రాజస్థాన్ నుంచి దావోస్ దాకా
ABN , Publish Date - Feb 23 , 2026 | 06:07 AM
చిన్న వయసులోనే పెళ్లి. ఎన్నో ఆశలతో కాపురానికి అమెరికా వెళ్లిన ఆమె ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ముగ్గురు ఆడపిల్లలను... తనను వదిలేసి... వేరే దారి చూసుకున్నాడు భర్త. ఆ బాధను భరించి... కుటుంబ భారాన్ని...
సంకల్పం
చిన్న వయసులోనే పెళ్లి. ఎన్నో ఆశలతో కాపురానికి అమెరికా వెళ్లిన ఆమె ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ముగ్గురు ఆడపిల్లలను... తనను వదిలేసి... వేరే దారి చూసుకున్నాడు భర్త. ఆ బాధను భరించి... కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న ఆమె... నేడు ఒక ప్రపంచ శక్తిగా ఎదిగారు. పారిశ్రామికవేత్తగా అవతరించి... ఎన్‌యూఐసీసీ వ్యవస్థాపకురాలిగా... సీఈఓగా... భారత్- అమెరికా మధ్య బంధానికి బలమైన వారధిగా మారారు. ఇటీవల ముగిసిన దావోస్ సదస్సులో అందర్నీ ఆకర్షించిన డాక్టర్ పూర్ణిమా వోరియా కథ ఇది.
పూర్ణిమ జీవితంలో ఊహించని మలుపులు... ముంచెత్తిన ఉపద్రవాలు... ఎదురైన సవాళ్లు ఎన్నో. కానీ పడి లేచిన కెరటంలా ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని... కుంగుబాటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు ఆమె. రాజస్థాన్ అజ్మీర్‌లోని సంప్రదాయ కుటుంబంలో పుట్టిన పూర్ణిమ... జైపూర్‌లో పెరిగారు. పద్ధెనిమిదేళ్లకే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. భర్తతో కలిసి అమెరికా వెళ్లిన ఆమె తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించారు. చిన్న చిన్న ఒడుదొడుకులు మినహా కాపురం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఉన్నట్టుండి పెద్ద కుదుపు. 1992లో ఆమె భర్త తనను, తన ముగ్గురు ఆడపిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దేశం కాని దేశం. ఆపై కుటుంబ భారం. ఎలా నెట్టుకురావాలి? ఏంచేయాలి? ఆమెకు దిక్కు తోచలేదు. ‘‘నేను, నా ముగ్గురు పిల్లలు... బతకడానికి ఏ దారీ దొరకలేదు. భారత్‌కు వచ్చేద్దామని అనుకున్నా. అయితే ఆ క్షణంలో నా కూతుళ్ల భవిష్యత్తు గుర్తుకువచ్చింది. అమెరికా పౌరులుగా వారికి లభించే అవకాశాలను చేజేతులా నాశనం చేయడం తగదని భావించాను. అందుకే రాజస్థాన్ వెళదామన్న ఆలోచన విరమించుకున్నాను’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్న పూర్ణిమ... ఆ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు.
రెండు గంటలే నిద్ర...
కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న పూర్ణిమ... తొలుత డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పని చేశారు. అక్కడ అమెరికా వినియోగదారుల తీరు, అభిరుచులతో పాటు ప్రాథమిక వ్యాపార లావాదేవీలు అర్థం చేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి టప్పర్‌వేర్ ఉత్పత్తులు విక్రయించారు. ‘వ్యాపారం నా రక్తంలోనే ఉంది’ అంటారు పూర్ణిమ. ఆమె తండ్రి రాజస్తాన్‌లో పారిశ్రామికవేత్త. ఒకే సమయంలో పలు రకాల ఉద్యోగాలు చేయడంవల్ల ఆమెకు క్షణం తీరిక దొరికేది కాదు. అమెరికాలోని కొలరాడోలో నివాసం ఉండే పూర్ణిమ... రాత్రిళ్లు కనీసం రెండు గంటలు కూడా నిద్ర పోని రోజులు ఎన్నో.
మరో మలుపు...
అవకాశం ఉన్న పనులు చేసుకొంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పూర్ణిమ జీవితం 2000లో మరో మలుపు తీసుకుంది. వై2కే ప్రభావంతో అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో అవుట్‌సోర్సింగ్‌పై, ముఖ్యంగా భారత్ పట్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఆ ప్రతికూల పరిస్థితులను ఆమె తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అందుబాటులో ఉన్న రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను కలిశారు. తద్వారా భారత్- అమెరికా దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అవి ఫలించాయి. యూఎస్ వాణిజ్య శాఖ ఆమెను సలహాదారుగా నియమించింది. ఆ తరువాత పదేళ్లపాటు పూర్ణిమ ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి పని చేశారు. అమెరికా, భారత్ అధ్యక్ష, ప్రధానులు పాల్గొన్న అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో భాగమయ్యారు. 2014లో నాటి యూఎస్ సెక్రెటరీ ఆఫ్ కామర్స్... పెన్నీ ప్రిట్జ్‌కర్‌కు సలహాదారుగా నియమితులయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌సింగ్ షెకావత్ ప్రోత్సాహంతో పూర్ణిమ ‘నేషనల్ యునైటెడ్ స్టేట్స్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్’ (ఎన్‌యూఐసీసీ)ని నెలకొల్పారు. భారత్- అమెరికా దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ ఇది.
ప్రధానులకు ఆతిథ్యం...
అనతికాలంలోనే పూర్ణిమ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అరుదైన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నారు. అమెరికా అధ్యక్షులు, భారత ప్రధానులు పాల్గొన్న పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. పారిశ్రామిక దిగ్గజాలతో వేదిక పంచుకున్నారు. ఇరు దేశాల్లో పెట్టుబడుల వైపు వారిని ప్రోత్సహించారు. ఆమె సేవలకు గానూ ‘కాంగ్రెషనల్ మెడల్ ఆఫ్ డిస్టింక్షన్’, వాల్ స్ర్టీట్ జర్నల్ ‘బిజినెస్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’తో పాటు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా గౌరవ పురస్కారం అందుకున్నారు. ఇటీవల స్విట్జర్‌లాండ్ దావో్‌సలో ముగిసిన సదస్సులో పూర్ణిమ భారత్‌తో పాటు తన సొంత రాష్ట్రం రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించారు. పలు కీలక అంశాలపై నిర్వహించిన చర్చలకు ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరించారు. ‘‘మా అమ్మానాన్నలే నాకు ఉత్తమ ఉపాధ్యాయులు. నాన్న మిష్రీలాల్ నగర్ స్వశక్తితో ఎదిగిన మిలియనీర్’’ అంటూ చెప్పుకొచ్చిన పూర్ణిమ... మహిళా శక్తికి నిలువెత్తు సాక్ష్యం.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News