పిల్లలకు సెల్‌ఫోన్ లంచం
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:36 AM
తల్లి బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోగలిగే అద్భుతమైన మార్గాలెన్నో ఉన్నాయి. అన్నం తినిపించడం వాటిలో ఒకటి. కానీ ఈ పనిని చిటికెలో ముగించడం కోసం, తల్లులు పిల్లలకు...
కిడ్స్ కేర్
తల్లి బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోగలిగే అద్భుతమైన మార్గాలెన్నో ఉన్నాయి. అన్నం తినిపించడం వాటిలో ఒకటి. కానీ ఈ పనిని చిటికెలో ముగించడం కోసం, తల్లులు పిల్లలకు చేతికి సెల్‌ఫోన్లను అందిస్తున్నారు. అయితే ఈ ధోరణితో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలు కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు
మన చిన్నతనంలో అమ్మ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. అమ్మమ్మ కథలు చెబుతూ అన్నం తినిపించేది. కానీ ఇప్పటి తల్లులకు అంతటి తీరికా, ఓపికా కరువవుతోంది. ఉరుకుల పరుగుల జీవితాలతో బిడ్డకు సమయం కేటాయించే తీరిక సమయం చిక్కడం లేదు. దాంతో బిడ్డ ఆకలి తీర్చే పనిని ఆదరాబాదరాగా ముగించేస్తున్నారు. అందుకోసం సెల్‌ఫోన్ల మీద ఆధారపడుతున్నారు. పిల్లాడు ఫోన్‌లో మునిగిపోతే, తల్లి, బిడ్డ నోట్లో ముద్దలు కూరడం ప్రతి ఇంట్లో ఒక తంతుగా మారిపోతోంది. ఈ క్రమంలో బిడ్డకు కడుపు నిండా తినిపించగలిగాననే సంతృప్తి పొందే తల్లులు, పరోక్షంగా బిడ్డ ఎదుగుదలను దెబ్బ తీస్తున్నామనే విషయాన్ని గ్రహించలేక పోతున్నారు.
తల్లి నుంచే నేర్చుకుని...
కొందరు తల్లులు ‘మా పిల్లలకు మాటలు రావడం లేదండీ’ అంటూ వైద్యులను కలుస్తూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం పిల్లలతో తల్లులు సంభాషించకపోవడమే! తల్లి బిడ్డకు అన్నం తినిపించే సమయం ఎంతో కీలకమైనది. బిడ్డ కళ్లలోకి చూస్తూ, కబుర్లు చెబుతూ అన్నం తినిపించడం వల్ల, బిడ్డకు భాష మీద పట్టు పెరుగుతుంది. తల్లీబిడ్డల అనుబంధం కూడా బలపడుతుంది. ఆడుతూ పాడుతూ అన్నం తినిపించడం వల్ల బిడ్డలకు భౌతిక వ్యాయామ ఫలం కూడా దక్కుతుంది. తల్లి మాట్లాడే మాటలనే పిల్లలు చెవుల ద్వారా విని, మెదళ్లలో నిక్షిప్తం చేసుకుని, తిరిగి నోటితో మాట్లాడగలుగుతారు. బదులుగా సెల్‌ఫోన్ చేతికి అందించి తినిపించినప్పుడు, తల్లీబిడ్డల కళ్లు కలుసుకోవు, వాళ్ల మధ్య మాటలు ఉండవు. దాంతో అనుబంధం బలపడకపోవడమే కాకుండా, బిడ్డకు భాష మీద పట్టు పెరగడం ఆలస్యమవుతుంది. ఈ ప్రతికూలతలకు తోడు పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు కూడా పెరుగుతాయి. కోపం, చికాకు, నిద్ర సమస్యలు తలెత్తడంతో పాటు మున్ముందు పిల్లలకు సెల్‌ఫోన్ ఒక వ్యసనంగా మారిపోతుంది.
కథలు, కబుర్లతో...
ఎన్ని పనులున్నా, పిల్లల కోసం సమయం కేటాయించక తప్పదు. మరీ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం పోషకాహారాన్ని అందించడంతో పాటు, వయసును బట్టి తినిపించే వయసులో తినిపించాలి. స్వయంగా తినగలిగే వయసులో, వాళ్ల చేతే తినిపించేలా చేయాలి. పిల్లలు తినడానికి ఇష్టపడరనీ, పేచీ పెడతారనీ, అన్నం తినిపించడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుందనీ... ఇలా తల్లులు పలు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ఫిర్యాదులన్నిటికీ పరిష్కారాలున్నాయి. బిడ్డ పేచీ పెట్టకుండా తినాలంటే ఆకలి వేసే వరకూ ఆగాలి. మనమెలాగైతే నిర్దిష్ట ఆహార వేళలు పాటిస్తూ ఉంటామో, పిల్లల విషయంలో కూడా వాటినే పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా బిడ్డ పొట్ట చిన్నదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలాగే తల్లులు పాటించవలసిన నియమాలు ఇంకొన్ని ఉన్నాయి. అవేంటంటే...
బిడ్డకు తల్లితండ్రులు తగినంత సమయం కేటాయించాలి
బిడ్డకు గంటల తరబడి వెంటపడి భోజనం తినిపించకూడదు. బిడ్డ ఎక్కువ తిన్నా, తక్కువ తిన్నా భోజనానికి అరగంట సమయమే కేటాయించాలి
తిన్నది జీర్ణమై ఆకలి కలగడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆలోగా పిల్లలకు వేరే ఆహారమేదీ ఇవ్వకూడదు
పాల సీసా నింపి, బిడ్డకు రోజంతా తరచూ పాలు తాగించే అలవాటు మానేయాలి
పిల్లలను ఆకట్టుకునేలా, నోరూరించేలా భిన్నమైన పద్ధతుల్లో పదార్థాలను వండి తినిపించాలి
రంగురంగుల కూరగాయలకు భోజనంలో స్థానం కల్పించాలి
కళ్లలోకి చూస్తూ, కబుర్లు, కథలు చెబుతూ అన్నం తినిపించాలి
ఈ నియమాలు పాటిస్తూ...
ఆహారం రుచిగా, ఆకర్షణీయంగా ఉన్నప్పుడు పిల్లలు కచ్చితంగా పేచీ పెట్టకుండా తింటారు. ఇలాంటప్పుడు బలవంతంగా తినిపించే పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. అలాగే పిల్లలకు ఆకలేసే అవకాశం ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వకుండా ప్రతి అరగంటకూ పండ్లు, చిరుతిళ్లు తినిపిస్తూపోతే భోజన సమయానికి పిల్లలు కచ్చితంగా పేచీ పెడతారనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అలాగే పాలను రోజుకు రెండుసార్లకూ లేదా రాత్రికీ పరిమితం చేయడం ఉత్తమం. రాత్రి నిద్రకు ముందు పాలు అందిస్తే పిల్లలు పేచీ పెట్టకుండా గటగటా తాగేసి పడుకుంటారు. కొన్ని ఇళ్లలో పిల్లలకు ఉదయాన్నే బ్రేక్‌ఫా్‌స్టకు ముందు పాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకొన్ని ఇళ్లలో పాలు, బిస్కెట్లు తినిపించి బడికి పంపించేస్తూ ఉంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. ఉదయం నిద్ర లేస్తూనే పాలు తాగవలసి వస్తుందేమోననే భయం పిల్లలను వెంటాడకుండా ఉండాలంటే, పాలకు బదులుగా ఇడ్లీ, ఉప్మా, దోశ లాంటి బ్రేక్‌ఫాస్ట్ తినిపించాలి. ఇక బయటి చిరుతిళ్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అరుదుగా తప్ప అదొక అలవాటుగా మారకుండా చూసుకోవాలి. బయటి చిరుతిళ్లలో అలవాటు పడడానికి దోహదపడే పదార్థాలను కలుపుతూ ఉంటారు. వీటితో పాటు చిరుతిళ్లలోని నిల్వ పదార్థాలు, కృత్రిమ రంగులు, రుచులు దీర్ఘకాలంలో పిల్లల్లో ఫిట్స్, తెలివితేటలు తగ్గడం లాంటి సమస్యలను తెచ్చిపెడతాయి.
పెద్దలే ఆదర్శం
సెల్‌ఫోన్ వాడకం విషయంలో పిల్లలకు పెద్దలే మార్గదర్శకులు కావాలి. పెద్దలు కూడా వాటికి దూరం పాటించాలి. పరిమిత వేళల్లో, అత్యవసరమైతే మినహా సెల్‌ఫోన్ జోలికి వెళ్లడం లేదనే విషయాన్ని పిల్లలు గ్రహించేలా నడుచుకోవాలి. మరీ ముఖ్యంగా భోజన వేళల్లో అన్ని స్ర్కీన్స్‌కూ దూరం పాటించగలిగితే, పిల్లలు కచ్చితంగా ఇదే అలవాటును అలవరుచుకుంటారు.
ఈ వయసెంతో కీలకం
ఐదు నెలల నుంచి ఐదేళ్ల వరకూ పిల్లల మెదడు ఎదుగుదల, తల్లితో ఏర్పడే అనుబంధం ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా రెండేళ్ల వయసొచ్చేవరకూ పిల్లలు స్పాంజ్ మాదిరిగా సంగతులన్నిటినీ శోషించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆలోగా బిడ్డకు ఎంత ఎక్కువ మాటలు నేర్పిస్తే, ఎంత ఎక్కువగా సంభాషించగలిగితే వాళ్ల మెదళ్లలో అంత ఎక్కువగా నాడీ సంబంధాలు ఏర్పడి, బిడ్డ మానసిక ఎదుగుదల అంత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఈ వయసులో బిడ్డల దృష్టి గ్యాడ్జెట్స్ వైపు మళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్లతో పాటు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, టివిలు... ఇవన్నీ బిడ్డ ఎదుగుదలను దెబ్బతీసేవే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. సెల్‌ఫోన్‌కు బదులుగా ఆట వస్తువులు, బొమ్మలు, ఫొటోలు కలిగిన పుస్తకాలను అందించాలి
డాక్టర్ సత్యన్నారాయణ కావలి
పీడియాట్రిషియన్,
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్,
ఎల్.బి. నగర్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News