ఆరు గజాల ఆత్మవిశ్వాసం
ABN , Publish Date - May 07 , 2026 | 05:59 AM
బాధ్యతల చక్రబంధంలో ఇరుక్కుని తనను తాను వెతుక్కుంటూ రోడ్డు మీదకు వచ్చిన ఒక తల్లి ప్రయాణం ఇది....
బాధ్యతల చక్రబంధంలో ఇరుక్కుని తనను తాను వెతుక్కుంటూ రోడ్డు మీదకు వచ్చిన ఒక తల్లి ప్రయాణం ఇది. 42 మారథాన్‌లు.. ఆరు గజాల చేనేత చీర.. గుండెనిండా గెలుపు కాంక్ష.. మధుస్మిత జేనా స్ఫూర్తిదాయక గాథ ఆమె మాటల్లోనే..
‘‘జీవితం అంటే కేవలం బాధ్యతలు మాత్రమేనా? ఇల్లు, పిల్లలు, ఉద్యోగం.. ఈ మూడింటి మధ్య నాకంటూ ఒక ఉనికి ఉండక్కర్లేదా?.. ఈ ప్రశ్న నన్ను నిలదీసినప్పుడే నేను పరుగును ఎంచుకున్నాను. నిజం చెప్పాలంటే నా పరుగు ఒక ఆశయం కోసమో, లేదా రికార్డుల కోసమో మొదలవలేదు. కేవలం ఇంటి నుంచి బయటపడటానికి, ఆ నాలుగు గోడల మధ్య ఊపిరాడనట్టు అనిపించినప్పుడు కొంత ప్రశాంతతను వెతుక్కునే క్రమంలో నేను రోడ్డు మీదికి వచ్చాను. నా మొదటి కుమారుడు పుట్టిన ఏడు నెలలకే నేను మొదటి మారథాన్‌ను పూర్తిచేశాను. అప్పుడు మొదలైన ఆ పరుగు ఇప్పుడు 46 ఏళ్ల వయసులోనూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 42 మారథాన్‌లు పూర్తి చేసినా.. ప్రతి పరుగు నాకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తూనే ఉంది.
ఒడిశా మట్టి నుంచి మాంచెస్టర్ వీధుల వరకు
నా నేపథ్యం గురించి చెప్పాలంటే.. మాది ఒడిశాలోని కటక్ జిల్లాకు చెందిన కుసుపూర్. ఇప్పుడు నేను యూకేలో ఒక ‘స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్’ టీచర్‌గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా ఎంతో బాధ్యతాయుతమైన పనిలో ఉన్నప్పటికీ నా మూలాలను నేను ఎప్పుడూ మర్చిపోలేదు. మాంచెస్టర్ మారథాన్‌లో నేను కట్టుకున్న ఆ సంబల్‌పురి చేనేత నూలు చీర నా రాష్ట్ర సంస్కృతికి ప్రతీక. ఈ పరుగును నేను 4 గంటల 50 నిమిషాల్లో పూర్తిచేశాను. మన మట్టి వాసనను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ఉండే తృప్తే వేరు. అందుకే పరిగెడుతున్నప్పుడు నేను ఒక వ్యక్తిగా కాకుండా, నా దేశానికి ప్రతినిధిగా భావించాను. మన సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఆధునిక ప్రపంచంలో ఏ సవాలునైనా స్వీకరించగలమని నిరూపించడమే నా ఉద్దేశం.
చీరకట్టులో ప్రపంచ రికార్డువైపు
చాలామంది నన్ను అడుగుతుంటారు. ‘అందరూ స్పోర్ట్స్ దుస్తుల్లో పరుగెడుతుంటే, మీరు ఆరు గజాల చేనేత చీరను ఎందుకు ఎంచుకున్నారు?’ అని. దీనికి నా దగ్గర ఒకటే సమాధానం ఉంది. చీర అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది నా ఆత్మవిశ్వాసం. ప్రస్తుతం నా ముందున్న అతిపెద్ద లక్ష్యం.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్. 2018లో క్రాంతి సాల్వి నెలకొల్పిన 3 గంటల 57 నిమిషాల రికార్డును అధిగమించి.. చీరకట్టులో అత్యంత వేగంగా మారథాన్ పూర్తిచేసిన మహిళగా నిలవాలని శ్రమిస్తున్నాను. 26.2 మైళ్ల దూరాన్ని సంప్రదాయ దుస్తుల్లో అధిగమించడం ద్వారా సౌకర్యం అనేది మనసులో ఉంటుందని నిరూపించాలనుకుంటున్నాను.
అడ్డంకులు.. సర్దుబాట్లు
చీరకట్టుకుని పరుగెత్తడం ఎంత కష్టమో మూడేళ్ల క్రితం నా మొదటి ‘శారీ రన్’లో తెలిసింది. పరుగెడుతున్నప్పుడు కాళ్లు చీరలో చిక్కుకోవడం, కుచ్చిళ్లు విడిపోవడం, గాలి వేగానికి చీర బరువుగా మారడం వంటివి ఎన్నో ఎదురయ్యాయి. అయినా వెనుకడుగు వేయలేదు. అనుభవంతో కొన్ని మార్పులు చేసుకున్నాను. పరుగుకు ఆటంకం కలగకుండా చీరను కొంచెం పైకి కట్టడం, ఎనర్జీ జెల్స్ వంటివి పెట్టుకోవడానికి ఒక స్పెషల్ బెల్ట్ ఉపయోగించడం అలవాటు చేసుకున్నాను. యూకేలో జనవరి నుంచి మార్చి వరకు ఉండే చలి వాతావరణం నా ప్రాక్టీ్‌సకు పెద్ద అడ్డంకి. గడ్డకట్టే చలిలో చీరతో బయటకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి, ఆ సమయంలో ఇంట్లోనే కఠినమైన శిక్షణ తీసుకున్నాను. నా కాళ్లకు ఆ బరువును తట్టుకునే శక్తినిచ్చేలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను.

వేకువజామున పోరాటం
ఒక టీచర్‌గా వృత్తిపరమైన బాధ్యతలు, ఇద్దరు పిల్లల పెంపకం.. వీటి మధ్య పరుగుకు సమయం ఎక్కడ దొరుకుతుందనేది చాలామంది సందేహం. నిజానికి సమయం దొరకదు, మనమే దానిని బలవంతంగా సృష్టించుకోవాలి. నేను ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తాను. పిల్లలు ఇంకా నిద్రలోనే ఉన్నప్పుడు, ఈ ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఉదయం 5 గంటలకే నేను రోడ్డు మీద ఉంటాను. నా శిక్షణ పూర్తిచేసుకుని పిల్లలు నిద్రలేచే సమయానికి మళ్లీ ఇంటికి చేరుకుంటాను. ఒక తల్లిగా నేను పడే ఈ తపన నా పిల్లలకు కూడా ఒక పాఠం కావాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, సరైన ఆహారం, సమయ పాలన ఉంటే ఏ మహిళ అయినా తన కలను సాకారం చేసుకోవచ్చని నేను నమ్ముతాను.’’
ప్రేక్షకుల స్పందనే నా బలం
నేను చీరలో పరుగెడుతుంటే దారిపొడవునా ప్రేక్షకులు ఇచ్చే మద్దతు, కొట్టే చప్పట్లు నాకు కొండంత బలాన్ని ఇస్తాయి. నాకు వచ్చే సందేశాల్లో చాలామంది మహిళలు ‘మేము కూడా ఇప్పుడు పరుగు మొదలుపెట్టాలని అనుకుంటున్నాం’ అని చెబుతుంటే నా లక్ష్యం నెరవేరినట్టు అనిపిస్తుంది. రికార్డు అనేది ఒక అంకెకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది నా పట్టుదలకు ప్రతీక. ఇప్పటికే ఉన్న 3 గంటల 57 నిమిషాల రికార్డును అధిగమించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఒక సాధారణ గృహిణిగా, తల్లిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆ లక్ష్యం వైపు అడుగులు వేయడం నాకు సంతృప్తిని ఇస్తోంది. త్వరలోనే ఆ రికార్డు సాధించి మన దేశ కీర్తిని మరింత పెంచుతాననే నమ్మకం నాకు ఉంది.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్
భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!