చర్మ సమస్యలకు చెల్లు చీటీ
ABN , Publish Date - Sep 01 , 2026 | 02:21 AM
నడి వయసులో పులిపిర్లు, మంగు లాంటి చర్మ సమస్యలు మొదలవుతాయి. అసౌకర్యంగా, ఎబ్బెట్టుగా కనిపించే ఈ సమస్యలను వదిలించే చర్మ చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి...
స్కిన్ కేర్
నడి వయసులో పులిపిర్లు, మంగు లాంటి చర్మ సమస్యలు మొదలవుతాయి. అసౌకర్యంగా, ఎబ్బెట్టుగా కనిపించే ఈ సమస్యలను వదిలించే చర్మ చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు. నడి వయసులో హార్మోన్ల అసమతౌల్యం వల్ల చర్మం పలు మార్పులకు లోనవుతుంది. దాంతో పులిపిర్లు, మచ్చలు లాంటివి తలెత్తడం మొదలుపెడతాయి. వీటితో చర్మానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా, అసౌకర్యంగా, ఇబ్బందికరంగా మారినప్పుడు వీటిని తొలగించుకోవడంలో తప్పు లేదు.
పులిపిర్లు పలు చోట్ల
కొందరికి నడి వయసుకు చేరుకోగానే మెడ చుట్టూరా, ముఖం మీదా, బాహుమూలాల్లో, తొడల దగ్గర పులిపిర్లు పెరుగుతాయి. కొందర్లో ఇవి చిన్న పరిమాణానికే పరిమితమైతే, కొందర్లో పెద్దగా పెరిగిపోతాయి. అయితే ఈ పులిపిర్లతో ఆరోగ్యానికి ఎలాంటి నష్టం లేకపోయినా, చూపులకు ఇబ్బందికరంగా మారొచ్చు. అలాంటప్పుడు చర్మ వైద్యులను కలిసి వీటిని తొలగించుకోవచ్చు. అయితే ఒకసారి తొలగించుకున్నంత మాత్రాన మళ్లీ తలెత్తవని అనుకోకూడదు. వీటిని తీయించుకున్నా, తీయించుకోకపోయినా తలెత్తేవి తలెత్తుతూనే ఉంటాయి. కొందరు మహిళల్లో గర్భధారణ సమయంలో పులిపిర్లు తలెత్తుతూ ఉంటాయి. గర్భధారణ సమయంలో బరువు పెరిగి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్లే ఇలా జరుగుతుంది. అలాగే కుటుంబ చరిత్రలో పులిపిర్లు ఉన్నా, వాళ్లకు కూడా పులిపిర్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పులిపిర్లను వదిలించుకోవడం కోసం, సామాజిక మాధ్యమాల్లో కనిపించే చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వార్ట్ రిమూవల్ క్రీమ్స్ కొని వాడడం, సున్నం పులిపిర్ల మీద పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నాలతో పులిపిర్ల పూర్తిగా తొలగిపోకుండా సగం ఊడిపోయి, సగం ఉండిపోతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్ తలెత్తి నొప్పితో బాధపడవలసి వస్తుంది. ఇలాంటి చిట్కాలతో మచ్చల సమస్య కూడా ఎక్కువే! కాబట్టి చర్మ వైద్యులను కలిసి లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్సలతో వీటిని సురక్షితంగా తొలగించుకోవాలి. పెద్ద పులిపిర్లను తొలగించినప్పుడు కొంతమేరకు మచ్చ ఏర్పడవచ్చు. కానీ చిన్న వాటితో ఎలాంటి మచ్చలూ ఏర్పడవు.
ఎబ్బెట్టుగా కనిపించే ఎర్ర మచ్చలు
నడి వయసులో చర్మం మీద కనిపించే ఎర్రని మచ్చలు పెరుగుతాయి. చెర్రీ యాంజియోమాస్ అనే చర్మ లక్షణమిది. చర్మం అడుగున ఉండే సూక్ష్మ రక్తనాళాలు కలిసిపోవడం వల్ల చర్మం మీద ఈ మచ్చలు తలెత్తుతూ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు. అరుదుగా కొందర్లో కాలేయ సమస్యల ఫలితంగా ఈ తరహా రెడ్ మోల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. అయితే ఈ మచ్చలు చర్మం మీద ఎబ్బెట్టుగా కనిపిస్తున్నప్పుడు లేజర్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వీటిని తొలగించుకోవచ్చు. చికిత్సతో చిన్న మచ్చల స్థానంలో ఎలాంటి మచ్చలు ఏర్పడకపోయినా, పెద్ద వాటిని తొలగించినప్పుడు మచ్చలు ఏర్పడవచ్చు.
ముఖం మీద మంగు
కొందరు మహిళల్లో మెనోపాజ్ దశలో ముఖం మీద మంగు మచ్చలు మొదలవుతాయి. ఇంకొందరు మహిళల్లో గర్భిణి దశలోనే ఈ మచ్చలు మొదలవుతాయి. ఈ మచ్చలు పురుషుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని శాశ్వతంగా తొలగించే చికిత్సలు లేవు. బ్యూటీ సెలూన్లలో సూచించే క్రీమ్స్‌ను ఈ మచ్చల కోసం వాడుకోకూడదు. ఏడాది పొడవునా, 365 రోజులూ చర్మ వైద్యులు సూచించే నైట్ క్రీమ్స్ వాడుకోవాలి. వీటితో తగ్గని సందర్భాల్లో కెమికల్ పీల్స్, అంతిమంగా లేజర్ లాంటి ఆధునిక చికిత్సలను ఆశ్రయించవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ చికిత్సలతో కూడా మంగు మచ్చలు తొలగకపోవచ్చు. పిగ్మెంటేషన్, చర్మం లోపలి పొరల్లో ఉన్నప్పుడు మచ్చలను తొలగించడం కష్టమవుతుంది. కొన్ని నోటి మాత్రలు కూడా వాడుకోవచ్చు. కానీ కొన్ని రకాల వ్యాధులు లేవని నిర్థారించుకున్న తర్వాతే వీటిని వాడుకోవాలి. చికిత్సలతో మంగు వదిలినా, జీవితాంతం క్రీమ్స్ వాడుకుంటూనే ఉండాలి.
ఉబ్బెత్తు మచ్చలు
వయసు పైబడడం వల్ల చర్మం మందంగా మారి, నల్లబడే సమస్య ఇది. సెబోరిక్ మెలనోసిస్ అనే ఈ నల్లని, ఉబ్బెత్తు మచ్చలు పొట్ట లేదా కాళ్ల మీద తలెత్తుతూ ఉంటాయి. ఈ మచ్చలు క్రమేపీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొందరు చర్మ క్యాన్సర్ అనుకుని భయపడుతూ ఉంటారు. అయితే వైద్యులు డెర్మోస్కోపీతో పరీక్షించి క్యాన్సర్ కాదని నిర్థారిస్తూ ఉంటారు. లేజర్‌తో వీటిని తొలగించవచ్చు. పెద్ద మచ్చలను సర్జరీతో తొలగించుకోవాల్సి ఉంటుంది. అయితే
ఇవి పులిపిర్ల మాదిరిగా ఎక్కువ సంఖ్యలో తలెత్తడానికి బదులుగా రెండు, మూడు లేదా నాలుగు మచ్చలకే పరిమితమైపోతాయి. ఈ మచ్చలను చికిత్సతో పూర్తిగా తొలగించవచ్చు.
చర్మం మీద తలెత్తే పులిపిర్లు, రంగు మచ్చలను తొలగించుకోడానికి ఉపయోగించే లేజర్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్సలతో ఎలాంటి నొప్పి, అసౌకర్యం కలగదు. చికిత్సకు ముందు ఆ ప్రదేశాన్ని మొద్దుబార్చే క్రీమ్‌ను అప్లై చేసి, ఆ తర్వాతే వాటిని తొలగిస్తారు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.
డాక్టర్ స్వప్నప్రియ
డెర్మటాలజిస్ట్, కాస్మోస్యూర్,
హైటెక్‌సిటీ, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి