పెద్దలకూ టీకాలు
ABN , Publish Date - May 12 , 2026 | 04:32 AM
చిన్నప్పుడు మనందరం టీకాలు వేయించుకున్నాం. కాబట్టి ఆ రక్ష జీవితాంతం కొనసాగుతుందని అనుకుంటే పొరపాటు. వయసు పెరిగేకొద్దీ టీకాల సామర్థ్యంతో పాటు...
వ్యాక్సినేషన్
చిన్నప్పుడు మనందరం టీకాలు వేయించుకున్నాం. కాబట్టి ఆ రక్ష జీవితాంతం కొనసాగుతుందని అనుకుంటే పొరపాటు. వయసు పెరిగేకొద్దీ టీకాల సామర్థ్యంతో పాటు వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది కాబట్టి పెద్ద వయసులో కూడా మరోసారి టీకాలు వేయించుకోవడం అవసరం అంటున్నారు వైద్యులు
టీకాలు చిన్నతనానికే పరిమితం కాదు. అదొక జీవితకాలపు ప్రక్రియ. బాల్యంలో మొదలయ్యే ఈ ప్రక్రియ, ఎదిగిన వయసులో కొనసాగి, వృద్ధాప్యంలో కూడా వెన్నంటి ఉంటుంది. చిన్నప్పుడు తీసుకున్న టీకాల ప్రభావం 14 ఏళ్ల వయసుకే క్షీణించడం మొదలుపెడుతుంది. పైగా పెరిగే వయసుతో పాటు వ్యాధినిరోధకత సన్నగిల్లుతుంది. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో ‘ఇమ్యునోసెనిసెన్స్’ అంటారు. ఫలితంగా మన వ్యాధినిరోధక శక్తి సామర్థ్యం మునుపటిలా సమర్థంగా ఉండదు. బదులుగా వ్యాధికారక సూక్ష్మజీవులతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. 30, 40 ఏళ్ల నుంచి మొదలయ్యే ఈ క్షీణత క్రమేపీ పెరుగుతూ 60 ఏళ్లకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఇలా చిన్నప్పుడు తీసుకున్న టీకాలు ప్రభావాన్ని కోల్పోవడం, పైబడే వయసుతో వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లడం, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్రా ఆరోగ్య సమస్యల కారణంగా, దురలవాట్ల వల్ల కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులకు సులభంగా గురవుతూ ఉంటారు.
వ్యాక్సీన్ నియంత్రిత వ్యాధులు
టీకాలతో నియంత్రించుకునే కొన్ని వ్యాధులున్నాయి. పలు రకాల వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరే పెద్దల్లో కనిపించే వ్యాధుల్లో ఎక్కువ శాతం వ్యాక్సీన్లతో నియంత్రించుకోదగినవే! అయితే వ్యాక్సీన్ల పట్ల అవగాహన లోపించడం వల్ల, వీటిని తీసుకోని పెద్దలు వ్యాధులకు గురవుతూ, ఆస్పత్రులపాలవుతూ ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. తక్కువ ఖర్చుతో కూడిన టీకాల ద్వారా ఈ వ్యాధులను నియంత్రించుకోగలిగే వీలున్నప్పటికీ, అవగాహన లేకపోవడం మూలంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్సలను ఆశ్రయించవలసి వస్తోంది. పైగా ఆరోగ్య బీమా లేకపోవడం, ఐసియులో చేరవలసి రావడం వల్ల ఖర్చు పెరిగి, ఈ పరిస్థితి కుటుంబాలకు మోయలేనంత భారంగా మారుతోంది. దీన్నుంచి తప్పించుకోవడం కోసం పెద్దలు కూడా టీకాలు తీసుకోవడం మొదలుపెట్టాలి.
ఏ టీకా.... ఏ వయసులో...
ఇన్‌ఫ్లూయెంజా: నవంబరు, డిసెంబరు, జనవరిలో ఫ్లూ సీజన్ మొదలవుతుంది. దీన్నుంచి తప్పించుకోడానికి వీలుగా కాస్త ముందుగానే ప్రతి ఏటా సెప్టెంబరు, అక్టోబరులో అప్‌డేట్ అయిన ఇన్‌ఫ్లూయెంజా టీకా అందుబాటులోకొస్తూ ఉంటుంది కాబట్టి 50 ఏళ్లు పైబడినవాళ్లు, ఈ టీకాను ప్రతి ఏటా తీసుకోవాలి. అలాగే ఉబ్బసం, సిఒపిడి, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు, ధూమపానం చేసేవాళ్లకు ఇన్‌ఫ్లూయెంజా ముప్పు ఎక్కువ. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు 45 ఏళ్ల నుంచే ఈ టీకా తీసుకోవడం కొనసాగించాలి
న్యూమోకోకల్: ఈ బ్యాక్టీరియా న్యుమోనియా, చెవి ఇన్‌ఫెక్షన్లు, మెనింగ్జయిటిస్, సెప్టిసీమియాలను కలిగిస్తుంది. మన దేశంలో పెద్దలు ఆస్పత్రిపాలయ్యే ప్రధాన కారణాల్లో ఈ ఇన్‌ఫెక్షన్ ముఖ్యమైనది. 62 నుంచి 65 ఏళ్లు పైబడిన పెద్దలు ఈ టీకా తప్పనిసరిగా తీసుకోవాలి. జీవితంలో ఒకసారి తీసుకునే న్యూమోకోకల్ టీకా ప్రస్తుతం అందుబాటులోకొచ్చింది. కాబట్టి ఈ టీకా ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కోమార్బిడ్ కోవకు చెందినవాళ్లు, క్యాన్సర్ రోగులు లాంటి ముప్పు ఎక్కువగా ఉన్న వాళ్లు 60 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే ఈ టీకా తీసుకోవాలి
షింగిల్స్: హెర్పిస్ జోస్టర్ అనే ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ చర్మం మీద దద్దుర్ల రూపంలో తలెత్తుతుంది. అవి తగ్గిపోయినా, ఆ ప్రదేశంలో కొన్ని నెలలు, ఏళ్ల పాటు భరించలేనంత నొప్పి వేధిస్తుంది. కాబట్టి పెద్దలు ఆరు నెలల వ్యవధితో రెండు డోసుల షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి
హెచ్‌పివి: హ్యూమన్ పాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను కలిగిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆడ, మగ పిల్లలు తొలి లైంగికక్రీడకు ముందు ఈ వ్యాక్సీన్ తీసుకోవడం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెండు డోసుల హెచ్‌పివి వ్యాక్సీన్‌కు 9 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు తగిన వయసుగా సూచించింది. అయితే 25 నుంచి 45 ఏళ్ల మహిళల్లో కూడా ఈ వ్యాక్సీన్ ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే ఈ కోవకు చెందిన వాళ్లు మూడు డోసుల వ్యాక్సీన్ తీసుకోవాల్సి ఉంటుంది. పురుషుల్లో పురుషాంగ, పురీషనాళ క్యాన్సర్లు రాకుండా మగపిల్లలకు కూడా ఈ వ్యాక్సీన్ ఇప్పించడం అవసరం.
డిపిటి: 60 ఏళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతి పదేళ్లకోసారి టిడాప్ వ్యాక్సీన్ తీసుకుంటూ ఉండాలి. ఈ వ్యాక్సీన్ టెటనస్, డిఫ్తీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది

ప్రత్యామ్నాయ టీకాలు
తప్పనిసరి కాకపోయినా, అవసరం ఉన్న వాళ్లు తప్పనిసరిగా తీసుకోవలసిన టీకాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
హెపటైటిస్ బి, ఎ: ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవాళ్లు ఈ టీకా తప్పనిసరిగా తీసుకోవాలి
ఎల్లో ఫీవర్: ఆఫ్రికా దేశాలకు ప్రయాణమయ్యేవాళ్లు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి
రేబీస్: కుక్కలతో సన్నిహితంగా మెలిగేవారు, పెంపుడు కుక్కలు కలిగినవారు ఈ టీకా తీసుకోవడం తప్పనిసరి
టీకాలన్నీ సురక్షితం
సాధారణంగా టీకా అనగానే పెద్దలు భయానికి లోనవుతూ ఉంటారు. కొవిడ్ కాలంలో కొన్ని టీకాలు సమస్యలను తెచ్చిపెట్టడంతో టీకాల పట్ల సర్వత్రా కొంత అయోమయం, అనుమానం నెలకొని ఉంటోంది. అయితే కొవిడ్ కొత్త ఇన్‌ఫెక్షన్. దాని కోసం తయారుచేసిన వ్యాక్సిన్ కూడా కొత్తదే! పైగా ఆ టీకాలకు ట్రయల్స్ పెద్దగా జరగలేదు. కాబట్టి అవి కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉన్నాయి. కానీ నేడు అందుబాటులో ఉన్న పెద్దల టీకాలన్నీ విస్తృత పరిశీలనలు, ప్రయోగాల తదనంతరమే అందుబాటులోకొచ్చాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ అత్యంత సురక్షితం. కాబట్టి జీవిత నాణ్యతను పెంచుకోవడం కోసం, అనవసరపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం, కొమార్బిడ్ కోవకు చెందినవాళ్లు, ఆరోగ్యవంతులైన పెద్దలు తప్పనిసరిగా టీకాలు తీసుకుని, వ్యాధులకు అడ్డుకట్ట వేయాలి.
డాక్టర్ కె. శశి కిరణ్,
సీనియర్ జనరల్ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత