స్వేచ్ఛే నా అసలు రూపం
ABN , Publish Date - Oct 11 , 2026 | 01:56 AM
గ్లామర్ లోకంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆడంబరాల వెనుక ఉన్న తన అసలైన రూపాన్ని, లోపలి పసితనాన్ని కాపాడుకోవడమే అసలైన అందమని అంటోంది...
సండే సెలబ్రిటీ
గ్లామర్ లోకంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆడంబరాల వెనుక ఉన్న తన అసలైన రూపాన్ని, లోపలి పసితనాన్ని కాపాడుకోవడమే అసలైన అందమని అంటోంది నటి అదితిరావు హైదరి. ఫ్యాషన్ ప్రపంచపు అంచులు.. వెండితెర వెలుగుల వెనుక తనలోని నర్తకిని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకుంటూ తన గళాన్ని విప్పిన తీరును తాజాగా ‘ఫెమినా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
ఫొటోషూట్ సమయంలో నేను ధరించిన బ్లాక్ కార్సెట్ డ్రెస్ ఎంతో అద్భుతంగా, ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో చెక్కినట్టుగా ఉంది. అయితే, మూడో లేదా నాలుగో అవుట్‌ఫిట్ మారే సమయానికి కాళ్లకు ఉన్న ఎత్తైన హీల్స్ విప్పేసి, తదుపరి షాట్ కోసం ఒట్టికాళ్లతో నిలబడొచ్చా? అని అడిగాను. ఆ నిమిషంలో నా కాళ్లకు ఉన్న చెప్పులు తీసేసి నేలపై పాదాలు మోపగానే నాలో ఏదో తెలియని మార్పు వచ్చింది. ఏదో నటనాత్మకమైన భంగిమలా కాకుండా ఆ దుస్తులతో, ఆ క్షణంతో ఒక ఆత్మీయ బంధం ఏర్పడినట్టు అనిపించింది. నేను ఐదేళ్ల పసివయసు నుంచే శాస్త్రీయ నృత్య సాధన చేస్తున్నాను. అందుకే నా శరీరంతో నేను ఎప్పుడూ ఎంతో సౌకర్యంగా ఉంటాను. శరీరాన్ని సిగ్గుపడేలాగా లేదా దాచుకోవాల్సిన దానిగా నేను ఎప్పుడూ చూడలేదు. నృత్యం నా శరీరానికి ఒక స్వేచ్ఛను ఇచ్చింది.
సహజత్వానికి పట్టాభిషేకం
నేను ఏ దుస్తులు ధరించినా, ఒక పాత్రలో నటించినా లేదా రెడ్‌కార్పెట్‌పై నడిచినా.. అందులో నా అసలైన ముద్ర ఉండాలని కోరుకుంటాను. నాకు వాటితో ఒక భావోద్వేగ అనుబంధం ఏర్పడాలి. ‘ఈ దుస్తులు నాకు చెందుతాయి. నేను వీటికి చెందుతాను’ అనే భావన కలిగినప్పుడే మానసికంగా దానికి కనెక్ట్ కాగలను. తెరపై కనిపించే మెరుపుల వెనుక ఒక సాదాసీదా మహిళ ఉంది. రోజూ ఉదయం లేవగానే నేనేమీ లెహంగాలు, షరారాలు వేసుకోను. ఇంట్లో ఎప్పుడూ ఒట్టి కాళ్లతోనే తిరిగే సరదా మనిషిని. నా చుట్టూ ఉన్న వాళ్లని సరదాగా తెలియకుండానే నవ్వించే అలవాటు నాకుంది. పరిశ్రమలోకి రాకముందు, రెడ్‌కార్పెట్ మెరుపులు చూడకముందు, నా నటనపై ఇతరులు అభిప్రాయాలు చెప్పకముందు నాలో ఉన్న ఆ సహజమైన అదితిని కాపాడుకోడమే ముఖ్యమైన విషయం. అమ్మ నేర్పిన విద్య.. అమూల్యమైన వారసత్వం, నాలోని ఐదేళ్ల చిన్నారి కుతూహలం, ఆశలు, కలలు కనే తత్వం ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. నా తల్లి, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు విద్యారావు, అలాగే నాయనమ్మ, విద్యావేత్త శాంతా రామేశ్వర్‌రావు నుంచి నాకు కళలు, సంగీతం, పుస్తకాలు, కథలు వారసత్వంగా వచ్చాయి. నా చిన్నతనం అంతా నాట్యం, సంగీతం, అద్భుతమైన కథల నడుమ ఒక వర్ణ రంజితమైన ప్రపంచంలో గడిచింది. ఇవిలేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. వారు నాకు కళలను మాత్రమే ఇవ్వలేదు. ఒక గొప్ప జీవన దృక్పథాన్ని ఇచ్చారు. నా చిన్నతనంలో అమ్మ చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. ‘‘నువ్వు నిజమైన కళాకారిణివి అయితే నిన్ను ఎవరూ తగ్గించలేరు. జీవితంలో ఎత్తు పల్లాలు వచ్చినా.. నీలోని సృజనాత్మకతే నీ అతిపెద్ద బహుమతి’’ అని అమ్మ చెప్పిన మాటలు నా జీవితానికి, కెరీర్‌కు దిక్సూచిగా మారాయి.
‘మణిరత్నం హీరోయిన్’ కల
గతాన్ని తలచుకోవడానికి నేను పెద్దగా ఇష్టపడను. వర్తమానంలో జీవిస్తూ, కొత్త అనుభవాల కోసం, భవిష్యత్తు కోసం ఆశగా ఎదురుచూస్తుంటాను. అయితే, నా పదేళ్ల వయసులో కన్న ఒక గొప్ప కల నన్ను నిరంతరం వెంటాడేది. అప్పట్లో ‘బొంబాయి’ సినిమాలోని ఒక పాట చూసి, మణిరత్నం మాయాజాలంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో, రాజీవ్ మీనన్ ఛాయాగ్రహణంలో పడిపోయాను. ఎలాగైనా ఆయన దర్శకత్వంలో నటించి ‘మణిరత్నం హీరోయిన్’ కావాలని కలలు కన్నాను. 2017లో ‘కాట్రు వెళియిడై’ (చెలియా) ద్వారా ఆ కల నిజమైంది. ఆయనతో పనిచేయడం నా జీవితాన్ని అన్ని విధాలా మార్చేసింది. చిన్నప్పుడు కన్న కలలు నిజమవుతాయని నాపై నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఆ అనుభవం నాలోని ఆ చిన్నారి ఉత్సాహానికి, అన్వేషణకు ఒక గుర్తింపును, విశ్వాసాన్ని నింపింది.
సినిమాల ఎంపిక వెనుక
సినిమాలను ఎంచుకోవడంలో నాకు ఎలాంటి నియమావళి ఉండదు. ఒక కథ విన్నప్పుడు నాలో కలిగే ఆ ఉత్తేజం, ఒత్తిడి ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాను. దర్శకుడి భావన, ఆ సృజనాత్మక ప్రపంచం నన్ను కట్టిపడేయాలి. నా కడుపులో సీతాకోక చిలుకలు ఎగిరినట్టుగా ఒక వింత భావన కలిగి, ఆ సృష్టికర్త విజన్‌కు నన్ను నేను అప్పగించుకోవాలని అనిపిస్తే చాలు.. నేను ఆ ప్రాజెక్టులోకి దిగిపోతాను. ‘శృంగారం’తో నా నటనా ప్రస్తానం మొదలై, రీసెంట్‌గా ‘హీరాముండి’లో బిబ్బోజాన్ వరకు నా పాత్రలు సంగీతం, నృత్యంతో ముడిపడి ఉన్నాయి. ఒక సినిమా గెలుపోటముల కంటే తరతరాలుగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే సినిమాత్మక వారసత్వంలో భాగం కావడమే నా అంతిమ లక్ష్యం.
ఆంతరంగిక శాంతి
నా ఉనికి, నా ఆత్మగౌరవం కెమెరా వెలుగులతో ముగిసిపోయేవి కావు. ప్రతి ఉదయం సంతోషంగా నిద్రలేవడం, రాత్రి కృతజ్ఞతతో నిద్రపోవడంలోనే అసలైన ఆనందం ఉంది. చుట్టూ ఎంతటి గందరగోళం, శబ్దం ఉన్నా నా మనసులో ఒక మధురమైన సంగీతాన్ని వినడానికి ప్రయత్నిస్తాను. నా తోటి మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే.. జీవితంలో మీరు ఎన్ని పాత్రలు పోషిస్తున్నా.. మీ కోసం మీరు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకోండి. మీలోని చిన్నారిని సజీవంగా ఉంచడానికి నాట్యం, పాట, చిత్రలేఖనం, పరుగు, పియానో వాయించడం లేదా ఒంటరిగా సముద్రపు అలలను చూడటం.. ఏదో ఒక పనిని కేవలం మీ ఆంతరంగిక సంతోషం కోసం ప్రతిరోజూ చేయండి. అదే మీకు నిజమైన స్వేచ్ఛను, ఆనందాన్ని ఇస్తుంది.
భయం.. ధైర్యం కలబోత
దర్శకుడు ఇంతియాజ్ అలీతో పనిచేయాలనేది నా పాత కల. కానీ, ‘ఓ సాథీ రే’ స్ర్కిప్ట్ మొదట చదివినప్పుడు అందులోని కంటెంట్ నా తలకు ఎక్కక నేను ఆ సినిమా చేయలేనని తిరస్కరించాను. ఆ తర్వాత ఆయన వచ్చి ఆ పాత్రల స్వభావాన్ని, ఆ ప్రపంచంలో ఉండే సృజనాత్మక గందరగోళాన్ని వివరించినప్పుడు నాలో భయంతో కూడిన ఒకరకమైన ధైర్యం వచ్చింది. అలాగే ‘లస్ట్ స్టోరీస్ 3’లో విశాల్ భరద్వాజ్‌తో, నా భర్త సిద్ధార్థ్‌తో కలిసి నటించడం ఒక అద్భుతమైన అనుభవం. సిద్ధార్థ్ ఎప్పుడూ ఒక అద్భుతమైన కోస్టార్. కెమెరా ముందు బాధ, కోపం, ప్రేమ, ఆకాంక్షలు వంటి అత్యంత సున్నితమైన భావోద్వేగాలను ఎలాంటి సంకోచం లేకుండా ఆవిష్కరించడం నటులకు మాత్రమే దక్కిన ప్రత్యేక కళ.
ఇవి కూడా చదవండి..
భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..
ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి