Share News

మెరిసే గోళ్ల వెనుక ముప్పుశ్రీ

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:39 AM

అద్దంలా మెరిసిపోయే గోళ్లు నేటితరం ఫ్యాషన్‌ సింబల్‌. కానీ, ఈ ‘జెల్‌ మానిక్యూర్‌’ మెరుపుల వెనుక చర్మవ్యాధుల ముప్పు పొంచి ఉందని...

మెరిసే గోళ్ల వెనుక ముప్పుశ్రీ

అద్దంలా మెరిసిపోయే గోళ్లు నేటితరం ఫ్యాషన్‌ సింబల్‌. కానీ, ఈ ‘జెల్‌ మానిక్యూర్‌’ మెరుపుల వెనుక చర్మవ్యాధుల ముప్పు పొంచి ఉందని మీకు తెలుసా? అందం కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నవారు అనారోగ్యంతో డెర్మటాలజిస్ట్‌ క్లినిక్‌ల బాట పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఏమిటీ కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌?

గోళ్ల అలంకరణ తర్వాత ఆ ప్రాంతంలో ఎర్రగా కందిపోవడం, తీవ్రమైన దురద, వాపు లేదా చర్మం పగుళ్లు ఇవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే దానిని ‘కాంటాక్ట్‌ డెర్మటైటి్‌స’గా గుర్తించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జెల్‌, అక్రిలిక్‌ నెయిల్‌ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు పదేపదే చర్మానికి తగలడం వల్ల ఈ అలెర్జీ వస్తుంది. ఇది ఒక రకమైన చర్మవాపు వ్యాధి అని, మనం వాడే సౌందర్య సాధనాలపై శరీరం చూపే ప్రతిచర్య అని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా జెల్‌ వేయించుకున్నాక లేదా అది తొలగించే సమయంలో ఈ లక్షణాలు తీవ్రమవుతాయి.

ఇన్ఫెక్షన్‌గా పొరపాటు

చాలామంది గోళ్ల చుట్టూ వచ్చే ఈ మార్పులను చూసి సాధారణ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ అని పొరబడి సొంత వైద్యం చేసుకుంటారు. కానీ, ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు గోరు మందంగా తయారై పసుపు రంగులోకి మారుతుంది. కాంటాక్ట్‌ డెర్మటైటి్‌సలో మాత్రం గోరు కంటే దాని చుట్టూ ఉన్న చర్మమే ఎక్కువగా ప్రభావితం అవుతుంది. చర్మం పొలుసులుగా ఊడిపోవడం, మంట పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే చర్మం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

రసాయన రంగుల లోకం

జెల్‌ నెయిల్స్‌ తయారీలో అక్రిలేట్స్‌ వంటి శక్తివంతమైన రసాయనాలు ఉపయోగిస్తారు. యూవీ లైట్ల కింద ఈ జెల్‌ సరిగ్గా ఆరకపోయినా లేదంటే నేరుగా చర్మానికి తగిలినా ప్రమాదమే. ప్రస్తుతం మార్కెట్లో సులభంగా దొరుకుతున్న ‘హోం నెయిల్‌ కిట్స్‌’ వల్ల ఈ ముప్పు మరింత పెరిగింది.


అప్రమత్తతే శ్రీరామరక్ష

‘అందం ముఖ్యమే కానీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు’ అంటున్నారు వైద్య నిపుణులు. జెల్‌ నెయిల్స్‌ వేయించుకునే వారు రెండుసార్ల మధ్య కొంత విరామం ఇవ్వాలి. యూవీ ల్యాంప్స్‌ వాడేటప్పుడు సన్‌స్ర్కీన్‌ లేదా గ్లోవ్స్‌ ధరించడం మంచిది. సౌందర్య సాధనాలపై మోజు తప్పుకాదు, కానీ వాటి వెనక ఉన్న రసాయనాల పట్ల కనీస అవగాహన ఉండాలని అంటున్నారు నిపుణులు. అందాన్ని ఆరోగ్యంతో ముడిపెట్టి చూసినప్పుడే మన ఫ్యాషన్‌ సురక్షితంగా ఉంటుంది.

Also Read:

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 01:39 AM