ఆ దేవి దర్శనం ఏడాదికి రెండు వారాలే
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:25 AM
దేశం నలుమూలలా ఉన్న దేవీ క్షేత్రాల్లో ఎన్నో విధాలుగా విలక్షణమైనది కర్ణాటకలోని హసనాంబ ఆలయం. సప్త మాతృకల్లో ఒకరుగా, అంధకాసుర సంహారిణిగా...
ఆలయ దర్శనం
దేశం నలుమూలలా ఉన్న దేవీ క్షేత్రాల్లో ఎన్నో విధాలుగా విలక్షణమైనది కర్ణాటకలోని హసనాంబ ఆలయం. సప్త మాతృకల్లో ఒకరుగా, అంధకాసుర సంహారిణిగా హసనాంబాదేవి పూజలందుకుంటోంది. ఏడాదిలో పది నుంచి పదిహేను రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఆ రోజుల్లో లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. .
సౌభాగ్యాన్ని, సంపదను, సంతానాన్ని, సుఖ శాంతులను ఇచ్చే దేవతగా హసనాంబ ఖ్యాతిగాంచింది. ఆ అమ్మవారి కారణంగానే ప్రస్తుతం జిల్లా కేంద్రమైన హసన్‌కు ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. స్థలపురాణం ప్రకారం... పూర్వం సప్తమాతృకలు వారణాసి నుంచి ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ ఈ ప్రాంతానికి వచ్సారు. ఇక్కడి సౌందర్యానికి ముగ్ధులై... ఈ చుట్టుపక్కల వివిధ దేవతా రూపాలలో కొలువయ్యారు. వారిలో హసనాంబ ఒకరు. మరో కథనం ప్రకారం... శక్తి స్వరూపిణి అయిన హసనాంబ భూలోకానికి వచ్చి, జనకంటకుడైన అంధకాసురుణ్ణి సంహరించింది. లోకులందరూ శాంతి సౌభాగ్యాలతో జీవించాలని దీవిస్తూ, భక్తులను అనుగ్రహించడానికి ఈ ప్రాంతంలో వెలసింది. అమ్మవారి ముఖం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండడంతో... హసన ముఖిగా, ఆ తరువాత హసనాంబగా ప్రసిద్ధి చెందింది. అర్జునుడి మునిమనుమడైన జనమేజయుడు తన శాపకాలంలో ఇక్కడే నివసించాడంటారు. కాగా... హసన్‌లోని సిద్ధేశ్వర, హసనాంబ ఆలయాలను సామాన్య శకం పన్నెండో శతాబ్దంలో, హోయసల పాలకుల కాలంలో... స్థానిక సర్దారు సంజీవ కృష్ణప్ప నాయకుడు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.
తొమ్మిది తలల రావణుడు
సిద్ధేశ్వర స్వామిగా పరమశివుడు ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఆయన లింగ రూపంలో కాకుండా... అర్జునుడికి పాశుపత ప్రదానం చేస్తున్నట్టు కనిపించడం విశేషం. అలాగే ఆలయ ప్రాంగణంలో పదికి బదులు తొమ్మిదికి తలలతో... వీణ వాయిస్తున్న రావణుడి శిల్పం ఉంటుంది. ఏడాదిలో పది నుంచి పదిహేను రోజులు మాత్రమే తెరిచి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పున్నమి తరువాత వచ్చే గురువారం నాడు... అర్చకులు, పురప్రముఖులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో జిల్లా అధికారులు ఆలయ ద్వారాలు తెరుస్తారు. శుద్ధి, అలంకరణ కార్యక్రమాల అనంతరం... ఆ మరుసటి రోజు నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఈ ఏడాది అక్టోబరు 29న ఆలయాన్ని తెరిచారు. నేటి నుంచి నవంబరు 10వ తేదీ వరకూ 12 రోజుల పాటు మధ్యలో కొన్ని గంటలు మినహా... రోజంతా దర్శనాలు ఉంటాయి. బలి పాడ్యమి మరునాడు (నవంబరు 11వ తేదీ) మధ్యాహ్నం ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని మూసేస్తారు. చివరి రోజున వెలిగించే దీపం మరుసటి ఏడాది ఆలయాన్ని తెరిచేవరకూ వెలుగుతూనే ఉంటుందని, అమ్మవారికి సమర్పించిన నైవేద్యం, అలంకరించిన పుష్పాలు తాజాగా ఉంటాయని చెబుతారు. ఏటా జరిగే ఉత్సవాలకు దక్షిణ భారత రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఎలా వెళ్ళాలి?: బెంగళూరుకు సుమారు 183 కిలోమీటర్లు, మైసూరుకు దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో హసన్ జిల్లా కేంద్రం ఉంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News