యాసిడ్ రిఫ్లక్స్‌తో సమస్యా...
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:40 AM
కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి తన్నుకు రావడాన్నే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. దీనివల్ల ఛాతిలో మంట, పుల్లటి త్రేన్పులు, మింగడంలో ఇబ్బంది, పొడి దగ్గు, గొంతులో ఏదో అడ్డుపడినట్లుండడం లాంటి సమస్యలు...
కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి తన్నుకు రావడాన్నే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. దీనివల్ల ఛాతిలో మంట, పుల్లటి త్రేన్పులు, మింగడంలో ఇబ్బంది, పొడి దగ్గు, గొంతులో ఏదో అడ్డుపడినట్లుండడం లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి.
కారణాలు: అన్నవాహిక కింది భాగంలో ఉండే కండరాలు బలహీనమవడం వల్ల కడుపులోని ఆమ్లాలు పైకి వస్తుంటాయి. ఊబకాయం, పొట్టపై ఒత్తిడి పెరగడం, తిన్న వెంటనే పడుకోవడం, దూమపానం, మద్యపానం వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. ఎక్కువగా నూనె పదార్థాలు, స్వీట్లు తినడం కూడా కారణం కావచ్చు.
ఉపశమనం ఎలాగంటే: ఆహారం తీసుకున్న తరువాత చక్కెర లేని చూయింగ్ గమ్‌ను నోట్లో వేసుకుని నములుతూ లాలాజలాన్ని మెల్లగా మింగుతుంటే చాలావరకు సమస్య తీరుతుంది. రోజూ రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందే భోజనాన్ని ముగించాలి. భోజనం తరువాత కనీసం పావుగంటసేపు నడవడం మంచిది. పడుకొనేటప్పుడు తల భాగం ఆరు నుంచి ఎనిమిది ఇంచులు ఎత్తుగా ఉండేలా ఏర్పాటు చేసుకుంటే అన్నవాహికలోకి ఆమ్లాలు రావు. ఎడమవైపునకు తిరిగి పడుకుంటే ఈ యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలను నియంత్రించుకోవచ్చు. కడుపులో ఆమ్లత్వాన్ని పెంచే కాఫీ, టీ, స్వీట్లు, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలాలు, పులుపు-కారం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ఆహారాన్ని ఒకేసారిగా కాకుండా కొద్దికొద్దిగా తింటుంటే క్రమంగా సమస్య నుంచి బయటపడవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..