Share News

Blood Cancer Symptoms: రక్త క్యాన్సర్‌ రాకుండా...

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:25 AM

కొన్ని తీవ్రమైన వ్యాధుల లక్షణాలు పక్కదోవ పట్టిస్తూ, వ్యాధి నిర్థారణ, చికిత్సల్లో జాప్యాలకు కారణమవుతూ ఉంటాయి. అలాంటి వ్యాధుల్లో రక్త క్యాన్సర్‌ ఒకటి. లక్షణాల ఆధారంగా ఈ రుగ్మతను సకాలంలో గుర్తించడం...

Blood Cancer Symptoms: రక్త క్యాన్సర్‌ రాకుండా...

బ్లడ్‌ క్యాన్సర్‌

కొన్ని తీవ్రమైన వ్యాధుల లక్షణాలు పక్కదోవ పట్టిస్తూ, వ్యాధి నిర్థారణ, చికిత్సల్లో జాప్యాలకు కారణమవుతూ ఉంటాయి. అలాంటి వ్యాధుల్లో రక్త క్యాన్సర్‌ ఒకటి. లక్షణాల ఆధారంగా ఈ రుగ్మతను సకాలంలో గుర్తించడం, నివారణ, చికిత్సల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు రక్త క్యాన్సర్‌ నిర్థారణ పరంగా మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ప్రతి ఏటా లక్ష రక్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ కనుగొన్న రక్త క్యాన్సర్లతో పాటు ఇప్పటివరకూ కనిపెట్టని పలు రకాల రక్త క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ కనుగొన్న వాటిని... లుకేమియా, లింఫోమా, మైలోమా అనే మూడు రకాల ప్రధాన రక్త క్యాన్సర్లుగా విభజించారు. వీటిలో ప్రతి ఒక్క క్యాన్సర్‌కూ భిన్నమైన ఉప రకాలు, లక్షణాలు, కారణాలు, చికిత్సలూ ఉంటాయి. మన దేశంలో సర్వసాధారణంగా కనిపించే రక్త క్యాన్సర్‌... లుకేమియా. అలాగే లింఫోమా, మైలోమాలు కూడా కొన్నేళ్ల కాలంలో ప్రబలంగా మారాయి. అయితే రక్త క్యాన్సర్‌ ఏ రకానికి చెందినదైనా, లక్షణాల ఆధారంగా వ్యాధిని గుర్తించడం ఆలస్యమవుతోంది.

పక్కదోవ పట్టించే లక్షణాలు...

లుకేమియాలు పలు రకాలు. రకాన్ని బట్టి లక్షణాల్లో మార్పు ఉన్నప్పటికీ, అన్ని రకాల లుకేమియాలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే...

  • నీరసం: రోజువారీ పనులు చేసుకోలేనంత నీరసం, చిన్న పనికే ఆయాసం, ఈ స్థితి రోజుల తరబడి కొనసాగడం

  • జ్వరం: తరచూ జ్వరం రావడం, మూడు, నాలుగు వారాలకు మించి కొనసాగడం

  • బరువు తగ్గడం: క్రమేపీ బరువు తగ్గిపోతూ ఉండడం

  • చమటలు: రాత్రి వేళల్లో దుస్తులు తడిచిపోయేటంత చమట పట్టడం

  • రక్తస్రావం: చర్మం అడుగున సులభంగా కమిలిపోతూ ఉండడం, నెలసరి స్రావం విపరీతంగా ఉండడం

  • పురుషుల్లో: ముక్కు, దంతాల నుంచి రక్తం కారడం, మలంలో రక్తస్రావం


ఇతర రుగ్మతల్లో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఇతరత్రా వ్యాధులకు ఆపాదించుకుంటూ, మందులు వాడుకుంటూ తాత్సారం చేయడం వల్ల రక్త క్యాన్సర్‌ వ్యాధి ముదిరిపోతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, పైన చెప్పిన లక్షణాల్లో ఏ మూడు లక్షణాలు ఉమ్మడిగా కనిపించినా, రెండు నుంచి మూడు వారాల పాటు కొనసాగినా, రక్త క్యాన్సర్‌గానే అనుమానించి, వీలైనంత త్వరగా వైదుయలను కలవాలి.

వయసును బట్టి...

  • పిల్లల్లో: అక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా పిల్లల్లో సర్వసాధారణం. 10 నుంచి 15 శాతం కేసుల్లో పిల్లలకు జన్యుపరంగా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది

  • 20 నుంచి 40/50 ఏళ్లు: క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా, లింఫోమాలు

  • మధ్య వయస్కుల్లో: మల్టిపుల్‌ మైలోమా, సిఎల్‌ఎల్‌లు

  • వృద్ధులు: క్రానిక్‌ లింఫొసైటిక్‌ లుకేమియా, ఇతరత్రా లింఫోమాలు

ఈ రక్త క్యాన్సర్లు ఈ వయసులకే పరిమితం కాదు. ఇవి ఏ వయసు వారికైనా, ఎప్పుడైనా రావచ్చు.


ప్రధాన కారణాలివే!

తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి, పని వాతావరణంలోని... వీటిలోని రసాయనాలే రక్త క్యాన్సర్‌ ప్రధాన కారణాలు! పాలీసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌ కోవకు చెందిన ‘బెంజీన్‌’ రసాయనం, రక్త క్యాన్సర్‌కు ముఖ్య కారణమని తేలింది. సేంద్రీయ పదార్థాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించడం వల్ల, పొలాలకు చల్లే పురుగు మందుల వల్ల, అవి భూమిలోకి చేరుకుని భూగర్భ జలాలు కలుషితమవడం వల్ల... ఈ రసాయనం మన శరీరాల్లోకి చేరుకుని, రక్త క్యాన్సర్‌ ముప్పును పెంచుతోంది. వాహన కాలుష్యం, పురుగుమందులు, ఎరువుల వాడకం, వాటితో పండే పంటలను తినడం, కలుషితమైన నీటిని తాగడం, పాలీసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌ కలిసిన గాలిని పీల్చడం వల్ల, రక్త క్యాన్సర్‌ విపరీతంగా ప్రబలుతోంది. నిజానికి వీటిలో ఏ ఒక్క కారణాన్నీ సమూలంగా అడ్డుకునే అవకాశాలు లేవు. ఎయిర్‌ ప్యూరిఫయర్లు గాల్లో కలిసిన ధూళి రేణువులను వడగకట్టగలుగుతాయి కానీ, వాయువులను వడగట్టలేవు. వాటర్‌ ఫిల్టర్లు వ్యాధికారక సూక్ష్మజీవులను వడగట్టగలుగుతాయి తప్ప, రసాయనాలను వడగట్టలేవు. కూరగాయలు, పండ్లలోకి చేరుకునే రసాయనాలను తొలగించుకోగలిగే మార్గం లేదు. అయినప్పటికీ సాధ్యమైనంత మేరకు ఈ హానికారక రసాయనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అదెలాగంటే...

  • బయటకు వెళ్లినప్పుడు ముఖానికి మాస్కులు పెట్టుకోవాలి

  • ట్రాఫిక్‌కు దూరంగా ఉండాలి

  • నీటిని వడగట్టడం కోసం రివర్స్‌ ఆస్మోసిస్‌ ఫిల్టర్‌ ఉపయోగించాలి

  • కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగా తొక్క తీసి వాడుకోవాలి

  • సోడియం బైకార్బొనేట్‌ కలిపిన నీళ్లలో కూరగాయలు, పండ్లను కడగడం ద్వారా రసాయనాలను కొంత మేరకు తొలగించుకోవచ్చు

  • కార్బైడ్‌తో పండించిన పండ్లను తినకూడదు

  • సేంద్రీయ పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి

  • వీలైతే, ఇంట్లోనే కూరగాయలు పండించుకోవాలి

  • పరిశ్రమలకు, ట్రాఫిక్‌కు దూరంగా నివసించాలి

  • హానికారక రసాయనాలకు ఎక్కువగా బహిర్గతమయ్యే స్వర్ణకారులు, శిలాజ ఇంధనాల వృత్తుల్లో ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించాలి

000-navya.jpg


సమర్థ చికిత్సలున్నాయి

మల్టిపుల్‌ మైలోమా, సిఎల్‌ఎల్‌ రక్త క్యాన్సర్లకు శాశ్వత చికిత్స లేకపోయినప్పటికీ, మధుమేహంలా దీన్ని కూడా అదుపులో ఉంచే చికిత్స తీసుకోవచ్చు. ప్రధాన లుకేమియాలన్నిటికీ కీమో థెరపీ కీలక చికిత్సా విధానం. అయితే అత్యాధునిక కీమోథెరపీలతో తక్కువ దుష్ప్రభావాలు, ఎక్కువ ఫలితాన్ని పొందే వీలు కలుగుతోంది. టార్గెటెడ్‌ థెరపీల సహాయంతో, క్యాన్సర్‌ జెనెటిక్‌ ప్రొఫైల్‌ ఆధారంగా, జెనెటిక్‌, ప్రొటీన్‌ లక్ష్యాల ఆధారిత చికిత్సను అందించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సగటున ఆరు నుంచి ఏడు టార్గెటెడ్‌ థెరపీలనూ, రెండు నుంచి మూడు మందులనూ ఆవిష్కరిస్తున్నారు. అలాగే కొత్త రకం ఇమ్యునోథెరపీ మందుల సహాయంతో శరీర వ్యాధినిరోధక కణాలను క్యాన్సర్‌ కణాలతో పోరాడేలా ప్రోత్సహించే చికిత్స కూడా సత్ఫలితాలనిస్తోంది. చివరి ప్రయత్నంగా కొందరికి ఎముక మజ్జ మార్పిడి అవసరం పడొచ్చు. మునుపటితో పోలిస్తే, ప్రస్తుత మజ్జ మార్పిడి చికిత్సలతో దుష్ప్రభావాలు, ఖర్చు తగ్గిపోయాయి. కోలుకునే వేగం పెరిగింది. కొన్ని రకాల ఎముక మజ్జ మార్పిడి చికిత్సలను ఔట్‌ పేషెంట్‌ పద్ధతిలో అందించగలిగే సౌలభ్యం కూడా అందుబాటులోకొచ్చింది. అలాగే వ్యాధి సంక్లిష్టతలను తగ్గించి, నయం చేసే అవకాశాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. ఎముక మజ్జ మార్పిడి సైతం సాధ్యపడని వాళ్ల కోసం కార్‌టి సెల్‌ థెరపీ అనే కొత్త ప్రక్రియ కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చింది.

రక్త క్యాన్సర్‌ అంటే?

రక్తకణాలను, రక్తకణాలు ఉత్పత్తయ్యే ఎముక మజ్జనూ ప్రభావితం చేసే క్యాన్సర్‌నే ప్రధానంగా రక్త క్యాన్సర్‌ అంటారు. రక్తకణాల్లో... ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఎర్ర రక్త కణాలు, వ్యాధులతో పోరాడే తెల్ల రక్తకణాలూ, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ప్లేట్‌లెట్లూ ఉంటాయి. వీటిలో ఏ కణం అసహజంగా మారినా, పరిమితికి మించి పెరిగినా, రక్తం, వ్యాధినిరోధక వ్యవస్థల సహజ పనితీరుకు అవరోధంగా మారినా రక్త క్యాన్సర్‌ చోటుచేసుకుంటుంది.

డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ చక్రవర్తి

సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, హెమటో ఆంకాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 01:25 AM