Share News

Divine Beauty of Andal: విలక్షణం... దివ్య సుందరం

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:56 AM

అర్చామూర్తిని... అంటే విగ్రహరూపంలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించి, మోక్షాన్ని పొందిన భక్తుల చరిత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీగోదాదేవి కథ ప్రసిద్ధమైనది. స్వామి అనుగ్రహంకోసం ఆమె ఆచరించి, లోకానికి...

Divine Beauty of Andal: విలక్షణం... దివ్య సుందరం

తెలుసుకుందాం

అర్చామూర్తిని... అంటే విగ్రహరూపంలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించి, మోక్షాన్ని పొందిన భక్తుల చరిత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీగోదాదేవి కథ ప్రసిద్ధమైనది. స్వామి అనుగ్రహంకోసం ఆమె ఆచరించి, లోకానికి అనుగ్రహించిన తిరుప్పావై వ్రతం ఎంతో సులభతరమైనది. మనల్ని రక్షించడానికి వచ్చిన అమ్మ కాబట్టి ఆమెను ‘ఆండాళ్‌’ అనీ, తాను ధరించిన మాలలను భగవంతుడికి అర్పించినది కాబట్టి ‘చూడికుడుత్త నాచ్చియార్‌’ అనీ పిలుస్తారు. అయోనిజగా భూమిపై అవతరించిన గోదాదేవి దివ్యరూపం బహు సుందరమైనది. అది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి సేవించిన గోపికల్లా ఉంటుంది.

ఆళ్వారుల్లో ఒకరైనప్పటికీ...

శిల్పశాస్త్రం ప్రకారం భగవంతుడి ప్రతిమలను సాధారణంగా ‘ఉత్తమ దశ తాళ’ పద్ధతిలో, దేవేరులను ‘మధ్యమ దశ తాళ’ పద్ధతిలో నిర్మిస్తారు. శ్రీగోదాదేవి సామాన్యమైన మనుష్య రూపంలో అవతరించింది. తన అనన్యమైన భక్తితో భగవంతుణ్ణి సేవించి, ఆయనే పతిగా ఆరాధించి, వివాహమాడి, ఆయనలో లీనమైపోయింది. ఆమె పన్నిద్దరు ఆళ్వారుల్లో ఒకరు అయినప్పటికీ... భగవంతుని సారూప్య స్థితిని పొందింది. కనుక గోదాదేవి విగ్రహం చేసేటప్పుడు... ఆగమోక్తంగా దేవేరులను చేసినట్టే... ‘మధ్యమ తాళ’ పద్ధతిలో నిర్మించాలని శిల్ప శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. కాగా, మరో విధానం ప్రకారం భక్త ప్రతిమలను, ఆండాళ్‌తో సహా పన్నిద్దరు ఆళ్వారుల విగ్రహాలను ‘ఉత్తమ అష్ట తాళ’ పద్ధతిలో చేయాలని ‘విష్ణుతత్వం’ అనే గ్రంథం చెప్పింది.

చేతిలో చిలుక

శ్రీగోదాదేవి రూపం ఎంతో విలక్షణమైనది. ఆమె జన్మస్థానమైన శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న ఆండాళ్‌ విగ్రహంలో... తన ఎడమ చేతిలో చిలుకను ధరించి ఉంటుంది. కుడి చేతిని డోల హస్తంగా (ఊయలలా ఊగుతున్న భంగిమలో) ఉంచుతుంది. చిలుక వేదానికి, జ్ఞానానికి, భక్తికి, ప్రేమకు ప్రతీక. మనుషుల్లా మాటలు పలుకగలిగే ఏకైక పక్షి చిలుక. అందుకే శ్రీరంగమన్నార్‌ స్వామివారి కుడివైపున గోదాదేవి నిలబడి, తన ఎడమ చేతిలో చిలుకను ధరించి, శ్రీవారిపై తన ప్రేమను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే శ్రీరంగ క్షేత్రంలో మాత్రం విలక్షణంగా... శ్రీరంగనాథుని ఎడమవైపు సన్నిధిలో వేంచేసి ఉండే గోదాదేవి... తన కుడిచేతితో చిలుకను పట్టుకొని, ఎడమ చేతిని డోల హస్తంగా ఉంచుతుంది.


ఆండాళ్‌ కొప్పు

గోదాదేవి తలపై అందమైన కొప్పు ఉంటుంది. ఇది దేవీ ప్రతిమలకు నిర్దేశితమైన ఒక ప్రత్యేకమైన తలముడి. తలమీద అందంగా... తామరపువ్వు మొగ్గలా అమర్చిఉండే ‘కుంతలం’ అనే ఈ అలంకారం... తలకు మధ్యలో కానీ, పక్క భాగంలో కానీ ఉండవచ్చు. ఇటువంటి కొప్పు ముడి బాలకృష్ణుని విగ్రహానికి, నమ్మాళ్వార్‌ విగ్రహానికి అలంకరించి ఉండడం గమనించవచ్చు. అలాగే శ్రీకృష్ణుని దేవేరులైన రుక్మిణి, సత్యభామలకు కూడా దీన్ని అలంకరింపజేయడం ఒక విధానం. కానీ అది ‘ఆండాళ్‌ కొప్పు’గానే ప్రసిద్ధి చెందింది. కొన్నిచోట్ల గోదాదేవి విగ్రహానికి అంతర్గతంగానే పుష్పమాలిక ఉంటుంది. చాలా దివ్య దేశాల్లో విడిగా అలంకరిస్తారు.

డి.యన్‌.వి. ప్రసాద్‌, స్థపతి,

9440525788

ఇవి కూడా చదవండి...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 12:56 AM