పండక్కి పాలవెల్లి...
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:16 AM
వినాయక చవితి పండుగ రోజున ఇంట్లో పాలవెల్లిని ఏర్పాటు చేసి దాని కింద గణపయ్యను కూర్చోబెట్టి పూజ చేస్తుంటాం. ఈ పాలవెల్లిని సులువుగా అందంగా ఎలా అమర్చాలో చూద్దాం...
వినాయక చవితి పండుగ రోజున ఇంట్లో పాలవెల్లిని ఏర్పాటు చేసి దాని కింద గణపయ్యను కూర్చోబెట్టి పూజ చేస్తుంటాం. ఈ పాలవెల్లిని సులువుగా అందంగా ఎలా అమర్చాలో చూద్దాం...
ముందుగా చెక్క ఫ్రేమ్‌ని తయారుచేయాలి. దీనికోసం సన్నని వెదురు కర్రలు, చెక్క పట్టీలు, వెడల్పాటి ఐస్‌క్రీమ్ పుల్లలు, పొడవాటి కార్డ్‌బోర్డ్ పీసెస్ ఉపయోగించుకోవచ్చు. వీటిని చతురస్రాకారపు గ్రిడ్ ఆకారంలో అంటించాలి. ఈ గ్రిడ్ నాలుగు మూలలకు బలమైన తాళ్లు లేదా దారాలు కట్టి వాటిని పైభాగంలో కలిపి ముడివేయాలి. దీన్ని వినాయకుడి విగ్రహం ఎత్తును అనుసరించి గోడకు లేదా కిటికీ ఊచకు కిందుగా వేలాడదీయాలి.
ఈ పాలవెల్లి కదలకుండా నాలుగువైపులా పొడవాటి కర్రలను నేలమీద ఏర్పాటు చేయవచ్చు.
ఈ గ్రిడ్‌కు లోపల అరటిపండ్లు, వెలక్కాయ, సీతాఫలం, దానిమ్మ పండ్లు, పంపర పనస, యాపిల్స్‌ను దారాలతో కట్టి వేలాడదీయాలి. నాలుగు వైపులా మొక్కజొన్న కంకులు, చిన్న చెరుకు గడలను కట్టాలి. మధ్యమధ్యలో గరిక, మామిడి ఆకులు, వరిసలను ఏర్పాటు చేయాలి. గ్రిడ్ పైన కూడా పత్రికి సంబంధించిన ఆకులను అందంగా అమర్చవచ్చు.
గ్రిడ్ అంచుల వెంబడి బంతి, చేమంతి, మల్లె దండలను తోరణంలా కట్టాలి. ముందు భాగంలో రెండు వైపులా పూలదండలు వేలాడదీయాలి. గ్రిడ్ అంతటా రంగురంగుల ఎలక్ట్రిక్ ఫెయిరీ లైట్లను జాగ్రత్తగా జోడించవచ్చు.
పాలవెల్లిని ఎందుకు కడతారు?
విశ్వం అనంతం. కోటానుకోట్ల నక్షత్రాలకు నిలయం. విశ్వంలో మన భూమి పరిమాణం ఒక ఇసుక రేణువు కన్నా తక్కువే. భూమి మీద నుంచి చూసినప్పుడు ఆ నక్షత్రాల సమూహం పాల సముద్రంలా దర్శనమిస్తుంది. అందుకే దాన్ని ‘పాలపుంత’, ‘పాలవెల్లి’ అంటారు. వినాయక పూజలో వినియోగించే పాలవెల్లి కూడా విశ్వానికి చిహ్నంగా ఏర్పాటు చేసేదే.
వినాయకుడి పూజలో మట్టి విగ్రహం నుంచి పత్రి పూజ వరకూ ప్రతిదీ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. గ్రహాలకు నిలయంగా, వర్షాలను కురిపించేదిగా ఆకాశానికి, మనం నివసించే భూమికి జీవులమైన మనం ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. భూమికి చిహ్నంగా మట్టి విగ్రహాన్ని, జీవానికి చిహ్నంగా పత్రిని, ఆకాశానికి చిహ్నంగా పాలవెల్లిని వినాయక పూజలో వినియోగిస్తాం. గ్రహాలు లేదా నక్షత్రాలకు సంకేతంగా మారేడు, దానిమ్మ, బత్తాయి, జామ, వెలగ లాంటి పండ్లను, మొక్క జొన్న పొత్తులను కడతాం. మామిడి ఆకులతో, కలువ పువ్వులతో అలంకరిస్తాం. ఆ కాలంలో లభ్యమయ్యే పత్రాలు, ఫలాలతో స్వామిని సేవించుకోవడం ద్వారా ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకొంటాం. నాలుగు దిక్కులకు చిహ్నంగా పాలవెల్లి చతురస్రాకారంలో ఉంటుంది. దానికి పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెడతారు. దీనిద్వారా నలు దిక్కులలో ఉన్న దేవతలను, గణాలను ఆహ్వానించి, ఆరాధించినట్టవుతుంది. తమకు అధిపతి అయిన గణేశుణ్ణి ఆ గణాలు కూడా మనతోపాటు స్వాగతించి, సేవిస్తాయనేది పెద్దల మాట.
ఈ వార్తలనూ చదవండి:
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!