డాక్టర్ సూరి శ్రీమతి @: 92
ABN , Publish Date - May 13 , 2026 | 04:31 AM
వయసు పైబడుతున్న కొద్దీ మనిషిలో సేవ చేయాలనే సంకల్పం పెరగాలే తప్ప తగ్గకూడదని నిరూపిస్తున్నారు డాక్టర్ సూరి శ్రీమతి. తొమ్మిది పదుల వయసులో చాలామంది..
చైతన్య స్ఫూర్తి
వయసు పైబడుతున్న కొద్దీ మనిషిలో సేవ చేయాలనే సంకల్పం పెరగాలే తప్ప తగ్గకూడదని నిరూపిస్తున్నారు డాక్టర్ సూరి శ్రీమతి. తొమ్మిది పదుల వయసులో చాలామంది విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటే ఆమె మాత్రం నేటికీ ఆపరేషన్ థియేటర్లలో, క్లినిక్ గదుల్లో కొత్త ప్రాణాలకు ఊపిరి పోస్తూ అపర ధన్వంతరిలా కనిపిస్తున్నారు. తన డెబ్బై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు రెండు లక్షల మందికి పురుడు పోసిన ఆమె ‘నవ్య’తో ముచ్చటించారు.
చాలామంది నన్ను అడుగుతుంటారు.. ‘ఈ వయసులో ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అని. నా దృష్టిలో వయసు అనేది ఒక అంకె మాత్రమే. నా మనసు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది. ఇప్పటికీ నా చేతులు వణకవు, కంటి చూపు మసకబారలేదు. రోజూ ఉదయం 5.30 గంటలకే నిద్రలేచి యోగా చేయడం అలవాటు. మా నాన్న రాఘవ దీక్షితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యోగాను ఇంటింటికి తీసుకెళ్లిన మహనీయులు. అలా నాకు కూడా వారసత్వంగా యోగా అబ్బింది. ఆహారం విషయంలో నేను ఎంతో నిక్కచ్చిగా ఉంటాను. పూర్తిగా శాకాహారమే తీసుకుంటాను. నా పనులు నేనే చేసుకుంటాను. కారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ క్లినిక్‌లకు, ఆసుపత్రులకు వెళ్తుంటాను. దారిలో ఎవరైనా లిఫ్ట్ అడిగితే కాదనకుండా ఇస్తాను. నా శక్తి ఏంటో తెలుసా?.. పనిలో తృప్తి. మనం ఏది చేసినా సంతోషంగా చేయాలి. అది మనకు తెలియని శక్తిని ఇస్తుంది. అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. ఊరికే కూర్చుంటే ఎలా? శరీరం సహకరిస్తున్నంత వరకు పనిచేస్తూ ఉండాలి.
బ్రిటిష్ కాలంలో మెడిసిన్
నేను 1933లో జన్మించాను. బ్రిటిష్ పాలనా కాలంలో అమ్మాయిలు అక్షరాలు నేర్చుకోవడాన్ని పెద్ద సాహసంగా చూసేవారు. ఇక ఎంబీబీఎస్ చదవడమంటే అప్పట్లో దాదాపు అసాధ్యమనేవారు. ముఖ్యంగా తెలంగాణ వంటి ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు కూడా చాలా పరిమితంగా ఉండేవి. అలాంటి సమయంలో ఒక మహిళగా వైద్యురాలి పట్టా పొంది గైనకాలజిస్టుగా ఎదగడం నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తాను. 1950ల ప్రాంతంలో నా వైద్య ప్రస్థానం మొదలైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుదీర్ఘకాలం పనిచేశాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, నిలోఫర్ ఆసుపత్రి, బాపూజీ, సాగర్‌లాల్ మెమోరియల్ ఆసుపత్రులలో ఎంతోమంది రోగులకు సేవలందించి రిటైరయ్యాను. ఆ తర్వాతే నా ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాను.

జ్ఞానమే ఆయువుపట్టు
నేను వృత్తి ప్రారంభించినప్పుడు సోనోగ్రఫీలు లేవు. స్కానింగులో లేవు. మాకు ఆధారమైనది కేవలం వైద్య జ్ఞానమే. రోగిని క్షణ్ణంగా పరిశీలించడం, వారితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకోవడం ద్వారానే నిర్ధారణకు వచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు శాస్త్రీయ పురోగతి ఎంతో పెరిగింది. వ్యాధి బయటపడకముందే గుర్తించగలుగుతున్నాం. ఇది గొప్ప విషయం. నా డెబ్బై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి పురుడుపోశాను.
పేదలకు తోడుగా నిరంతర సేవ
ప్రస్తుతం నేను రోజూ ఉదయం 8:30 గంటలకే నా వైద్య సేవలు మొదలుపెడతాను. నా సహాయకులతో కలిసి రోగుల పరిస్థితులను సమీక్షిస్తాను. ఉదయం పూట ఆసుపత్రుల్లో సేవలు అందిస్తూ, సాయంత్రం వేళల్లో నా సొంత క్లినిక్‌లో గర్భిణులను చూస్తాను. 1999లో నేను క్లినిక్ ప్రారంభించాను. ఇంటి వద్ద ప్రసవాలు, శస్త్రచికిత్సలు ఇప్పుడు చేయడం లేదు. కేవలం వైద్య సంప్రదింపులు మాత్రమే ఇస్తాను.
ప్రసవానికి సిద్ధమైన మహిళలను నాకు తెలిసిన ఆసుపత్రులకు రిఫర్ చేస్తాను. ప్రస్తుతం బాలానగర్, హబ్సిగూడ, సాగర్‌లాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆసుపత్రులలో సేవలు అందిస్తున్నాను. పేదల పట్ల నాకెప్పుడూ ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. వారికి ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా, పేదలకు ఆసుపత్రుల్లో ఫీజు రాయితీలు ఇప్పిస్తున్నాను.
మన శక్తి ఉన్నంత వరకు పదిమందికి పనికిరావాలి. అదే నా జీవిత లక్ష్యం.
మల్లికార్జున్
దీపం వెలుగులో ప్రసవాలు
నేటితరం వైద్యులకు మా కాలం నాటి పరిస్థితులు వివరిస్తే ఆశ్చర్యపోతారు. ఆ రోజుల్లో ఇప్పటిలా అత్యాధునిక సౌకర్యాలు లేవు. సరైన రోడ్లు, విద్యుత్ సౌకర్యం కూడా లేని మారుమూల ప్రాంతాల్లో పనిచేశాను. రాత్రిపూట కరెంటు లేకపోయినా.. కిరోసిన్ దీపం వెలుగులో ప్రసవాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1959లో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నేను స్వతంత్రంగా నిర్వహించిన తొలి ప్రసవం నాకు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతుంటుంది. అప్పట్లో 15 ఏళ్ల గృహిణి ప్రసవం కోసం వచ్చింది. ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ప్రతి కేసు మాకు ఒక పెద్ద చాలెంజ్‌లా ఉండేది. ఎందుకంటే అనస్థీషియా ఇచ్చేది నేనే.. గైనకాలజిస్టుగా ఆపరేషన్ చేసేదీ నేనే.. పుట్టిన పిల్లాడిని చూసుకునేదీ నేనే. అలా ప్రతి అడుగులోనూ ఎంతో బాధ్యతతో ముందుకు సాగాను. 1965లో గైనకాలజీలో ఎండీ పూర్తిచేశాను.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత