18 నెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాంటీబాడీస్‌ అమైలాయిడ్‌ ప్లాక్స్‌ను తొలగించగలుగుతాయి. కానీ రుగ్మతను పూర్తిగా నయం చేయవు. అయినప్పటికీ అల్జీమర్స్‌ లక్షణాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాధి పురోగతి నెమ్మదిస్తుంది. ఈ చికిత్సతో జరిగిన నష్టాన్ని సరిదిద్దడంతో పాటు, జరగబోయే నష్టాన్ని నెమ్మదించవచ్చు. మైల్డ్‌ కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌, మైల్డ్‌ అల్జీమర్స్‌లో ఈ చికిత్స తీసుకోవచ్చు. ప్రస్తుతానికి, నాడీకణం వెలుపలి ప్రొటీన్‌ అమైలాయిడ్‌కు అడ్డుకట్ట వేసే యాంటీబాడీ్‌సను కనిపెట్టగలిగినట్టే, భవిష్యత్తులో నాడీకణం లోపలి టౌను నిలువరించే చికిత్సను కూడా కనిపెట్టగలిగితే, అల్జీమర్స్‌ను నిర్మూలించగలుగుతాం.


ట్రాన్స్‌క్రేనియల్‌ పల్స్‌ స్టిమ్యులేషన్‌

అల్జీమర్స్‌ మందులు స్వల్ప కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌, మైల్డ్‌ అల్జీమర్‌ దశల్లో పని చేస్తాయి. కానీ మధ్యస్థ, తీవ్ర అల్జీమర్స్‌కు మందులను సూచించరు. అయినా మందులను వాడుకునే వాళ్లుంటారు. దీంతో ఫలితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే అమైలాయిడ్‌ థెరపీలో ఇచ్చే ఇంజెక్షన్లు అమైలాయిడ్‌ ప్లాక్స్‌ తొలగిస్తాయి. ఒకవేళ వాటి జోలికి వెళ్లకుండా, జ్ఞాపకశక్తి, ప్రణాళికలు, నిర్వహణలకు సంబంధించిన మెదడులోని భాగాలను ప్రేరేపించగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఒక సరికొత్త విధానాన్ని కనిపెట్టారు. యూరోపియన్‌ యూనియన్‌ ఆమోదించిన ఆ సాంకేతికతే...‘ట్రాన్స్‌క్రేనియల్‌ పల్స్‌ స్టిమ్యులేషన్‌’ (టిపిఎస్‌). పుర్రె గుండా తక్కువ తీవ్రత కలిగిన ఫోకస్డ్‌ అలా్ట్రసౌండ్స్‌ను పంపిస్తూ, మెదడులోని కొన్ని భాగాలను ప్రేరేపించే చికిత్స ఇది. దీంతో నాడుల మధ్య కొత్త సంబంధాలు ఏర్పడతాయి. స్వల్ప అల్జీమర్స్‌ నుంచి మధ్యస్థ అల్జీమర్స్‌ వరకూ ఈ చికిత్సను ఎంచుకోవచ్చు. మొదటి నెల రోజుల్లో 6 నుంచి 10 సెషన్స్‌ ఇచ్చి, తర్వాత నుంచి నెలకోసారి ఏడాది పాటు టిపిఎస్‌ తీసుకోవలసి ఉంటుంది. సాధారణంగా మూడు నెలల నుంచి ఫలితం కనిపించడం మొదలవుతుంది. అమైలాయిడ్‌ థెరపీని ఎంచుకోలేనివాళ్లు టిపిఎస్‌ చికిత్సను ఆశ్రయించవచ్చు. అయితే మెదడులో రక్తస్రావం, రక్తపు గడ్డలు, కణుతులున్న వాళ్లు ఈ చికిత్సకు అనర్హులు. మూర్ఛతో పాటు మూర్ఛ మందులు వాడుతున్న వాళ్లకు కూడా ఈ చికిత్స చేయరు. ఈ చికిత్సతో తలనొప్పి, కొంత చికాకు తప్ప ఇతరత్రా తీవ్ర దుష్ప్రభావాలేవీ ఉండవు. అమైలాయిడ్‌ ఇంజెక్షన్ల ఆర్థిక భారాన్ని మోయలేని వారు, దుష్ప్రభావాలు వద్దనుకునేవాళ్లు టిపిఎస్‌ చికిత్సను ఆశ్రయించవచ్చు. ఇప్పుడీ టిపిఎస్‌ సాంకేతికత హైదరాబాద్‌ మాదాపూర్‌లో అందుబాటులో ఉంది.

అల్జీమర్స్‌ పలు రకాలు

తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతే అది మతిమరుపు/పరధ్యానం అవుతుంది. టూత్‌బ్ర్‌ష మీద పేస్ట్‌ వేయడమెలాగో మర్చిపోతే అది అల్జీమర్స్‌ అవుతుంది. 40 నుంచి 50 ఏళ్ల నడి వయస్కుల్లో కూడా అల్జీమర్స్‌ రావచ్చు. ఈ అల్జీమర్స్‌లో రకాలుంటాయి.

డిస్‌ఎగ్జిక్యూటివ్‌ సిండ్రోమ్‌: వీళ్లు అప్పటివరకూ అలవాటైన పనులన్నీ సక్రమంగా చేయగలుగుతున్నా, కొత్తగా ఏదైనా పనిచేయవలసి వచ్చినా, నేర్చుకోవలసి వచ్చినా దానికి అలవాటు పడలేరు.

లోగోపినిక్‌ ప్రైమరీ ప్రొగ్రెసివ్‌ అఫేసియా: ఈ కోవకు చెందిన వాళ్లలో మతిమరుపు పెద్దగా లేకపోయినా, మాటలు పలకలేకపోతూ ఉంటారు.

పోస్టీరియర్‌ కార్టికల్‌ అట్రోఫీ: కంటిచూపునకు సంబంధించిన సమస్యలొస్తాయి. కళ్లతో చూసి గుర్తుపట్టడం కష్టమవుతుంది.

బిహేవియరల్‌ వేరియెంట్‌ అల్జీమర్స్‌: ఇది ప్రవర్తనకు సంబంధించిన సమస్య. అరవడం, కోపగించుకోవడం, చికాకు పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.


అల్జీమర్స్‌ను పోలిన రుగ్మతలు

మెదడులో నీరు: హైడ్రోసెఫలస్‌ అనే సమస్యలో మెదడులో నీరు చేరడం వల్ల మతిమరుపు రావచ్చు. ఈ సమస్యలో నడక తడబడుతుంది. మూత్రం మీద నియంత్రణ కూడా తగ్గుతుంది. మన దేశంలో ఈ సమస్య సర్వసాధారణం.

ఫ్రాంటోటెంపొరల్‌ డిమెన్షియా: ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకునే ఈ సమస్య కూడా అల్జీమర్స్‌ను తలపిస్తుంది.

రక్తప్రసరణ లోపం: మెదడులో రక్తప్రసరణ లోపం తలెత్తినప్పుడు అల్జీమర్స్‌ లక్షణాలు కనిపించవచ్చు.

డిమెన్షియా ఫ్యూజిలిస్టికా: బాక్సింగ్‌ క్రీడాకారుల్లో వాళ్ల తలకు పదే పదే దెబ్బలు తగిలి డిమెన్షియాకు గురికావచ్చు.

మాదకద్రవ్యాలు: ఈ వ్యసనంలో తలెత్తే డిమెన్షియాను కూడా అల్జీమర్స్‌గా పొరబడుతూ ఉంటారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 03:57 AM