Share News

వినాయకుడికి వెరైటీగా...

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:08 AM

వినాయక చవితి పండుగ రోజున గణేశుడికి నైవేద్యంగా సమర్పించే కుడుములు, మోదకాలను కర్ణాటకలో విభిన్నంగా ఎలా తయారుచేస్తారంటే...

వినాయకుడికి వెరైటీగా...

వినాయక చవితి పండుగ రోజున గణేశుడికి నైవేద్యంగా సమర్పించే కుడుములు, మోదకాలను కర్ణాటకలో విభిన్నంగా ఎలా తయారుచేస్తారంటే...

కారం కుడుములు

కావాల్సిన పదార్థాలు

బియ్యప్పిండి- కప్పు, పచ్చి కొబ్బరి తురుం- పావు కప్పు, పచ్చి శనగపప్పు- పావు కప్పు, నెయ్యి- రెండు చెంచాలు, పచ్చి మిర్చి- రెండు, అల్లం- చిన్న ముక్క, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత

తయారీ విధానం

పచ్చి శనగపప్పును కడిగి నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి రెండు కప్పుల నీటిని పోసి నెయ్యి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత కొద్దికొద్దిగా బియ్యప్పిండిని వేస్తూ ఉండలు రాకుండా కలిపి దించాలి. దానిమీద మూతపెట్టి అరగంటసేపు అలాగే ఉంచాలి. తరువాత ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ చేత్తో చిన్న బిళ్లలుగా చేసి పెట్టుకోవాలి. మిక్సీలో.. నానిన పచ్చి శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుం, పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, అల్లం వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి గిన్నెలోకి తీయాలి. తరువాత కొత్తిమీర తరుగు వేసి కలపాలి. బియ్యప్పిండి బిళ్లల్లో ఈ పూర్ణం మిశ్రమాన్ని ఉంచి లడ్డూల్లా చుట్టి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో పెట్టి పది నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే కారం కుడుములు రెడీ!


ఫ్రైడ్‌ మోదక్‌

కావాల్సిన పదార్థాలు

బెల్లం తురుం- కప్పు, నెయ్యి- రెండు చెంచాలు, పచ్చి కొబ్బరి తురుం- కప్పు, గసగసాలు- చెంచా, కాజు-బాదం పలుకులు- అర కప్పు, జాజికాయ పొడి- పావు చెంచా, యాలకుల పొడి- అర చెంచా, పచ్చి కోవా- అర కప్పు, గోధుమ పిండి- ఒకటిన్నర కప్పులు, ఉప్పు- తగినంత, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో బెల్లం తురుం, నెయ్యి వేసి కరిగించాలి. ఆపైన పచ్చి కొబ్బరి తురుం, గసగసాలు, కాజు-బాదం పలుకులు, జాజికాయ పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం దగ్గరకు వచ్చిన తరువాత పచ్చి కోవా వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. మరో గిన్నెలో గోదుమ పిండి, ఉప్పు వేసి నీటిని చిలకరించుకుంటూ మెత్తటి ముద్దలా కలపాలి. దీనిమీద కొద్దిగా నూనె రాసి మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి. తరువాత ఈ పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పలుచని చపాతీల్లా పామాలి. ఒక్కో చపాతీలో రెండు లేదా మూడు చెంచాల బెల్లం-కోవా మిశ్రమాన్ని ఉంచి వాటి అంచులను దగ్గరగా చేర్చి మోదకాల మాదిరి తయారుచేయాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడిచేయాలి. అందులో మోదకాలు వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఇవి తియ్యగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 06:08 AM