Share News

వేదోద్ధారకుడు

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:51 AM

‘హయము’ అంటే గుర్రం. మానవ దేహాన్ని, గుర్రం శిరస్సును కలిగిన రూపమే హయగ్రీవ అవతార స్వరూపం. ఈ రూపం అద్భుతంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. హయగ్రీవుని ప్రస్తావన శ్రీమద్భాగవతం, శ్రీమహాభారతం, స్కాందపురాణం, సనత్కుమార సంహిత, పాద్మ సంహిత, నారాయణీయం తదితర గ్రంథాలలో విశేషంగా కనిపిస్తుంది.

వేదోద్ధారకుడు

‘హయము’ అంటే గుర్రం. మానవ దేహాన్ని, గుర్రం శిరస్సును కలిగిన రూపమే హయగ్రీవ అవతార స్వరూపం. ఈ రూపం అద్భుతంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. హయగ్రీవుని ప్రస్తావన శ్రీమద్భాగవతం, శ్రీమహాభారతం, స్కాందపురాణం, సనత్కుమార సంహిత, పాద్మ సంహిత, నారాయణీయం తదితర గ్రంథాలలో విశేషంగా కనిపిస్తుంది.

మానవాళి సముద్ధరణ కోసం భగవంతుడు అనేక అవతారాలు ధరించాడు. వాటిలో పూర్ణావతారాలు, అంశావతారాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ఆచరణను నేర్పిన అవతారాలు కొన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారాలు కొన్ని. అటువంటి జ్ఞానప్రదాయకమైన అవతారాలలో శ్రీహయగ్రీవావతారం విలక్షణమైనది.

హయగ్రీవుని ఆవిర్భావానికి సంబంధించిన కథ ప్రకారం... కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు చతుర్ముఖ బ్రహ్మకు వేదాలను భగవంతుడు ఉపదేశించాడు. అయితే ఆ ఉపదేశాన్ని బ్రహ్మ శ్రద్ధగా వినలేదు. గురువు చెప్పే పాఠం మీద శ్రద్ద లేకపోవడం వల్ల ఒక దోషం కలిగింది. దాని ఫలితంగా మధు కైటభులనే రాక్షసులు పుట్టారు. వారు వేదాలను బ్రహ్మ దేవుడి నుంచి అపహరించుకుపోయారు. ఆ రాక్షసులను సంహరించి, వేదాలను తిరిగి తీసుకురావడానికి హయగ్రీవావతారాన్ని భగవంతుడు ధరించాడు. అసురులను తన సకిలింపులతో భయపెట్టి, సంహరించి... వేదాలను తిరిగి బ్రహ్మకు అందించాడు. యజ్ఞగుండంలో నుంచి ఆ హయవదనుడు జన్మించిన రోజు... శ్రావణ పౌర్ణమి. ‘హయ’ అంటే విజ్ఞానం, ‘గ్రీవము’ అంటే కంఠం. అన్ని రకాల విద్యలు కంఠగతమై ఉన్న స్వరూపమే హయగ్రీవమూర్తి.


చతుర్భుజాలతో...

శ్రీవేదాంతదేశికులు తన ‘హయగ్రీవ స్తోత్రం’లో స్వామిని స్తుతించారు. దాని ప్రకారం... హయగ్రీవ స్వామి నాలుగు చేతులు కలిగి ఉంటాడు. పరహస్తాలతో శంఖ చక్రాలను, నిజ వామ హస్తంలో పుస్తకాలను ధరిస్తాడు. నిజ దక్షిణ హస్తాన్ని జ్ఞానాన్ని ఉపదేశించే వ్యాఖ్యానముద్రగా ఉంచుతాడు. చూపుడు వేలును కిందికి వంచి బొటన వేలి మీద ఉంచి, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు నిటారుగా ఉంచే ముద్రను ‘వ్యాఖ్యాన ముద్ర’ అని, ‘జ్ఞాన ముద్ర’ అని, ‘ఉపదేశ ముద్ర’ అని అంటారు. హయగ్రీవస్వామి తెల్లని కమలం మీద సుఖాసనంలో కూర్చొని ఉంటాడు. దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. హయగ్రీవస్వామిని రెండు, నాలుగు, ఎనిమిది, పన్నెండు చేతులతో శిల్సాలుగా రూపొందిస్తారు. రెండు చేతులతో ఉన్న స్వామి అభయ, వరద ముద్రలతో ఉంటాడు. చతుర్భుజ హయగ్రీవునికి నాలుగు రూపాలు. ఒకదానిలో ఆయన నాలుగు చేతులతో నాలుగు వేదాలను ధరించి ఉంటాడు. ‘పాంచరాత్ర ఆగమం’ ప్రకారం, రెండో రూపంలో... నాలుగు చేతులు, అశ్వ ముఖం కలిగి చంద్రుని రూపంలో కొలువై ఉంటాడు. కుడిచేత వ్యాఖ్యాన ముద్రతో, ఎడమ చేతిలో పుస్తకాన్ని, పై చేతుల్లో అక్షయమాలను, శంఖాన్ని ధరించి ఉంటాడు. ‘పాద్మ సంహిత’ ప్రకారం, మూడో రూపంలో... నాలుగు చేతులతో, అశ్వ ముఖంతో, స్ఫటికం లాంటి దేహాన్ని కలిగి... తెలుపు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి ఉంటాడు. కుడిచేత వరద ముద్రతో, ఎడమ చేతిలో పుస్తకంతో, పరహస్తాలలో కుడి వైపు అక్షమాలను, ఎడమ వైపు శంఖాన్ని ధరించి, సుఖాసనంలో కూర్చొని ఉంటాడు. ఆయన వెనుక నల్లటి వర్ణంలో ఉన్న అనంతుడనే సర్పం... తన పడగతో స్వామికి నీడను ఇస్తుంది. నాలుగో విధంలో... కుడి చేత వరద ముద్ర, ఎడమ చేతిలో గదను పట్టుకొని లేదా ఆ చేతిని నడుముపై ఉంచుకొని, పై చేతులలో కుడిచేత చక్రం, ఎడమ చేత శంఖంతో ఉంటాడు.


ఎనిమిది, పన్నెండు చేతులతో...

అష్ట, ద్వాదశ భుజ హయగ్రీవ రూపాన్ని ‘విష్ణుధర్మోత్తర పురాణం’ వివరించింది. దాని ప్రకారం... నాలుగు చేతులలో శంఖం చక్రం, గద, పద్మం మరో నాలుగు చేతుల్లో వేదాలు ఉంటాయి. ఆ వేదాలు మానవ రూపంలో కనిపిస్తాయి. హయగ్రీవుని పాదాలు భూదేవి చాచిన అరచేతుల మీద ఉంటాయి. నీలి రంగు వస్త్రాలతో, విష్ణువు ధరించే ఆభరణాలతో కనిపిస్తాడు. పన్నెండు చేతులతో ఉన్న స్వామికి... పైన పేర్కొన్న ఎనిమిదితోపాటు పుస్తకం, అక్షమాల, అభయ, వరద ముద్రలు తోడవుతాయి.

తమిళనాడులోని తిరువహీంద్రపురంలో సుప్రసిద్ధమైన హయగ్రీవ ఆలయం ఉంది. అలాగే తిరుమలలోని శ్రీవరాహస్వామి ఆలయం సమీపంలో, మచిలీపట్నంలో, విజయవాడకు దగ్గరలోని విజయకీలాద్రి క్షేత్రంలో హయగ్రీవుడి ఆలయాలు ఉన్నాయి.

ఈ వార్తలను కూడా చదవండి

పొగాకుపై అపరాధరుసుంను రద్దు చేయాలి

ఎరువుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు

Updated Date - Aug 28 , 2026 | 12:51 AM