Share News

ఈ మూడూ ఒకటి కాదు...

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:43 AM

చలికాలంలో చర్మం తరచూ పొడిబారి పగులుతూ నొప్పిగా అనిపిస్తుంటుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు...

ఈ మూడూ ఒకటి కాదు...

చలికాలంలో చర్మం తరచూ పొడిబారి పగులుతూ నొప్పిగా అనిపిస్తుంటుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు మాయిశ్చరైజర్‌, బాడీ లోషన్‌, కోల్డ్‌ క్రీమ్‌ ఇలా అందుబాటులో ఉన్నదాన్ని రాసుకుంటూ ఉంటారు. కానీ ఈ మూడూ ఒకటి కాదు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం...

మాయిశ్చరైజర్‌

ఇది ఒక్క చలికాలంలో మాత్రమే కాదు అన్ని కాలాల్లో చర్మ సంరక్షణకు అత్యవసరం. ఇందులో నూనె, నీరు కలిసి ఉంటాయి కాబట్టి చర్మం పొరల్లోకి సులువుగా ఇంకుతుంది. చర్మానికి జిడ్డుదనం లేకుండా లోతుగా తేమను లాక్‌ చేస్తుంది. ఎలాంటి చర్మ తత్వం ఉన్నవారైనా మాయిశ్చరైజర్‌ను వాడడం మంచిది. జిడ్డు చర్మం ఉన్నవారు జెల్‌ లేదా వాటర్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్లు, పొడి చర్మం ఉన్నవారు క్రీమ్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్లను ఎంచుకోవాలి. స్నానం చేసిన తరువాత లేదా ముఖం కడుక్కున్న తరువాత చర్మం తడితడిగా ఉన్నప్పుడే తగిన మాయిశ్చ రైజర్‌ను రాసుకుంటే మంచి ప్రయోజనం చేకూరుతుంది.

బాడీ లోషన్‌

దీనిలో నీటి శాతం అధికం. కాబట్టి ఇది ద్రవ రూపంలో తేలికగా ఉంటుంది. ఏ మాత్రం జిడ్డుగా అనిపించదు. దీన్ని రాసుకున్న వెంటనే సులువుగా చర్మంలోకి ఇంకి కాళ్లు, చేతులు, వీపు లాంటి శరీర భాగాలను మృదువుగా మార్చేస్తుంది. బట్టలకు కూడా అంటదు. కానీ బాడీ లోషన్‌ను ముఖానికి రాసుకోకూడదు. అలా రాస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. చలికాలంలో రోజూ స్నానం చేసిన తరువాత దీన్ని శరీరానికి రాసుకుంటే చర్మం పొడిబారదు.


కోల్డ్‌ క్రీమ్‌

ఇందులో నీటి శాతం చాలా తక్కువ. నూనె లేదా మైనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చిక్కగా క్రీమ్‌లా అనిపిస్తుంది. దీన్ని రాసుకున్నప్పుడు చల్లటి అనుభూతి కలుగుతుంది. ఇది చర్మంపై రక్షణగా నిలిచి లోపలి పొరల్లోని తేమ ఆవిరి కాకుండా కాపాడుతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. చలిలో బయటికి వెళ్లేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ముఖానికి, శరీరానికి కోల్డ్‌క్రీమ్‌ రాసుకోవడం మంచిది. కానీ జిడ్డు చర్మం ఉన్నవారు, మొటిమలు ఎక్కువగా ఉన్నవారు దీన్ని ఉపయోగించకూడదు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 05:46 AM