కుల వివక్షపై... అక్షర విప్లవం!
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:30 AM
ఒకటో తరగతిలో తోటి పిల్లల అవమానాలు భరించలేక లంచ్‌బాక్స్ దాచుకుని ఏడ్చిన ఆ చిన్నారి.. నేడు వేలమంది చిన్నారుల భవిష్యత్తుకు వెలుగులు చూపే మార్గదర్శిగా మారింది....
స్ఫూర్తి
ఒకటో తరగతిలో తోటి పిల్లల అవమానాలు భరించలేక లంచ్‌బాక్స్ దాచుకుని ఏడ్చిన ఆ చిన్నారి.. నేడు వేలమంది చిన్నారుల భవిష్యత్తుకు వెలుగులు చూపే మార్గదర్శిగా మారింది. కుల వివక్ష, పేదరికం అనే చీకట్లను చీల్చుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించిన సునీతా విశ్వాస్... ‘తృతీయ రత్న’ సంస్థ ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు.
చిన్నతనంలో నలుగురితో కలిసి భోజనం చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఒకటో తరగతి చదువుతున్న ఆ చిన్నారికి మాత్రం మధ్యాహ్న భోజన సమయం ఒక నరకంలా మారేది. ‘నువ్వు స్నానం చేయవు.. పిల్లులను తింటావు’ అంటూ తోటిపిల్లలు హేళన చేస్తుంటే, ఆ మాటలు భరించలేక తన లంచ్‌బాక్స్‌ను టేబుల్ కింద దాచుకుని ఏడుస్తూ తినేది. ఢిల్లీలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి పూర్తయ్యే వరకు ఆమె పాఠశాల జీవితమంతా ఆ టేబుల్ కిందే, ఆ అవమానాల నీడలోనే సాగింది. ఆ చేదు అనుభవాలు ఆ పసి మనసుపై చెరగని ముద్రవేసినా.. భవిష్యత్తును మాత్రం నిర్వీర్యం చేయలేకపోయాయి. చిన్నతనంలో పడిన ఆ ఆవేదననే ఆయుధంగా మలచుకుని, నేడు సమాజంలో వెనుకబడిన పిల్లలకు నాణ్యమైన విద్య, గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారు సునీతా విశ్వాస్.
కష్టాల కడలిలో బాల్యం
ఢిల్లీలో జన్మించిన సునీతా విశ్వాస్ బాల్యం తీవ్ర పేదరికంలో గడిచింది. తండ్రి గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేసేవారు. ఆయన పదో తరగతి చదివినప్పటికీ కుల వివక్ష, పేదరికం కారణంగా చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక తల్లి లింగ, కుల వివక్ష వల్ల బడి ముఖమే చూడలేకపోయారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సునీతకు పాఠశాల స్థాయిలోనే కులవివక్ష ఎదురైంది. తోటి పిల్లలు ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను దూరంగా ఉంచేవారు. పిల్లల గుసగుసలు, హేళనలు వినలేక రోజూ టేబుల్ కింద లంచ్ బాక్స్ దాచుకుని భోజనం చేసేది. ఈ వరుస ఘటనలు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, అంతర్ముఖురాలిగా మార్చేశాయి.
‘టిస్’తో ఉత్తేజం
2014లో ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ (టిస్)లో సోషల్ వర్క్‌లో ఎంఏ చేయడం కోసం చేరడం సునీత జీవితంలో ఒక పెద్ద మలుపు. అక్కడ ఆమె కుల వ్యతిరేక ఉద్యమాలు, అంబేద్కర్, పూలే సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేశారు. ఈ అనుభవాలు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, సామాజిక న్యాయం కోసం పోరాడే సంకల్పాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత ఆమె ఎంఫిల్, పీహెచ్‌డీ కూడా పూర్తిచేశారు.
‘తృతీయ రత్న’ ఆవిర్భావం
కరోనా లాక్‌డౌన్ సమయంలో పాట్నాలోని నిరుపేద పిల్లలు ఉపాధి లేక ఆకలితో అల్లాడుతున్నారని, మళ్లీ భిక్షాటనవైపు మళ్లుతున్నారని తెలిసి సునీత చలించిపోయారు. స్నేహితురాలు ప్రసన్నకుమారితో కలిసి విరాళాలు సేకరించి 80 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. తమ స్కాలర్‌షిప్ డబ్బుతో ఒక టీచర్‌ను ఏర్పాటు చేసి పిల్లల చదువు ఆగిపోకుండా చూశారు. ఈ సేవా కార్యక్రమమే 2024లో ‘ఉప్పలం ఫౌండేషన్’ కింద ‘తృతీయ రత్న’ పేరుతో సంస్థగా నమోదైంది.
సామాజిక చైతన్య మార్గం
జ్యోతిబా పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో పనిచేస్తున్న ‘తృతీయ రత్న’ ప్రధానంగా నాలుగు విభాగాల్లో సేవలు అందిస్తుంది. బీహార్‌లోని జెహానాబాద్, జముయ్, ఔరంగాబాద్, పాట్నా జిల్లాల్లో కమ్యూనిటీ లైబ్రరీలు ఏర్పాటు చేసి ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు, పుస్తకాలు అందిస్తున్నారు. రెండోది.. మొదటితరం విద్యార్థులను యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేస్తూ, పేద అమ్మాయిలకు స్కాలర్‌షి్‌పలు అందిస్తున్నారు. మూడోది.. ‘బాల్ సభ’ ద్వారా పిల్లల్లో సామాజిక స్పృహ, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వంపై అవగాహన కల్పిస్తున్నారు. నాలుగోది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా చూస్తూ, బాల్య వివాహాలను అడ్డుకుని బాధితులకు చట్టపరమైన సాయం అందిసున్నారు.
సీఎ్‌సఆర్ నిధుల కొరత, స్థానిక ప్రతిఘటనలు ఎదురవుతున్నప్పటికీ సునీత వెనుకంజ వేయడం లేదు. ‘‘చదువు అంటే కేవలం మార్కులు, డిగ్రీలు సాధించడం కాదు. సమాజంలోని అసమానతలను ప్రశ్నించే చైతన్యాన్ని ఇవ్వడమే నిజమైన విద్య’’ అని చాటుతున్న సునీతా విశ్వాస్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
ఉన్నత విద్యలోనూ వేధింపులు
డిగ్రీ చదువు కోసం ఢిల్లీ యూనివర్సిటీలోని దౌలత్‌రామ్ కాలేజీలో చేరినప్పుడు కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఆ క్లాస్‌రూమ్‌లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని ఆమె ఒక్కరే. ఆ వాతావరణం చూసి కాలేజీ మానేద్దామనుకున్న సమయంలో కొందరు ఆమెకు అండగా నిలిచారు. ఆ తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’లో చేరినప్పుడు మరిన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫీల్డ్‌వర్క్ నివేదికలో వ్యాకరణ దోషాలు ఉన్నాయని సూపర్‌వైజర్ మందలిస్తూ, తండ్రి ఉద్యోగాన్ని ఎత్తిచూపి అవమానించారు. మరొక సందర్భంలో ప్రొఫెసర్ ఆమె అసైన్‌మెంట్‌ను ‘అత్యంత దారుణంగా ఉంది’ అంటూ ముఖం మీదే విసిరికొట్టారు. ఈ అవమానాలను తట్టుకోలేక, తీవ్ర మానసిక వేదనతో 2013లో పీజీ కోర్సును మధ్యలోనే వదిలేశారు.
ఈ వార్తలనూ చదవండి: