Share News

బాధ్యతగా ఓ పరిష్కారం

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:46 AM

వ్యర్థాల నిర్వహణ దేశంలో అతిపెద్ద సవాలుగా మారింది. అందుకు ప్రధాన కారణం ఎవరో కాదు... మనమే అంటుంది పదిహేడేళ్ల మహీ మల్హానీ. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడం...

బాధ్యతగా ఓ పరిష్కారం

జెన్‌ జీ

వ్యర్థాల నిర్వహణ దేశంలో అతిపెద్ద సవాలుగా మారింది. అందుకు ప్రధాన కారణం ఎవరో కాదు... మనమే అంటుంది పదిహేడేళ్ల మహీ మల్హానీ. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడం... పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత తమది కాదన్నట్టు ఎవరికివారు వ్యవహరించడంవల్లే ఈ పరిస్థితి నెలకొందనేది ఆమె అభిప్రాయం. దీనికి పరిష్కారంగా చెత్త ఉన్న చోటికే వెళ్లే ఏఐ ఆధారిత రోబో డస్ట్‌ బిన్‌ను ఆమె రూపొందించింది. పలు విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఈ రోబో అద్భుత ఫలితాలను అందిస్తోంది.

ఆ విశేషాలు మహీ మాటల్లోనే...

‘‘మూడేళ్ల కిందటి మాట... స్కూల్‌ ట్రిప్‌లో భాగంగా ఢిల్లీలోని ‘సుందర్‌ నర్సరీ’కి వెళ్లాను. ఆ వారసత్వ పార్కు చరిత్ర, పునరుద్ధరణ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ నా దృష్టి దగ్గరలో నేలపై చిందరవందరగా పడివున్న ప్యాకెట్ల కవర్లు, సీసాలు, ఆహార పదార్థాలపైకి వెళుతోంది. చెత్తబుట్టలు ఉన్నప్పటికీ వాటి వద్దకు చెత్త చేరడంలేదు. కనీసం దాన్ని ఉపయోగించాలన్న స్పృహ కూడా లేకపోవడం నన్ను కలవరపెట్టింది. చాలామంది సులభమైన మార్గం ఎంచుకొని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఈ సమస్యకు రెండు కోణాలున్నాయని అర్థమైంది. ఒకటి చెత్త వేయడం. రెండోది సౌలభ్యానికి, బాధ్యతకు మధ్య ఉన్న తేడా. ఈ రెండింటికీ మధ్య ఉన్న అంతరాన్ని తొలగించగలిగితే పరిష్కారం లభిస్తుందని అనిపించింది.

యంత్రాల స్ఫూర్తితో...

ప్రస్తుతం నేను ఢిల్లీ ‘అమిటి ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో పన్నెండో తరగతి చదువుతున్నా. చిన్నప్పటి నుంచీ నాకు ఎలక్ర్టానిక్‌ వస్తువలపై మక్కువ. గాడ్జెట్‌లతో ఆడుకోవడమే కాదు, వాటిని విడదీసి పరిశీలించేదాన్ని. కోడింగ్‌పై కూడా అవగాహన పెంచుకున్నా. పైథాన్‌తో పాటు సీ ప్లస్‌ప్లస్‌, జావా స్ర్కిప్ట్‌లు నేర్చుకున్నా. యంత్రాలు ఎలా ఆలోచిస్తాయో, ఎలా కదులుతాయో తెలుసుకోవాలని అనుకున్నా. వాటికి మనుషుల్లానే తెలివిగా, మరింత కచ్చితత్వంతో పని చేయడం నేర్పించగలిగితే, వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం లాంటి రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో అవి దోహదపడతాయి కదా. ఆలోచన బాగుంది. వెంటనే ఆ పని మొదలుపెట్టాను.


సుదీర్ఘ పరిశోధన...

నా ఆలోచన ఆచరణలో పెట్టేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించడం ప్రారంభించాను. సౌలభ్యం, బాధ్యతలను మిళితం చేస్తూ, వ్యర్థాల సేకరణ, వర్గీకరణను ఆటోమేటిక్‌గా చేయగలిగే పరికరం రూపకల్పనకు పరీశోధనలు మొదలుపెట్టాను. ఐఐటీ ఢిల్లీకి వెళ్లాను. అక్కడి రొబోటిక్‌ విభాగం నిర్వహిస్తున్న ‘రాంచో ల్యాబ్స్‌’తో అనుసంధామయ్యాను. దీని కోసం నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. నాతోపాటు మా పాఠశాల కంప్యూటర్‌ టీచర్‌ దీప్‌శిఖా మేడమ్‌ కూడా మా బృందంలో సభ్యురాలయ్యారు. రోబోటిక్స్‌ నిపుణులు, మా టీచర్‌ తదితరుల సహాయ సహకారాలతో ప్రొటోటైప్‌ ‘ట్రాష్‌బాట్‌’ తయారు చేశాను. ఈ రోబో చెత్త ఎక్కడ ఉందో గుర్తించి, అటువైపు వెళుతుంది. ప్లాస్టిక్‌, ఆహార పదార్థాల లాంటివి వేరు చేస్తుంది. చూసేవారిలో చైతన్యం రగిలి, సామాజిక బాధ్యత గుర్తుకురావాలనేది నా ఆశయం.

పార్కింగ్‌ సెన్సార్లలాగా...

ఈ రోబోను స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా నియంత్రించవచ్చు. లేదంటే అలా వదిలేస్తే దానంతట అదే తిరిగి వ్యర్థాలను సేకరిస్తుంటుంది. కారు పార్కింగ్‌ సెన్సర్ల మాదిరిగా ఇందులోని అల్ర్టాసానిక్‌ సెన్సర్లు పని చేస్తాయి. ధ్వని తరంగాలను పంపి, సమీపంలోని వస్తువులను గ్రహించడానికి ఉపయోగపడతాయి. మనలాగే ఈ రోబో కూడా దారిలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే ఆగిపోతోంది. లేదంటే పక్క నుంచి వెళుతుంది. వ్యర్థాలను వేరుచేయగానికి ట్రాష్‌బాట్‌ కెమెరాను, ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఒక వస్తువును చూసినప్పుడు దాని ఫొటోలు తీసి, అప్పటికే అందులో లోడ్‌ అయివున్న చిత్రాలతో పోల్చి చూసుకొంటుంది. ఇది మనిషిలానే చూస్తుంది. వస్తువులను గుర్తిస్తుంది. కానీ మరింత వేగంగా, పొరపాట్లకు తావు లేకుండా పని చేస్తుంది.

ఎక్కడైనా సరే...

‘ట్రాష్‌బాట్‌’ను మొదట మా ఇంట్లో, ఆ తరువాత బాగా రద్దీగా ఉండే మా పాఠశాల క్యాంటీన్‌లో పరీక్షించాను. అలాగే మా కమ్యూనిటీలో శుభకార్యాలప్పుడు పరిశీలించాను. చాలా అద్భుతంగా పని చేసింది. ఈవెంట్ల సమయంలో బాగా ఉపయోగపడింది. దీంతో మరికొన్ని ప్రాంతాల్లో పరీక్షించాను. సత్ఫలితాలు ఇచ్చింది. గత ఏడాది మార్చి నుంచి నోయిడాలోని రెండు నివాస సముదాయాలవారు, ఉదయ్‌పూర్‌లోని ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ట్రాష్‌బాట్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే రెండున్నర గంటలు నడుస్తుంది. తొలి రోబోకు ఇరవై వేలు ఖర్చయింది. మూడోసారి చేసినప్పుడు 4వేలు మాత్రమే అయింది. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌’లో టాప్‌-50కి ఎంపికయింది. ఇప్పుడున్నది తొంభై శాతం కచ్చితత్వంతో పని చేస్తుంది. వంద శాతం కచ్చితత్వం సాధించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నాను.’’

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

Updated Date - Jul 02 , 2026 | 03:46 AM