Community Participation In Governance: సామాజిక భాగస్వామ్యమే ప్రగతి పాఠం
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:23 AM
క్షీణించిన భూసారం, పడిపోయిన దిగుబడి, వలస బాటలో జనం... ఇదీ రెండేళ్ళ క్రితం మహారాష్ట్రలోని దవ్వా గ్రామ పంచాయతీ ముఖచిత్రం. ఇప్పుడది లక్షకు పైగా మొక్కలతో, సౌర విద్యుత్‌తో, ఆధునిక...
క్షీణించిన భూసారం, పడిపోయిన దిగుబడి, వలస బాటలో జనం... ఇదీ రెండేళ్ళ క్రితం మహారాష్ట్రలోని దవ్వా గ్రామ పంచాయతీ ముఖచిత్రం. ఇప్పుడది లక్షకు పైగా మొక్కలతో, సౌర విద్యుత్‌తో, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధికి చిరునామాగా మారింది. కిందటి ఏడాది తొలి సీఏఎ్‌సపీఏ పురస్కారానికి ఎంపికై, కోటి రూపాయల బహుమతి గెలుచుకుంది. ఈ పురోగతికి బాటలు వేసిన సర్పంచ్ యోగేశ్వరీ చౌధురి... సామాజిక భాగస్వామ్యంతో అద్భుతాలు సాధించవచ్చని నిరూపించారు.
‘‘మాది మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఒక చిన్న గ్రామం. నా పుట్టింటివారికి గానీ, అత్తింటివారికి గానీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. మావి వ్యవసాయ కుటుంబాలు. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. పదో తరగతి, ఇంటర్మీడియెట్ మంచి మార్కులతో పాసయ్యాను. డిగ్రీలో చేరదామనుకుంటే... మావాళ్ళు నాకు వివాహం చేశారు. అదే జిల్లాలోని దవ్వా గ్రామంలో నవ వధువుగా అడుగు పెట్టాను. చదువంటే నాకున్న ఆసక్తిని నా భర్త అర్థం చేసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో బీఏ, బీఈడీ చేశాను. టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. మాకు ఒక సంతానం. హాయిగా సాగిపోతున్న నా జీవితాన్ని నా భర్త హఠాన్మరణం తల్లకిందులు చేసింది.
ప్రతి ఇంటి అవసరాలు తీరేలా...
టీచర్‌గా, ఒంటరి మహిళగా గ్రామంలోని మహిళలకు నేనంటే గౌరవం, సానుభూతి ఉన్నాయి. తీరిక సమయాల్లో నా దగ్గరకు వచ్చి తోడుగా ఉండేవారు. వారి కుటుంబ పరిస్థితుల గురించి కూడా నాతో చెప్పేవారు. గ్రామంలోని మట్టిలో సారం క్షీణించడం, అడవులు తగ్గిపోవడం, వర్షపాతంలో అనిశ్చితి లాంటి సమస్యలతో వ్యవసాయాన్ని నష్టదాయకంగా మార్చాయి. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దవ్వా గ్రామంలో వ్యవసాయ దిగుబడులు తగ్గడం, అవకాశాలు పరిమితం కావడంతో పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. కనీస సదుపాయాలు, ఆర్థిక స్థిరత్వం లేని దుస్థితిలో గ్రామస్తులు ఉన్నారు. ఈ సమస్యలు తీరాలంటే నిబద్ధత కలిగిన నాయకత్వం అవసరమని అర్థమయింది. అందుకే 2023 చివర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాను. జనం నామీద విశ్వాసం ఉంచి మద్దతు ఇచ్చారు. మంచి మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తీర్మానాలు, నిర్ణయాల జోలికి పోకుండా... గ్రామస్తులతో బహిరంగ సమావేశాలు నిర్వహించాను. అలాగే ప్రతి ఇంటికీ వెళ్ళాను. వారి అవసరాల గురించి తెలుసుకున్నాను. నీటి సంరక్షణ నుంచి చెట్ల పెంపకం వరకూ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలతో జాబితా తయారు చేశాను. పారిశుధ్యం, విపత్తు నిర్వహణ, నీటి నిర్వహణ లాంటి అంశాలపై కమిటీలు వేశాను. ప్రతి ఇంటినుంచి ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా ఉండేలా చూశాను.
వ్యవసాయం లాభసాటిగా...
నాకు రాజకీయంగా పలుకుబడి లేకపోవడంతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మెల్లగా పరిపాలనాపరమైన అంశాలను నేర్చుకున్నాను. నిధులు కేటాయించేలా అధికారులను ఒప్పించగలిగాను. చివరకు పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మాఝీ వసుంధర’ కార్యక్రమంలో మా పంచాయతీని చేర్చారు. దీనిలో భాగంగా ఇప్పటివరకూ దాదాపు లక్షా డెబ్భై వేల చెట్లను మా పంచాయతీ పరిధిలో నాటాం. నర్సరీలు ఏర్పాటు చేశాం. భూసారం పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే చర్యల్లో భాగంగా అయిదు రైతు బృందాలను, 38 స్వయం సహాయక మహిళా బృందాలను ఏర్పాటు చేశాం. వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవడం కోసం సౌరవిద్యుత్ ప్లాంట్ నెలకొల్పాం. మా పంచాయతీలోని పొలాలకు సాగునీరు పూర్తిగా సౌరవిద్యుత్ ద్వారానే అందుతోంది. అలాగే ఆధునిక, సేంద్రియ సాగు విధానాల్లో రైతులకు శిక్షణ కోసం వ్యవసాయ పాఠశాల ప్రారంభించాం. మొదట్లో స్థానిక రైతులు ఈ పద్ధతులను అమలు చేయడానికి సంకోచించారు. నాకున్న ఎనిమిది ఎకరాల్లో టేకు, మూడు ఎకరాల్లో వరి వేశాను. అంతర పంటలను కూడా పండిస్తూ మంచి దిగుబడి సాధించడంతో మిగిలిన రైతులు కూడా ఈ పద్ధతులవైపు మళ్ళారు. ముంబయికి వలస వెళ్ళిన వారు గ్రామానికి తిరిగి వచ్చి, తమ పొలాల్లో వ్యవసాయం చేస్తున్నారు. గ్రామంలోని ఇళ్ళన్నిటికీ సౌరవిద్యుత్ సరఫరా అవుతోంది. సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేసుకున్నాం. మంచి నీటి ట్యాంక్ నిర్మాణం మొత్తం గ్రామస్తులే పూర్తి చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాం. ఇళ్ళనుంచి చెత్తను సేకరించి, వేరుచేసి, కంపో్‌స్టగా ఉపయోగిస్తున్నాం.
తొలి పంచాయతీగా...
ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మా పంచాయతీ కేవలం రెండేళ్ళలోనే దేశానికి ఆదర్శంగా మారింది. ‘సంత్ గాడ్గే బాబా’ అవార్డు, ‘మాఝీ వసుంధర’ అవార్డుతో సహా పలు రాష్ట్ర స్థాయి పురస్కారాలతో పాటు..... కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘క్లైమెట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు’ (సీఏఎ్‌సపీఏ)ను తొలిసారి అందుకున్న పంచాయతీగా ఘనత సాధించింది. సీఏఎ్‌సపీఏ కింద కోటి రూపాయలతో సహా మొత్తంగా రూ.1.6 కోట్లకు పైగా నగదు పురస్కారాలు అందుకున్నాం. దీంతో మరింత ప్రగతికి దోహదపడే అవకాశం లభించింది. ఇప్పుడు దవ్వాలో ప్రగతి ప్రతిచోటా కనిపిస్తోంది. వరిసాగు పెరిగింది. నర్సరీలు పూలతో కళకళలాడుతున్నాయి. సామాజిక భాగస్వామ్యం, మహిళా సాధికారత ద్వారా అపారమైన అభివృద్ధి సాధ్యమని మా ప్రజలు నిరూపించారు.’’
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News