Share News

ముఖానికి ఆవిరి పడితే...

ABN , Publish Date - Jul 01 , 2026 | 04:59 AM

వానాకాలంలో ముఖం తరచూ జిడ్డుగా మారుతుంటుంది. దీంతో దుమ్ము, మురికి ఎక్కువగా పేరుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌ వస్తుంటాయి....

ముఖానికి ఆవిరి పడితే...

వానాకాలంలో ముఖం తరచూ జిడ్డుగా మారుతుంటుంది. దీంతో దుమ్ము, మురికి ఎక్కువగా పేరుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌ వస్తుంటాయి. అలాంటప్పుడు ముఖానికి ఆవిరి పట్టి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

  • ముందుగా ముఖానికి, కళ్లకు, పెదవులకు ఉన్న మేక్‌పను పూర్తిగా తొలగించి క్లెన్సర్‌ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి అందులో ఆరు కప్పుల మంచినీటిని పోసి ఆవిరి వచ్చే వరకు వేడి చేయాలి. ఆపైన రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ లేదా టీ ట్రీ ఆయిల్‌, ఒక చామంతి టీ బ్యాగ్‌ వేసి కలపాలి. తరువాత తల వెనక నుంచి గిన్నె మీదుగా ఒక టవల్‌ను కప్పి గిన్నెకు ఆరంగుళాల ఎత్తులో ముఖాన్ని ఉంచాలి. కళ్లు మూసుకుని అయిదు నుంచి పది నిమిషాలు ఇలా ఆవిరి పట్టాలి.

  • ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆపైన టిష్యూ పేపర్‌తో తుడిచేస్తే మురికి తొలగి చర్మం శుభ్రపడుతుంది. తరువాత ఏదైన ఫేస్‌ ప్యాక్‌ను వేస్తే తగినంత తేమ అంది చర్మం బిగుతుగా మారి ముఖం తాజాగా కనిపిస్తుంది.

  • ముఖంపై బ్లాక్‌ హెడ్స్‌ లేదా వైట్‌ హెడ్స్‌ ఉన్నట్లయితే ఆవిరి పట్టిన తరువాత కొమెడోన్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ను ఉపయోగించి వాటిని తొలగించాలి. తరువాత గోరువెచ్చటి నీటిలో దూది ఉండను ముంచి దానితో ముఖాన్ని మెల్లగా తుడవాలి. ఆపైన టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌లలో ఒకదాన్ని ముఖానికి అప్లయ్‌ చేయాలి.

  • ముఖానికి ఎక్కువసేపు ఆవిరి పట్టకూడదు. అలాచేస్తే సహజ నూనెలు తొలగిపోయి చర్మం పొడిబారుతుంది. వారానికి రెండుసార్లు ఆవిరి పడితే ముఖంలోని కండరాలు విశ్రాంతి పొందుతాయి. చర్మానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. దీంతో ముఖం సహజకాంతితో ప్రకాశిస్తుంది.

ఇవి కూడా చదవండి

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్‌: తుమ్మల

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

Updated Date - Jul 01 , 2026 | 04:59 AM