Share News

అనుబంధం అమ్మ పెళ్లికి ఆమే పెద్ద

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:34 AM

ఏ బంధం ఎప్పుడెలా ముడిపడుతుందో... ఎప్పుడెలా విడిపడుతుందో ఊహించలేం. పాతికేళ్ల కిందట తల్లి జీవితంలో ఒక బంధం విడిపోతే... యాభైకి చేరువలో ఉన్న ఆమెకు...

అనుబంధం అమ్మ పెళ్లికి ఆమే పెద్ద

ఏ బంధం ఎప్పుడెలా ముడిపడుతుందో... ఎప్పుడెలా విడిపడుతుందో ఊహించలేం. పాతికేళ్ల కిందట తల్లి జీవితంలో ఒక బంధం విడిపోతే... యాభైకి చేరువలో ఉన్న ఆమెకు మరో బంధంతో ముడివేసింది కూతురు. తన కోసం... తన భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసిన ‘అమ్మకు మళ్లీ పెళ్లి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియో భావోద్వేగాలకు వేదిక అయింది. అమ్మ మనసును అర్థం చేసుకున్న తనయ పూజా భట్నాగర్‌...

ఆ పోస్టులో ఇలా రాసుకొచ్చింది...

‘‘అప్పుడు నాకు ఏడాది. మా నాన్న... అమ్మను, నన్ను వదిలేసి వెళ్లిపోయారట. అప్పటి నుంచీ మా అమ్మే నాకు తండ్రి కూడా అయింది. రెండు పాత్రలు తనే పోషించింది. నన్ను ప్రయోజకురాలిని చేయాలని, నా భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఎన్నో కలలు కన్నది. ఆ కలలను నిజం చేయడానికి తను ఎన్నో వదులుకున్నది. తనకంటూ ఒక జీవితం ఉందనే విషయాన్నే మరిచిపోయింది. నన్ను మా అమ్మమ్మ దగ్గర పెట్టి... ఉద్యోగ వేటలో ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ వచ్చింది. రకరకాల కొలువులు... కొత్త ప్రాంతాలు... అపరిచిత వ్యక్తులు... ఒంటరి మహిళగా ఎన్నో సమస్యలు, సవాళ్లు. కానీ నా కోసం అన్నిటినీ చిరునవ్వుతో భరించింది. నెలల తరబడి పసిబిడ్డకు దూరంగా గడపడం ఒక తల్లికి ఎంత కష్టం! అయినా ఆ బాధను దిగమింగి, ఖాళీ దొరికినప్పుడల్లా నన్ను ఫోన్‌లో పలుకరిస్తూ... ఇద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేసింది. భారమైనా ఏది కావాలంటే అది సమకూర్చింది. నాకు ఏ లోటూ రాకుండా చూసుకుంది.

ఆ భాగ్యం కలిగింది...

స్కూలులో, ఆ తరువాత కాలేజీ చదివే రోజుల్లో... అమ్మ ఏనాడూ నా ఫీజు ఆలస్యంగా కట్టిందిలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమయానికి డబ్బు సిద్ధం చేసేది. పెరుగుతున్న క్రమంలో... తోటి విద్యార్థులను చూసిన అనుభవంతో నాకు ఏ కష్టం రానివ్వకుండా అమ్మ పడుతున్న కష్టం అర్థమైంది. ఎన్నో ప్రాంతాలు... అక్కడ ఉద్యోగాలు... తిరిగి తిరిగి అలసిపోయిన ఆమె... ఎట్టకేలకు ముంబయిలో ఒక ఫర్నీచర్‌ అండ్‌ డెకార్‌ బిజినె్‌సను ప్రారంభించింది. ఆనాటి నుంచి అమ్మను రోజూ గమనించే అవకాశం దక్కింది. ఒక మహిళ... భిన్న పార్శ్వాలు... చూసి ప్రేరణ పొందే భాగ్యం కలిగింది.


నా కల తన లక్ష్యంగా...

నా ప్రతి కలనూ అమ్మ తన లక్ష్యంగా మార్చుకుంది. వాటి వెంట నేను పరుగెడుతుంటే... వెనుక నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చింది. నైనిటాల్‌ ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు... ఆ తరువాత జర్మనీ వెళ్లి మాస్టర్స్‌ చేసినప్పుడు... ప్రతి అడుగులో నాకు తోడుగా నిలిచింది. మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నదానికంటే... భిన్న నగరాల్లో జీవించిందే ఎక్కువ. కానీ మానసికంగా మేమెప్పుడూ దగ్గరే. తనే నా ప్రాణ స్నేహితురాలు. ఏ విషయమైనా నిర్భయంగా చెబుతాను. సంతోషమైనా... బాధైనా అమ్మతోనే పంచుకొంటాను.

ఊహించని సందర్భం...

ఎప్పుడూ నా గురించే కానీ... తన కోసం ఆలోచించలేదు అమ్మ. అలాంటి తను నేను జర్మనీలో ఉండగా... ఒక రోజు వీడియో కాల్‌ చేసింది. ఏదో చెప్పాలనుకొంటోంది. కానీ సంకోచిస్తోంది. చివరకు ధైర్యం చేసింది. ‘వృత్తిలో భాగంగా నేను ఒకరిని కలిశాను. అతనిది కూడా ఇంచూమించు నా కథలాంటిదే’ అంటూ ఆపింది. ‘ఒకవేళ అతను నన్ను పెళ్లి చేసుకొంటానని అడిగితే... నీకు ఇష్టమేనా’ అని అడిగింది. అమ్మ నుంచి అలాంటి ఒక ప్రతిపాదన వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. వెంటనే తేరుకుని... ‘నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అన్నాను.

భారత్‌కు తిరిగివచ్చి...

ఎన్నో ఏళ్లు ఒంటరిగా ఉన్న అమ్మ ఇన్నాళ్లకు తన గురించి తను ఆలోచించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రెండే రోజుల్లో జర్మనీ నుంచి భారత్‌కు వచ్చేశాను. అమ్మ మనసుకు నచ్చినవాడిని కలిసి పెళ్లి ఏర్పాట్లు చేశాను. సన్నిహితులు, శ్రేయోభిలాషులు... మొత్తం కలిపి ఓ ఇరవై మంది అతిథులు. ఇంట్లోనే మెహెందీ కార్యక్రమం. అదే రోజు రాత్రికి ఉంగరాల మార్పిడి. మరుసటి రోజు ఉదయం గుడిలో పెళ్లి. అమ్మ కళ్లల్లో మెరుపులు... నా మదిలో పులకింతలు. ఎందుకంటే చాలా ఏళ్లుగా నేనూ ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాను. ‘49 ఏళ్ల వయసులో అమ్మకు మళ్లీ పెళ్లి’... అది కూడా నా చేతుల మీదుగా..! భావోద్వేగంతో నా కళ్లు చెమర్చాయి. కొత్తగా వచ్చిన నాన్నకు ధన్యవాదాలు చెబుతూ... అమ్మను హత్తుకొని మనస్ఫూర్తిగా అభినందించాను. వాళ్లిద్దరినీ చూశాక ఒక విషయం స్పష్టమైంది... నవజీవన యాత్ర ప్రారంభించడానికి వయసుతో సంబంధం లేదని.’’

Also Read:

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..

కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి

For More Latest News

Updated Date - Mar 26 , 2026 | 01:34 AM