గోల్డెన్ గుంజన్
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:45 AM
సంచలనాల చిరునామా... ఒత్తిడికి తల ఒగ్గని పోరాట పటిమ... బాక్సింగ్ రింగ్‌లో ‘గోల్డెన్ పంచ్’ గుంజన్ యాదవ్. ఇటీవల ముగిసిన యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం...
విజేత
సంచలనాల చిరునామా... ఒత్తిడికి తల ఒగ్గని పోరాట పటిమ... బాక్సింగ్ రింగ్‌లో ‘గోల్డెన్ పంచ్’ గుంజన్ యాదవ్. ఇటీవల ముగిసిన యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి... చరిత్ర సృష్టించింది. భారత కీర్తిని పతాక స్థాయిలో నిలిపింది. సెనెగల్ రాజధాని డకార్‌లో జరిగిన అంతిమ సమరంలో సింహంలా గర్జించి ప్రత్యర్థిని మట్టి కరిపించింది. ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రాను చూసి స్ఫూర్తి పొందిన ఈ పదిహేడేళ్ల బాక్సర్ జర్నీలో ఆసక్తికర మలుపులు ఎన్నో.
నలభై ఎనిమిది బౌట్స్... ఒకే ఒక్క ఓటమి. ఇదీ సెనెగల్ రాజధాని డకార్ యూత్ ఒలింపిక్స్‌కు వచ్చేముందు ఇంగ్లండ్ బాక్సర్ లిల్లీ బాసెట్ ట్రాక్ రికార్డు. తనే టైటిల్‌కు తిరుగులేని ఫేవరెట్ అనేది అందరి అంచనా. అలాంటి బాక్సర్ బరిలో ఉంటే ప్రత్యర్థులు గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. అదీ సెమీఫైనల్ లాంటి డిసైడర్‌లో ఎదురైతే..! ఒత్తిడిలో చిత్తయిపోవాల్సిందే. కానీ గుంజన్ తనను తాను నమ్ముకుంది. తన నైపుణ్యాన్ని నమ్ముకుంది. ప్రత్యర్థి ఎవరైనా... ఒక్కసారి రింగ్‌లోకి దిగాక అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టడంపైనే దృష్టి పెట్టింది. గతంలో బాసెట్ చేతిలో ఓడినప్పటికీ, కీలక పోటీలో అవేవీ మనసులోకి రానివ్వలేదు గుంజన్. తొలి రౌండ్‌లో వెనుకపడినా, శక్తినంతటినీ కూడగట్టుకొని, ప్రత్యర్థిపై విరుచుకుపడింది. వరుస పంచ్‌లతో బాసెట్‌ను కోలుకోని దెబ్బ కొట్టిన గుంజన్... 4-1తో నెగ్గి, ఫైనల్స్‌కు చేరింది. మహిళల 48 కిలోల విభాగం ఫైనల్లో అల్జీరియా క్రీడాకారిణి బౌతైనా బౌన్సెలాను 5-0తో చిత్తు చేసి స్వర్ణ పతకం గెలుచుకుంది. యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తెచ్చిన తొలి బాక్సర్‌గా నవ చరితకు నాంది పలికింది.
వాస్తవానికి సెమీస్‌కు ముందు గుంజన్ కొంత ఒత్తిడికి లోనైంది. దానికి కారణం... అండర్-19 ఫ్యూచర్ కప్ ఫైనల్‌లో బాసెట్ చేతిలో ఓడిపోవడమే. ఆ ఓటమి ఆమెను కుంగదీసింది. ‘‘అప్పుడు కూడా తొలి రౌండ్‌లో వెనకపడ్డాను. దాంతో తరువాతి రౌండ్‌లలో రక్షణాత్మకంగా ఆడాను. ఈసారి నాపై కొంత ఒత్తిడి ఉన్నా, గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా అనుకున్నాను. బాసెట్ నాకంటే పొడవు. ఆమె తన కుడి చేతితో ఎటాక్ చేస్తున్నప్పుడే నేను రైట్ క్రాస్, లెఫ్ట్ హుక్‌లతో ఎదుర్కొన్నాను. సెమీ్‌సలో బాసెట్‌ను ఓడించడం ఫైనల్స్‌కు ముందు నాకు అత్యంత ప్రోత్సాహాన్నిచ్చింది’’ అంటూ గుంజన్ వెల్లడించింది.
తల్లిదండ్రులకు ప్రేమతో...
ఇది కేవలం పతకం తెచ్చిపెట్టిన విజయం మాత్రమే కాదు... అచంచలమైన ఆత్మవిశ్వాసానికి, అలుపెరుగని పరిశ్రమకు నిలువెత్తు నిదర్శనం. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నవతరానికి ప్రేరణనిచ్చిన సందర్భం. హరియాణా హిసార్ జిల్లా ధనకలాన్‌లో పుట్టి పెరిగిన గుంజన్ ఈ స్థాయి క్రీడాకారిణి అవుతుందని ఆమె తండ్రి హర్‌భగవాన్ యాదవ్ ముందే ఊహించారు. అందుకు ఆమె తల్లి సుమన్ సహకారం, వెన్నంటి ఇచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనివి. అందుకే ఫైనల్స్‌లో గెలిచిన వెంటనే ‘అమ్మా, నాన్న, కోచ్‌లకు ప్రేమతో ఈ పతకం అంకితం చేస్తున్నా’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది గుంజన్.

పొలంలో పరీక్ష...
రెండేళ్ల కిందటి సంగతి. అప్పటికి గుంజన్ పదిహేనేళ్ల బాలిక. రోహ్‌తక్‌లో జరిగిన జూనియన్ నేషనల్స్ సెమీఫైనల్లో ఓడిపోయింది. అది ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. గమనించిన తండ్రి హర్‌భగవాన్... గుంజన్‌ను ధనకలాన్ గ్రామంలోని తమ పత్తి పొలానికి తీసుకువెళ్లారు. అది ఉమ్మడి కుటుంబ భాగస్వామ్యంలో ఉన్న ఏడెకరాల పొలం. దాన్ని దున్నమని కూతురుకి చెప్పారు. ‘‘నిత్యం వ్యవసాయ క్షేత్రంలో ఉన్నవారికే కష్టమైన పని. అలవాటులేనివారికి నడుములు జారిపోతాయి. నేను, నా సోదరుడు రామ్‌అవతార్ జీవితాంతం పత్తి పొలాలను దున్నుతూనే ఉన్నాము. కానీ నేను నా కూతురు సంకల్ప బలాన్ని చూడాలని అనుకున్నాను. తను ఏమాత్రం సంకోచించకుండా పని మొదలుపెట్టింది. మధ్యలో మేము విశ్రాంతి తీసుకున్నాం. గుంజన్ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. చివరకు పని పూర్తి చేసింది. నా కూతురు తన సంకల్ప బలంతో ఈ ప్రపంచాన్ని జయిస్తుందని, ఆ సత్తా తనలో ఉందని ఆ రోజే నేను గ్రహించాను. యూత్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచి నా నమ్మకాన్ని నిజం చేసింది’’ అంటారు హర్‌భగవాన్ చమర్చిన కళ్లతో.
వారి కష్టం తెలుసు...
‘‘మొదటి నుంచి నాకు బాక్సర్ అవ్వాలనే కోరిక. మా నాన్న, మామయ్య జీవితాంతం కఠోర శ్రమ చేస్తున్నారు. అది ఎంత సవాలుతో కూడుకున్నదో నాకు తెలుసు. అందుకే నేను బాక్సింగ్ చేయగలనని వారి వద్ద నిరూపించుకోవాలి. అప్పుడే నా కోరిక నెరవేరుతుందని అర్థమైంది. దాన్ని ఒక సవాలుగా తీసుకున్నా’’ అంటున్న గుంజన్ ఫిట్‌నెస్ కోసం కఠోరంగా శ్రమించింది. కోచ్ వికాస్ లోహన్ మార్గదర్శకంలో రోజూ 100, 400 మీటర్ల స్ర్పింట్స్ పరుగెత్తేది. 10 కిలోమీటర్ల పరుగు పందాల్లో పాల్గొనేది. ఆమెలో ఓపిక, సహనశక్తి పెంపొందిన తరువాతనే బాక్సింగ్‌లో నైపుణ్యం పెంచడంపై కోచ్ దృష్టి పెట్టారు. ఎవరు ఎన్ని పరీక్షలు పెట్టినా, అది తనను యోధురాలిగా తీర్చిదిద్దడానికేనని గుంజన్ గ్రహించింది. సంకల్ప బలంతో అన్నిటినీ అధిగమించి నేడు ప్రపంచ విజేతగా అవతరించింది.
నీరజ్ చోప్రాను చూసి...
2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం నెగ్గాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా చరిత్ర లిఖించాడు. నాడు చోప్రా ప్రదర్శనను చూసిన గుంజన్... తను కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నది. బాక్సింగ్‌లో కూతురు ఆసక్తిని గ్రహించిన తల్లిదండ్రులు మెరుగైన శిక్షణ కోసం ఆమెను హిసార్‌కు పంపాలని నిర్ణయించుకున్నారు. గుంజన్, ఆమె సోదరుడిని వెంటబెట్టుకొని తల్లి సుమన్ హిసార్ వెళ్లారు. అక్కడ రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకున్నారు. గుంజన్ శిక్షణ, డైట్ తదితర అవసరాల కోసం సుమన్ స్థానిక పాఠశాలలో టీచర్‌గా చేరారు. నెలకు 12 వేల జీతం. ఇంటి వద్ద ప్రైవేట్లు కూడా చెప్పేవారు. హర్‌భగవాన్‌కు వ్యవసాయంలో వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. ఇద్దరి సంపాదనతో ఆర్థిక అవసరాలు తీరేవి కావు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. కానీ వారు వెనకాడలేదు. ‘‘ఏదన్నా అనుకుందంటే అది నెరవేరే వరకు గుంజన్ నిద్రపోదు. అంత మొండిది. ‘నీరజ్ చోప్రాలా నేను కూడా ఒలింపిక్స్‌లో పతకం గెలవాలి’ అని మాతో చెప్పింది. ఆ పట్టుదల చూసి ఆమెను బాక్సింగ్ అకాడమీలో చేర్చాం’’ అని గుంజన్ మామ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..