విధాతను ఢీకొన్న వనిత
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:02 AM
From Auto Driver to Entrepreneur The Inspiring Journey of Santoshi Devi
స్ఫూర్తి
సవాళ్లు ఎదురైనప్పుడు కొందరు కుంగిపోతారు. మరికొందరు వాటిని మెట్లుగా మార్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. బాల్య వివాహపు సంకెళ్లు, గృహహింస గాయాలు, ఒంటరి పోరాటం.. ఇలా ఎన్నో తుపానులను తట్టుకుని తన జీవిత నౌకను విజయతీరాలకు చేర్చారు సంతోషీ దేవ్. వంటింటికే పరిమితం కావాల్సిన చేతులతో ఆటో నుంచి భారీ ట్రక్కులను నడిపి నేడు ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలిచిన ఈ ఒడిశా ధీరవనిత గాధ ఇది. సంతోషీ దేవ్ కథ గెలుపు గురించి మాత్రమే కాదు, అది తిరుగుబాటు గురించి కూడా. 16 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. హర్యానాలో అడుగుపెట్టిన ఆ చిన్నారికి ఎదురైంది పూలబాట కాదు... వరకట్న వేధింపులు, గృహహింస. భర్త వదిలేసినా కుంగిపోకుండా తన కుమార్తె భవిష్యత్తు కోసం మళ్లీ తన సొంతగడ్డ అయిన ఒడిశాలోని కియోంఝర్ చేరుకుంది. సింగిల్ మదర్‌గా తన బిడ్డను గౌరవంగా పెంచాలనే సంకల్పం ఆమెలో కొత్త శక్తిని నింపింది.
ఒడిశాలో తొలి మహిళా ఆటో డ్రైవర్‌గా చెన్నైలో ఒక మహిళా ఆటోడ్రైవర్‌ను చూసినప్పుడు సంతోషిలో ఒక ఆలోచన మెరిసింది. ‘ఆమె చేయగలిగింది నేను ఎందుకు చేయలేను’ అనుకుంది. వెంటనే డ్రైవింగ్ నేర్చుకుని 2015లో కియోంఝర్ జిల్లాలోనే తొలి మహిళా ఆటో డ్రైవర్‌గా చరిత్ర సృష్టించింది. ఆటో స్టీరింగ్ పట్టుకున్న ఆ చేతులు వాహనాన్ని మాత్రమే కాదు, తన జీవితాన్ని కూడా సరైన దిశలో నడిపించడం మొదలుపెట్టాయి. సంతోషి ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. 2021లో భువనేశ్వర్‌లో ‘మో బస్’ (ప్రస్తుతం అమ బస్) నడిపిన తొలి మహిళా డ్రైవర్‌గా మరో మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత ఆమె తన పరిధిని మరింత విస్తరించుకుంటూ వెళ్లింది. కియోంఝర్‌లోని గ్వాలి మైనింగ్ ప్రాంతంలో 40 టన్నుల భారీ ట్రక్కును నడిపి పురుషులకు సాధ్యమనుకునే రంగంలో తన సత్తా చాటింది.
ఆటోలో 1,600 కిలోమీటర్లు
సంతోషి తన ఆటోలోనే కియోంఝర్ నుంచి ఢిల్లీ వరకు సుమారు 1,600 కిలోమీటర్లు ప్రయాణించడం ఆమె పట్టుదలకు నిదర్శనం. తానెదుర్కొన్న గృహహింస కేసులో న్యాయం కోసం, జాతీయ నాయకుల మద్దతు కోసం ఆమె చేసిన ఈ సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. రామమందిర ప్రారంభోత్సవానికి కూడా ఆటోలోనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది.
పారిశ్రామికవేత్తగా
ఒడిశా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ సు వాహక్’ పథకం సంతోషి జీవితంలో కొత్త వెలుగులు నింపింది. ఈ పథకం ద్వారా లభించిన వడ్డీ లేని రుణం, సబ్సిడీలతో ఆమె నేడు ఒక ఫోర్ వీలర్‌కు యజమాని అయింది. డ్రైవర్‌గానే మిగిలిపోకుండా రవాణా రంగంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదుగుతోంది.

ఒడిశా ముద్దుబిడ్డ
సంతోషి ప్రయాణాన్ని చూసి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆమెను ‘కియోంఝర్ ముద్దుబిడ్డ’ అని, ఒడిశాకు గర్వకారణమని కొనియాడారు. కష్టాలు ఎదురైనప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, కసిగా పోరాడితే విజయం వరిస్తుందని సంతోషి దేవ్ నిరూపించింది.
కుమార్తెకు ‘సూపర్ హీరో’
ప్రస్తుతం భువనేశ్వర్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న సంతోషి దేవ్ కుమార్తెకు తల్లి ఒక సూపర్ హీరో. గృహహింస బాధితురాలిగా కుంగిపోకుండా స్టీరింగ్ పట్టి శిఖరాలు అధిరోహిస్తున్న ఆమె ప్రస్థానం కష్టాల్లో ఉన్న ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News