వందేహం గణనాయకం
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:49 AM
శిల్పాగమ శాస్త్రాల్లో గణపతి 32 భిన్నమైన రూపాల్లో కనిపిస్తాడు. ‘చింత్యాగమం’ అనే విశిష్టమైన శైవాగమ గ్రంథం గణపతి 16 రూపాలను శ్లోకాల్లో వర్ణించింది. ఆ శ్లోకాల ఆధారంగా...
తెలుసుకుందాం
శిల్పాగమ శాస్త్రాల్లో గణపతి 32 భిన్నమైన రూపాల్లో కనిపిస్తాడు. ‘చింత్యాగమం’ అనే విశిష్టమైన శైవాగమ గ్రంథం గణపతి 16 రూపాలను శ్లోకాల్లో వర్ణించింది. ఆ శ్లోకాల ఆధారంగా శిల్పాలను రూపొందించి, వాటికి ప్రాణప్రతిష్ట చేసి, వాటిని ఆరాధిస్తే కలిగే అనేక శుభ ఫలితాలను కూడా తెలియజేసింది. వాటిలో ఎనిమిది రూపాల గురించి తెలుసుకుందాం.
శ్రీ తరుణ గణపతి: కార్యసాధనలో ఏవైనా ఆటంకాలు ఎదురైనప్పుడు.. తరుణోపాయాన్ని అనుగ్రహించి, కార్య సాఫల్యానికి అవసరమైన దీక్షను, మనోధైర్యాన్ని పెంపొందిస్తాడు. ఎనిమిది చేతులు కలిగిన ఆ స్వామి కుడివైపు చేతులలో తన దంతాన్ని (స్వదంత) వెలగపండును, వరికంకులను, అంకుశాన్ని, ఎడమవైపు చేతులలో కుడుమును (అపూప), నేరేడు పండును, చెరుకుగడను, పాశాన్ని ధరించి ఉంటాడు. ‘‘బాల చంద్రుడిలా ఎర్రని కాంతితో వెలుగొందే శ్రీ తరుణ గణపతి మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించాలి’’ అని ఆయనను ప్రార్థించాలి.
శ్రీ వీర గణపతి: జీవితంలో ఎదురైన కష్టకాలాల్లో ధైర్యం సన్నగిల్లినవారు తనను ఆశ్రయిస్తే... నేనున్నానని వారిలో ధైర్యాన్ని, శౌర్యాన్ని పెంపొందించే స్వామి వీర గణపతి. అరుణ వర్ణంలో కాంతులొలికే శరీరం కలిగిన ఆయనకు 16 చేతులు ఉంటాయి. కుడివైపు ఎనిమిది చేతుల్లో బాణం, అంకుశం, గొడ్డలి, కుంతం, ముద్గరం, శూలం, ఖడ్గం, చక్రం, ఎడమవైపు ఎనిమిది చేతుల్లో విల్లు, నాగం, గద, ధ్వజం, ఖట్వాంగం, శక్తి, పాశం, బేతాలం ధరించి ఉంటాడు. ‘‘పదహారు చేతులతో దేదీప్యమానంగా వెలిగే వీరగణపతిని ఎల్లప్పుడూ స్తుతిస్తాను’’ అని ఆయనను ప్రార్థించాలి.
శ్రీ ద్విజ గణపతి: ఏదైనా విషయాన్ని అనేక విధాలుగా, సమగ్రంగా ఆలోచించే శక్తిని ద్విజ గణపతి ఇస్తాడు. మంచిది ఏదో, కానిది ఏదో తెలుసుకొనే విద్యను, విచక్షణను ప్రసాదిస్తాడు. చంద్రుడిలా తెల్లని శరీర కాంతి కలిగిన ఆయన నాలుగు గజ ముఖాలతో, నాలుగు భుజాలతో దర్శనమిస్తాడు. స్వామి కుడివైపు చేతుల్లో జపమాలను, దండాన్ని, ఎడమవైపు చేతుల్లో పుస్తకాన్ని, కమండలాన్ని ధరిస్తాడు.
‘‘ఓ ద్విజ గణపతీ! నిన్ను స్మరించినవారికి జ్ఞానప్రదాతవైన స్వామీ! నాకు విచక్షణతో కూడిన జ్ఞానాన్ని అనుగ్రహించు’’ అని ఆయనను ప్రార్థించాలి.
శ్రీ ఉచ్ఛిష్ట గణపతి: మంత్రమయమూర్తి అయిన ఈ స్వామి చాలా శక్తిమంతుడు. ఎంత వేగంగా అనుగ్రహించి కోరికలు తీరుస్తాడో... ఏదైనా అపచారం చేస్తే అంత వేగంగానూ, తీవ్రంగానూ శిక్షిస్తాడు. గురువు నుంచి మంత్రోపదేశం తీసుకొని, లోకోపకారం కోసం ఆరాధన చేయదలచుకున్న సాధకులు ఈ స్వామిని ఉపాసించడానికి అర్హులని శాస్త్రాలు చెబుతున్నాయి. నల్లని శరీరకాంతి కలిగిన ఉచ్ఛిష్ట గణపతికి నాలుగు చేతులుంటాయి. కుడివైపున జపమాల, కలువ పువ్వు, ఎడమవైపున వీణ, వరికంకి ధరించి ఉంటాడు. తొండంతో దానిమ్మ పండును ధరిస్తాడు. ‘‘ఈ రూపంలో దర్శనమిచ్చే ఉచ్ఛిష్ట గణపతి అందరినీ రక్షించుగాక’’ అని సాధారణ భక్తులు ప్రార్థించాలి. కాగా మరో రూపంలో ఉచ్ఛిష్ట గణపతి నీలం రంగు దేహంతో కనిపిస్తాడు.
శ్రీ క్షిప్ర గణపతి: కోరికలను విన్నవించి, ప్రార్థించిన వెంటనే ఇష్టార్థ సిద్ధిని అందించే ఈ స్వామి ఎర్రని శరీరకాంతితో ఉంటాడు. ఆయనకు నాలుగు చేతులు. కుడివైపు చేతుల్లో తన దంతాన్ని, అంకుశాన్ని, ఎడమవైపు కల్పలతను, పాశాన్ని, తొండంతో రత్న కలశాన్ని ధరించి ఉంటాడు.
శ్రీ హేరంబ గణపతి: ప్రమాదాల నుంచి భక్తులను ఈ స్వామి రక్షిస్తాడు. స్వచ్ఛమైన తెల్లని శరీరకాంతితో వెలుగొందే స్వామికి అయిదు గజ ముఖాలు, పది చేతులు ఉంటాయి. అయిదు ముఖాలు అయిదు దిక్కులను చూస్తూ ఉంటాయి. వైదిక సాహిత్యంలో... పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులతో పాటు ఆకాశం వైపును... ఊర్ధ్వ దిక్కుగా పరిగణిస్తారు. శ్రీ హేరంభ గణపతి అయిదు ముఖాలు ఆ రీతిలోనే ఉంటాయి. ఆయన కుడివైపు ఒక చేత అభయముద్రతో, మిగిలిన చేతుల్లో దంతాన్ని, ముద్గరాన్ని, జపమాలను, అంకుశాన్ని, ఎడమవైపు ఒక చేత వరద ముద్రతో, మిగిలిన చేతుల్లో పండు, గొడ్డలి, లడ్డుకము, పాశం ధరించి, సింహవాహనంపై ఆసీనుడై ఉంటాడు. ‘‘ఈ రూపంలో దర్శనమిచ్చే హేరంబ గణపతి ఎల్లరినీ రక్షించుగాక’’ అని ప్రార్థించాలి.
శ్రీ నృత్త గణపతి: ఈ స్వామి పచ్చని శరీర కాంతితో విలసిల్లుతూ, కల్పవృక్షం కింది భాగంలో నృత్యం చేస్తూ ఉంటాడు. ఆయన నృత్య భంగిమలో ఉండడం వల్ల... ఎడమ కాలును స్వల్పంగా వంచినట్టు, కుడికాలును కాస్త పైకి లేపినట్టు కనిపిస్తుంది. ఆయనను ‘కల్ప నృత్త గణపతి’ అని కూడా అంటారు. ఆయనకు నాలుగు చేతులు. కుడి చేతుల్లో తన దంతాన్ని, అంకుశాన్ని, ఎడమవైపు చేతుల్లో గొడ్డలిని, పాశాన్ని, తొండంతో అపూపాన్నీ పట్టుకొని ఉంటాడు. నాట్యం చేస్తూ ఉండడం వల్ల... ఆ అయిదు వస్తువులూ కదులుతూ ఉంటాయి. ‘‘అలాంటి నట్యభంగిమలో వంగి ఉన్న అంగుళులు కలిగిన, యానకమూర్తిగా దర్శనమిచ్చే శ్రీ నృత్తగణపతిని నేను మనసారా భజిస్తాను’’ అని ప్రార్థించాలి.
శ్రీ ఊర్ధ్వ గణపతి: మహా పాపాల నుంచి, కారాగార బాధల నుంచి విముక్తి కలిగించే స్వామిగా పూర్వులు పేర్కొన్న ఈ స్వామి బంగారంలాంటి పచ్చనైన శరీరచ్ఛాయతో, శోభాయమానంగా, ఎనిమిది చేతులు కలిగి ఉంటాడు. కుడివైపు చేతుల్లో తన దంతాన్ని, బాణాన్ని, వరి కంకిని, ఎర్రటి కలువ పువ్వును ధరిస్తాడు. ఎడమవైపు పై చేతితో తన దేవేరిని ఆలింగనం చేసుకుంటాడు, మిగిలిన హస్తాలలో చెరుకు వింటిని, గదను, పద్మాన్ని ధరించి ఉంటాడు. ‘‘ఆ ఊర్థ్వ గణపతి నాకు సమస్త శుభాలను ఇచ్చుగాక’’ అని ఆయనను ప్రార్థించాలి.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ