Art of Living And Life Lessons: ప్రతిరోజూ పండుగే
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:47 AM
కోరికల జాబితా, తీర్మానాలు, సాధించాల్సిన లక్ష్యాలు లేదా నెరవేర్చుకోవాల్సిన ఆశలు... కొత్త సంవత్సరానికి సంబంధించి ప్రజలు సాధారణంగా ఆలోచించే అంశాలు. కానీ ఈ ఏడాది ఆ దృక్పథాన్ని మార్చుకోవాలనేది...
కోరికల జాబితా, తీర్మానాలు, సాధించాల్సిన లక్ష్యాలు లేదా నెరవేర్చుకోవాల్సిన ఆశలు... కొత్త సంవత్సరానికి సంబంధించి ప్రజలు సాధారణంగా ఆలోచించే అంశాలు. కానీ ఈ ఏడాది ఆ దృక్పథాన్ని మార్చుకోవాలనేది నా ఆకాంక్ష. మీరు ప్రపంచం కోసం జీవిస్తే... అది ప్రపంచానికి అదృష్టం అవుతుంది. కాలం మీ ఉనికిని వేడుక చేసుకోవాలి. మీరు ఎప్పటిలా చిరునవ్వుతో ఉండాలి.
పేదలు ఏడాదికి ఒక రోజును కొత్త సంవత్సరంగా వేడుక చేసుకోవచ్చు. ధనవంతుడికి ప్రతిరోజూ వేడుక. కానీ అత్యంత ధనవంతుడు ప్రతి క్షణాన్నీ వేడుకగా జరుపుకొంటాడు. ఇక్కడ ధనం అంటే భౌతిక సంపద కాదు. అవగాహన అనే సంపద. ప్రతి క్షణంలో పూర్తిగా ఉండే సమృద్ధి. అది మీకు ఉంటే ప్రతి క్షణాన్నీ వేడుక చేసుకుంటారు. సృష్టికర్తతో మమేకం అవుతారు. ‘మంచి రోజులు ఎప్పుడు వస్తాయి?’ అని నిరంతరం ఎదురుచూస్తే... కాలం నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే కాలం వేగంగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. స్వచ్ఛమైన హృదయం, నిశితమైన మనస్సు ఏ సమయాన్నైనా మంచి సమయంగా మార్చగలవు. అంటే కాలాన్ని మార్చి, దాన్ని మెరుగుపరిచే సామర్థ్యం మీలో ఉంది. ఈ కొత్త సంవత్సరం ముగిసిపోయేలోగా... ఆనందాన్ని పొందడానికే కాదు... గడచిన కాలాన్ని సమీక్షించడానికి కూడా సమయం కేటాయించండి. ఒక గంట సమయం తీసుకొని, గత వారం గురించి ఆలోచించండి. మీలో ఎదుగుదల ఏమిటి? మీరు ఏం చేశారు? ఏం సాధించారు? మీ చుట్టూ ఉన్న వారికి ఎంతవరకూ ఉపయోగించారు? గడచిన ఏడాది మీకు ఏ పాఠాలు నేర్పింది? ఇవన్నీ సమీక్షించుకోండి.
జ్ఞానంలో గడపండి
గత ఏడాది ఏం చేయాలో, ఏం చేయకూడదో మీకు తెలియజేసింది. మంచి సంఘటనలు, చెడు సంఘటనలు... ఈ రెండూ మీకు ఏదో ఒకటి నేర్పాయి. మళ్ళీ ఏం చేయాలో, ఆ పనులను ఎలా మెరుగుపరుచుకోవచ్చో మంచి సంఘటనలు చూపించాయి. దేన్ని నివారించుకోవాలో చెడు సంఘటనలు హెచ్చరించాయి. అంటే తప్పిదాలు కూడా మీ జీవితానికి దారి చూపించాయి. అంటే... మొత్తం ప్రపంచమే మీ మిత్రుడు, గురువు. మీరు శత్రువులుగా భావించేవారు కూడా మీ మిత్రులే. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలను వారు గుర్తు చేశారు. మీలోని సామర్థ్యాలను వెలికి తీశారు. గత సంవత్సరాన్ని ఒక పుష్పంగా దైవానికి అర్పించండి. గత ఏడాది నేర్పిన పాఠాలను మాత్రమే స్వీకరించి, పశ్చాత్తాపం, కోపం, ఒత్తిడి లేకుండా ముందుకు సాగండి. మన కోరికలకు, కార్యాలకు జ్ఞానం నుంచి మద్దతు లభిస్తే... జీవితంలో సుఖం, ఆనందం మిగులుతాయి. జ్ఞానం లేకపోతే మన ఆకాంక్షలు బలహీనపడతాయి. ప్రణాళికలు సాధారణంగా మారతాయి. మనపైన అనిశ్చితి కమ్ముకుంటుంది. కాబట్టి జ్ఞానంలో సమయాన్ని గడపండి. అప్పుడు మీరు చేసే పనులు, ప్రణాళికలు బలపడతాయి. మరింత ప్రభావవంతం అవుతాయి. ధ్యానం, జ్ఞానం ద్వారా మూలంతో అనుసంధానమైనప్పుడు... జీవితం నిరంతరం పండుగలా మారుతుంది.
శ్రీశ్రీ రవిశంకర్
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు
ఇవి కూడా చదవండి...
రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News