Share News

విజయ లక్ష్మి

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:53 AM

డాక్టర్‌, ఎంబీయే, లా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గ్రూప్‌-1 టాపర్‌. అలుపెరగని అన్వేషణ, పట్టువదలని ప్రయత్నం.. ఇవన్నీ కలగలిస్తే ఆమే లక్ష్మీదీపికా కొమ్మిరెడ్డి. నేటి యువతకు ఆమె నిలువెత్తు స్ఫూర్తి...

విజయ లక్ష్మి

డాక్టర్‌, ఎంబీయే, లా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గ్రూప్‌-1 టాపర్‌. అలుపెరగని అన్వేషణ, పట్టువదలని ప్రయత్నం.. ఇవన్నీ కలగలిస్తే ఆమే లక్ష్మీదీపికా కొమ్మిరెడ్డి. నేటి యువతకు ఆమె నిలువెత్తు స్ఫూర్తి.

విజయానికి అడ్రస్‌ ఎక్కడ అని వెతికితే లక్ష్మీదీపికా కొమ్మిరెడ్డి ప్రయాణమే ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. ఒక మనిషి తన జీవితకాలంలో ఒక్క రంగంలో నిష్ణాతులు కావడమే గొప్ప విషయం అనుకుంటే.. ఆమె మాత్రం అడుగుపెట్టిన ప్రతిచోటా తన ముద్ర వేస్తున్నారు. వైద్య విద్య నుంచి మేనేజ్‌మెంట్‌ వరకు.. న్యాయశాస్త్రం నుంచి పరిపాలనా సేవల వరకు ఆమె ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారావేత్తగా కూడా రాణిస్తూ నేటి తరం మహిళలకు ఐకాన్‌గా నిలుస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.

వైద్యం నుంచి ప్రజాసేవ వైపు

హైదరాబాద్‌ ఏఎ్‌సరావునగర్‌లో స్థిరపడిన లక్ష్మీదీపిక చిన్నప్పటి నుంచి చదువులో మేటి. సఫిల్‌గూడ డీఏవీ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్‌ నారాయణగూడలో పూర్తి చేసిన ఆమె 2013లో మెడిసిన్‌ ఎంట్రన్స్‌లో 119వ ర్యాంకు సాధించి ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. సాధారణంగా మెడిసిన్‌ పూర్తయ్యాక డాక్టర్లు విదేశాలకు వెళ్లాలని కలలుకంటారు. కానీ ఉస్మానియా ఆసుపత్రిలో హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్నప్పుడు ఆమె చూసిన నిరుపేద రోగుల కష్టాలు ఆలోచింపజేశాయి. మందులతో జబ్బును నయం చేయడం కంటే ప్రభుత్వ వ్యవస్థలో ఉండి విధాన నిర్ణయాలు తీసుకుంటే మరింత ఎక్కువమందికి సేవ చేయవచ్చన్న సంకల్పం ఆమెను సివిల్‌ సర్వీసెస్‌ వైపు నడిపించింది.


అరుదైన రికార్డు

దీపిక ప్రస్థానంలో ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ మొదటి మలుపు. తొలుత ఎంపీడీవో పోస్టు వచ్చినప్పటికీ తన లక్ష్యం పెద్దదని నమ్మి ఆ ఉద్యోగంలో చేరలేదు. తన పట్టుదలపై ఉన్న నమ్మకంతో తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షలు రాసి 550 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ పొందుతుండగానే ఏపీ గ్రూప్‌-1 ఫలితాలు వెలువడ్డాయి. అందులోనూ ఆమె తన సత్తా చాటుతూ రాష్ట్రస్థాయిలో మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో టాపర్‌గా నిలవడం అరుదైన రికార్డు. ఈ పోటీ పరీక్షల ఒత్తిడిలోనూ ఉస్మానియాలో లా చదువుతూనే, ఎంబీయే కూడా పూర్తిచేయడం ఆమె బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం.

అంకితభావానికి నిదర్శనం

లక్ష్మీదీపికకు వృత్తిపట్ల ఉండే నిబద్ధతను చాటిచెప్పే ఒక సంఘటన గురించి సీనియర్‌ అధికారులు గర్వంగా చెప్పుకుంటారు. నవంబర్‌ 2న ఆమెకు వివాహం జరగ్గా కేవలం ఐదు రోజులే సెలవు తీసుకున్నారు. వివాహం ముగిసిన మరుసటి రోజే తిరిగి సంగారెడ్డిలో విధులకు హాజరై అంకితభావం చాటుకున్నారు. అమలాపురం, పశ్చిమ గోదావరి మూలాలున్న ఆమె కుటుంబ 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడింది. తన ప్రయాణం ఇంకా ముగియలేదని, మిగిలి ఉన్న సివిల్స్‌ అవకాశాలను వినియోగించుకుని ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ సాధించి దేశ సేవలో భాగం కావడమే తన అంతిమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. పట్టుదల ఉంటే ఏ కల అయినా సాధ్యమేనని నిరూపిస్తున్న లక్ష్మీదీపిక నిజంగానే విజయాల లక్ష్మి.

తిరుపతయ్య నాదెళ్ల


యువతకు దిక్సూచి

నేటి యువత స్మార్ట్‌ఫోన్లకు బానిసలై సమయాన్ని వృథా చేసుకుంటున్నారని దీపిక ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నేను కూడా సోషల్‌ మీడియా వాడతాను. కానీ, దేనికి ఎంత సమయం ఇవ్వాలో నాకు తెలుసు. లక్ష్యం పట్ల స్పష్టత ఉన్నప్పుడు ఇవేవీ మనల్ని పక్కదారి పట్టించలేవు’’ అంటారు. కేవలం చదువుతోనే ఆగిపోకుండా, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ చేసే రైతులకు ముడిసరుకు అందించే స్టార్ట్‌పతోపాటు, విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ ఇచ్చే ఆన్‌లైన్‌ వేదికను తన మిత్రులతో కలిసి నడుపుతున్నారు. పుస్తకపఠనం, పర్యటనలు అంటే అమితంగా ఇష్టపడే దీపిక నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడమే తన విజయ రహస్యమని అంటారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 04:53 AM