దారి చూపే వెలుగు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:33 AM
మనిషిని వివేకవంతుణ్ణి చేసేది విద్య. అది అల్లాహ్ మనకు ప్రసాదించిన అనేక వరాల్లో అత్యంత ప్రధానమైనది. విద్య అంటే కేవలం చదవడం, రాయడం నేర్పే సాధనం మాత్రమే కాదు..
సందేశం
మనిషిని వివేకవంతుణ్ణి చేసేది విద్య. అది అల్లాహ్ మనకు ప్రసాదించిన అనేక వరాల్లో అత్యంత ప్రధానమైనది. విద్య అంటే కేవలం చదవడం, రాయడం నేర్పే సాధనం మాత్రమే కాదు... జీవితానికి దిశా నిర్దేశం చేసే వెలుగు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి... జ్ఞానంతో మనిషిని ఉన్నత స్థాయికి చేర్చే కాంతి. ఇస్లాం ధర్మం ఆవిర్భవించిననాటి నుంచి విద్యకు అత్యున్నత స్థానం కల్పించింది. ఆ ప్రోత్సాహంతోనే... వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటి అనేక రంగాలలో ముస్లిం పండితులు విశేష కృషి చేశారు. దైవప్రవక్త మహమ్మద్‌పై ప్రసరించిన మొదటి ‘వహీ’ (దైవ సందేశం)... ‘ఇఖ్రా’ అంటే ‘చదువు’ అనే పదంతో ఆరంభమయింది. ఇది విద్య గొప్పతనాన్ని తెలియజేసే అత్యున్నతమైన సాక్ష్యం. దివ్య ఖుర్‌ఆన్‌లో ‘‘చదువు! సృష్టించిన నీ ప్రభువు పేరుతో చదువు’’ అని అల్లాహ్ ఆదేశించాడు. మనిషి అభివృద్ధి, సమాజ ప్రగతి, ప్రపంచ శాంతి... ఇవన్నీ చదువుతోనే సాధ్యం.
అది అందరి విధి
ఒక ఇంటిలో విద్యావంతులు ఉంటే... అక్కడ అవగాహన ఉంటుంది. సమాజంలో విద్య ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. దేశంలో విద్య ఉంటే అక్కడ శాంతి, సౌభాగ్యం, పురోగతి ఉంటాయి. విద్య లేకపోవడం వల్ల మంచికి చెడుకు తేడా తెలుసుకోవడం కష్టమవుతుందనీ, విద్యావంతుడు ప్రతి విషయాన్ని వివేచనతో పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోగలడనీ గుర్తించి... ప్రతి ముస్లింకు విద్యను ఇస్లాం తప్పనిసరి చేసింది. ‘‘విద్యను అభ్యసించడం ప్రతి పురుషుడు, మహిళల విధి’’ అని పేర్కొంటూ విద్య పురుషులకే కాదు, మహిళలకు కూడా సమానమైన అవసరమని ‘హదీస్’ గ్రంథంలో దైవప్రవక్త మహమ్మద్ స్పష్టం చేశారు. తెలిసినవారు తెలియనివారు ఎలా సమానమవుతారని దివ్య గ్రంథంలో అల్లాహ్ ప్రశ్నిస్తూ... విద్యావంతుల స్థాయిని సమున్నతంగా నిలిపాడు. జ్ఞాని అయిన వ్యక్తి తన ప్రభువైన దైవం గురించి సరిగ్గా తెలుసుకుంటాడు. తన బాధ్యతలను అర్థం చేసుకుంటాడు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుతాడు.
విద్య జ్ఞానం కోసం...
విద్య మనిషికి ఉపాధిని, ఉద్యోగాన్ని మాత్రమే కాదు... మంచి వ్యక్తిత్వాన్ని కూడా అందిస్తుంది. నిజాయితీ, క్రమశిక్షణ, సహనం, దయ, వినయం లాంటి గొప్ప లక్షణాలు విద్య ద్వారా పెంపొందుతాయి. ఇస్లాం ప్రకారం విద్య కేవలం ప్రాపంచికమైన సంపద కోసం కాదు. అల్లాహ్ సంతృప్తిని పొందడం కోసం కూడా. ఖుర్‌ఆన్, సున్నత్ జ్ఞానానికి మార్గదర్శకాలు. ఈ లోకంలో విజయానికి, పరలోకంలో అల్లాహ్ అనుగ్రహానికి అవి దోహదం చేస్తాయి. విద్య ద్వారా మనిషి తన సృష్టికర్తను గుర్తిస్తాడు. నమాజ్, రోజా, జకాత్, హజ్ లాంటి ఆరాధనలను సక్రమంగా ఆచరిస్తాడు. ‘‘అల్లాహ్! నాకు ప్రయోజనకరమైన జ్ఞానాన్ని ప్రసాదించు’’ అని దైవప్రవక్త నిత్యం ప్రార్థన చేస్తూ... జ్ఞానం ఎంత అవసరమో తెలియజెప్పారు. ఒక మంచి అధ్యాపకుడు వేలమంది విద్యార్థుల జీవితాలను మార్చగలడు. మంచి రచయిత లక్షలాది మందికి మార్గదర్శి అవుతాడు. మంచి పండితుడు తరతరాలకు వెలుగునిస్తాడు. సమాజంలో అనేక సమస్యలకు మూలకారణం అజ్ఞానం. విద్య పెరిగితే మూఢనమ్మకాలు, అవినీతి, నేరాలు తగ్గుతాయి. ప్రజల్లో పరస్పర గౌరవం పెరుగుతుంది. కాబట్టి విద్యను అభ్యసించేవారు సమయాన్ని వృధా చేయకుండా జ్ఞాన సంపాదన కోసం దాన్ని వినియోగించాలి.
మహమ్మద్ వహీదుద్దీన్
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest National News And Telugu News