వయసు చిన్నదే... ఆశయం గొప్పది
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:32 AM
వయసు చిన్నదే. కానీ ఆలోచన పెద్దది. బడి ఈడులోనే మహిళా సాధికారతను భుజానికెత్తుకుని... వారి అభ్యున్నతి కోసం వ్యాపార సంస్థను ప్రారంభించింది. చదువుకొంటూనే...
సంకల్పం
వయసు చిన్నదే. కానీ ఆలోచన పెద్దది. బడి ఈడులోనే మహిళా సాధికారతను భుజానికెత్తుకుని... వారి అభ్యున్నతి కోసం వ్యాపార సంస్థను ప్రారంభించింది. చదువుకొంటూనే సంస్థ లావాదేవీలు చూసుకొంటూ... మగువలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ... ‘ఆటా గర్ల్’గా సరికొత్త ప్రయాణం మొదలుపెట్టింది. నలుగురిలో ఒకరిగా కాకుండా... ఆ నలుగురి కోసం దృఢ సంకల్పంతో నిలబడి... ప్రశంసలు అందుకొంటున్న పదిహేడేళ్ల నావ్య షా కథ ఇది.
‘‘నేను చేసిన ఒక చిన్న సాయం... నా ఆలోచనల్ని మార్చేసింది. నన్ను నేను మరో కోణంలో ఆవిష్కరించుకొనేందుకు దోహదపడింది. మహిళలను వ్యాపార భాగస్వాములను చేయడానికి అదే కారణమైంది. ముంబయి మహానగరం మాది. స్థానిక ‘ఒబెరాయ్ ఇంటర్నేషనల్ స్కూల్’లో ఐబీ డిప్లమో చేస్తున్నా. ప్లస్ టూతో పాటు చదివే రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు ఇది. నాకు చిన్నప్పటి నుంచి సామాజిక అంశాలు, సేవ పట్ల ఆసక్తి ఎక్కువ. అలా పదమూడేళ్లప్పుడు నా స్నేహితురాలితో కలిసి స్కూల్లో ‘డ్రెస్సింగ్ హార్ట్స్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. దాని ద్వారా వస్త్రాలు సేకరించి, పేద వర్గాలవారికి పంచి పెట్టేవాళ్లం. ‘బేక్ సేల్స్’... అంటే కేక్స్, కుకీస్ లాంటివి తయారు చేసి, విక్రయించి, ఆ డబ్బును విరాళంగా ఇచ్చేవాళ్లం.
మలుపు తిప్పిన ఘటన...
ఒక రోజు ముంబయిలోని మహిళల ఆశ్రమం ‘శాంతి ఘర్’ను సందర్శించాను. వస్త్రాలు, ఇతర నిత్యావసర వస్తువులను వారికి ఇవ్వడానికి తీసుకువెళ్లాను. అక్కడి మహిళలతో చాలాసేపు మాట్లాడాను. వారు పడే ఇబ్బందులు, పూట గడవక, ఏ దారీ లేక దిక్కు తోచక నెట్టుకొస్తున్న బతుకుల గురించి వారు చెబుతుంటే నా గుండె బరువెక్కింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో నిత్యం వాడుకొనే గోధుమపిండి కూడా అందుబాటులో లేదు. ఇంతటి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని తెలిసి దిగ్ర్భాంతి కలిగింది. ఇది నా ఆలోచనలను మార్చేసింది. జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన అది. ఆ క్షణమే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను... ఇలాంటివారికి నెలకు సరిపడా గోధుమ పిండి ఇవ్వాలని.
మారిన ఆలోచన...
బేక్ సేల్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రతి నెలా యాభై నుంచి అరవై కిలోల గోధుమ పిండి కొని, ఆశ్రమానికి వెళ్లి ఇచ్చేదాన్ని. కొన్నాళ్ల తరువాత నాలో ప్రశ్నలు మొదలయ్యాయి... ‘పిండి కోసం నేను ఖర్చు చేస్తున్నది నాలుగైదు వేల రూపాయలే. కానీ మార్కెట్‌లో ఎందుకంత ఎక్కువకు అమ్ముతున్నారు? సప్లై చైన్‌లో మిగిలిన డబ్బు ఎక్కడికి వెళుతోంది? పిండి ఇంత చౌకగా ఉండి, మనం అంత ఎక్కువ చెల్లిస్తున్నప్పుడు అసలు దాని ఉత్పత్తిదారులు ఎంత సంపాదిస్తున్నారు?’ అని. ఈ చిక్కుముడిని ఛేదించడానికి మూలాలకు వెళ్లి పరిశోధించాను. మహిళా రైతులను, మిల్లుల్లో పని చేసే మహిళలను కలిశాను. వారితో మాట్లాడాక ఈ ధరలను ఎవరు నియంత్రిస్తున్నారో అర్థమైంది. ముఖ్యంగా ధరలు ఎంత పెరిగినా క్షేత్ర స్థాయిలో కష్టపడే మహిళలకు చెల్లించే వేతనంలో పెద్దగా మార్పు ఉండదు. ఉత్పత్తిదారుడికి, వినియోగదారుడికి మధ్య దళారులు అడ్డుగా నిలబడటంవల్ల ఈ పరిస్థితి. అలాకాకుండా నేరుగా తయారీదారు నుంచి వినియోగదారుడికి చేరితే... నిజమైన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది కదా. వీటన్నిటినీ బేరీజు వేసుకొంటూ, నాలో ఉదయిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొంటూ ఆచరణసాధ్యమైన కార్యాచరణ ఒకటి రూపొందించాలని అనుకున్నాను.

యాజమాన్య హక్కు కల్పించి...
నా దృష్టిలో అట్టడుగు వర్గాల మహిళలకు కావల్సింది కేవలం విరాళాలు, ఉపాధి కల్పన మాత్రమే కాదు... యాజమాన్య హక్కు. అది కల్పించగలిగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందనిపించింది. అంటే తాము ఉత్పత్తి చేస్తున్నదాంట్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం. ఆ మహత్తర ఉద్దేశంతోనే గత ఏడాది ‘ఆటా గర్ల్’ పేరిట సామాజిక సంస్థను నెలకొల్పాను. దీని లక్ష్యం ఒక్కటే... మహిళలు నడిపే మిల్లు నుంచి తాజా పిండి సేకరించడం, దాన్ని నేరుగా వినియోగదారులకు విక్రయించడం... సాధ్యమైనంతవరకు మహిళలకు వ్యాపార విభాగాల బాధ్యతలను అప్పగించడం.
మహిళలకు ఊతం...
ఇప్పుడు మేం 350కి పైగా కుటుంబాలకు సరఫరా చేస్తున్నాం. తద్వారా 31 మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. బతుకుతెరువు కోసం డార్జిలింగ్ నుంచి ముంబయికి వచ్చిన కాంచీ ఆరంభంలో ఎంతో సిగ్గరి. చదువుకున్న యువతి అయినప్పటికీ, నలుగురితో మాట్లాడడం, కావల్సిన పని చేసుకురావడం ఆమెకు కష్టం ఉండేది. అయితే నేను ఎవరైనా ఫోన్ చేసినా, ఎక్కడికైనా వెళ్లినా ఏమేం ప్రశ్నలు ఎదురవుతాయి? వాటికి సమాధానం ఎలా చెప్పాలి? లాంటివి రాసిచ్చాను. అలా నిదానంగా కాంచీ పుంజుకుంది. ఇప్పుడు ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతోంది. వేరొకరి సాయం లేకుండా సంస్థ లావాదేవీలన్నీ నిర్వర్తించగలుగుతోంది. ఇంచుమించు ఇక్కడకు వచ్చిన అందరిదీ ఇదే పరిస్థితి. వారందరూ తమ పనులను సమర్థవంతంగా చేయగలగుతున్నారు. ‘ఆటా గర్ల్’ కేవలం సాధికారత దిశగా అడుగులు వేయించే ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ప్రతిఒక్కరిలో ఒక ప్రత్యేకత, సామర్థ్యం ఉంటాయి. వాటిని వ్యక్తపరచడానికి, ప్రదర్శించడానికి ఒక మెరుగైన మార్గాన్ని చూపాలి. అదే నేను చేస్తున్నది. చదువుకొంటూనే ఈ కార్యక్రమాలన్నీ చూసుకొంటున్నాను. కానీ ఏ రోజు బరువుగానో, పని ఒత్తిడిగానో భావించను. సమాజంలోని సగటు వ్యక్తిగా నావంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను.’’
ఇంటి నుంచే మొదలు...
‘ఆటా గర్ల్’ మా ఇంటి నుంచే మొదలైంది. మాది 23 భవనాల హౌసింగ్ సొసైటీ. లిఫ్ట్‌లు, పార్కు ప్రాంతాల్లో బ్యానర్లు కట్టాను. మొదట్లో ఒకటి రెండు కిలోలు ఆర్డర్ చేసేవారు. నాణ్యత బాగుండటం, తక్కువ ధర కావడంతో మళ్లీ ఆర్డర్లు వచ్చేవి. మా ఉత్పత్తిపై నమ్మకం కలిగింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. సొసైటీవారు నెలకు సరిపడా పిండి మా దగ్గరే కొనడం ప్రారంభించారు. రెండు మూడు నెలల్లోనే మాది ఒక పూర్తి స్థాయి వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం మూడు వేల కిలోలకు పైగా పిండి విక్రయిస్తున్నాం.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే