అల్యూమినియం ఫాయిల్‌తో చేటు
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:50 AM
తాజాగా ప్రతి వంటింట్లో అల్యూమినియం ఫాయిల్ వాడకం పెరిగిపోయింది. పదార్థాలు వేడి తగ్గిపోకుండా ఉండడం కోసం, ఓవెన్‌లో వంట పాత్రలను మూసి ఉంచడం కోసం...
అధ్యయనం
తాజాగా ప్రతి వంటింట్లో అల్యూమినియం ఫాయిల్ వాడకం పెరిగిపోయింది. పదార్థాలు వేడి తగ్గిపోకుండా ఉండడం కోసం, ఓవెన్‌లో వంట పాత్రలను మూసి ఉంచడం కోసం ఈ ఫాయిల్‌ను వాడుతున్నారు. అయితే అల్యూమినియం ఫాయిల్ వాడకంతో కొన్ని ముప్పులు తప్పవు. అవేంటంటే...
అల్యూమినియం ఫాయిల్ ఏ పదార్థాన్ని తాకినా, దాన్లోకి అల్యూమినియంను విడుదల చేస్తుందనే ఒక అధ్యయనం ఇంటర్నేషనల్ జోర్నల్ ఆఫ్ ఎలక్ర్టోకెమికల్ సైన్స్‌లో ప్రచురితమైంది. మరీ ముఖ్యంగా టమేటాలు, వెనిగర్, ఇతరత్రా మసాలాలు కలిపి వండే వంటకాలకు ఈ ముప్పు ఎక్కువ. అల్యూమినియం ఫాయిల్ నుంచి అల్యూమినియం విడుదలయ్యే మోతాదులను అంచనా వేయడం కోసం, యుఎఇ, ఈజిప్టుకు చెందిన కెమికల్ ఇంజనీర్ల బృందం, టొమాటో రసం, సిట్రిక్ యాసిడ్, ఉప్పు, యాపిల్ సిడార్ వెనిగర్, ఇతరత్రా మసాలాలను జోడించిన వంటకాలను అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఆవిరి మీద, ఓవెన్‌లో ఉడికించి వాటన్నిటినీ పరీక్షించి చూసింది. ప్రతి పరీక్షలో ఆ వంటకాల కోసం ఉపయోగించిన ఫాయిల్ బరువు తగ్గిపోవడాన్ని ఆ బృందం గమనించింది. ప్యాన్‌ను మూయడానికి ఉపయోగించిన ఫాయిల్ పరిమాణం, బరువు ఆధారంగా ఆయా పదార్థాల్లో కలిసిన అల్యూమినియం మోతాదును ఆ ఇంజనీర్ల బృందం అంచనా వేయగలిగింది. ఒక కిలో శరీర బరువుకు, వారానికి 2 మిల్లీగ్రాముల అల్యూమినియం సురక్షిత పరిమాణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించింది. ఈ పరిమాణం పెరిగినప్పుడు మరీ ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలున్నవారికీ, పసిపిల్లలకు ముప్పులు తప్పవు. కాబట్టి అల్యూమినియం ఫాయిల్ వాడకాన్ని తగ్గించడంతో పాటు, ఎలకో్ట్రకెమికల్ ప్రక్రియకు లోనైన హార్డ్ అయొనైజ్డ్ అల్యూమినియం పాత్రలనే వంటకాలకు ఉపయోగించాలని ఇంజనీర్ల బృందం సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్
మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..