Share News

భగవంతుడి ప్రసాదం

ABN , Publish Date - Jan 25 , 2026 | 04:46 AM

‘బలగం’, ‘డీజే టిల్లూ’.. ఈ చిత్రాలు తెలంగాణ పల్లె ప్రాంతం నుంచి వచ్చిన మురళీధర్‌ గౌడ్‌ అనే వ్యక్తి జీవితాన్ని మార్చేసి నటుడిగా బిజీ చేశాయి. తెరపై ఆయన్ని చూస్తుంటే...

భగవంతుడి ప్రసాదం

అతిథి

‘బలగం’, ‘డీజే టిల్లూ’.. ఈ చిత్రాలు తెలంగాణ పల్లె ప్రాంతం నుంచి వచ్చిన మురళీధర్‌ గౌడ్‌ అనే వ్యక్తి జీవితాన్ని మార్చేసి నటుడిగా బిజీ చేశాయి. తెరపై ఆయన్ని చూస్తుంటే మన ఇంట్లో వ్యక్తో, పక్కింటి బాబాయో గుర్తుకు వస్తారు. తనదైన అభినయంతో అలరిస్తున్న మురళీధర్‌ను ‘నవ్య’ పలుకరించింది.

రిటైర్‌ అవ్వగానే జీవితం అయిపోయిందని చాలామంది భావిస్తుంటారు. కానీ మీకు కొత్త జీవితం మొదలైంది!

భగవంతుడు నాకు రిటైర్‌మెంట్‌ ఇవ్వలేదు. సర్వీస్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత నువ్వు చేయాల్సింది ఇదీ అంటూ ఇంకో బాధ్యత అప్పగించాడు. ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ నుంచి రిటైర్‌ అయిన నేను ఇప్పుడు నటన అనే కొత్త జాబ్‌లో ఉన్నా. చాలా బాగుంది. ఇది నేను ఊహించిన జీవితమే. సినిమా ఆర్టిస్ట్‌ నవుతాననీ, మంచి క్యారెక్టర్‌ ఆర్టి్‌స్టగా పేరు తెచ్చుకుంటానని చిన్నతనం నుంచీ నమ్మాను. అది నిజమైనందుకు హ్యాపీగా ఉంది.

మీరు ఉద్యోగంలో ఉండగా ఈ ప్రయత్నాలు

చేయకపోవడానికి కారణం?

వృత్తిలో ఉంటూ సినిమాల మీద దృష్టి పెడితే, రెంటికీ చెడి దెబ్బ తింటాననే భయం ఉండేది. దానికి కారణం నా ఆర్థిక పరిస్థితులే. చిత్ర పరిశ్రమలో అవకాశాలు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చినా వాటి మీద ఆధారపడి బతకగలనా అని భయం వేసింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కదా.. చిన్నదో పెద్దదో జీతం ఉంది.. ఓ జీవితం ఉంది. అందుకే ధైర్యం చేయలేకపోయా.

నటించాలనే కోరిక ఎప్పుడు కలిగింది?

నిజం చెబితే నమ్మరు కానీ నాకు ఊహ తెలిసినప్పటినుంచీ ఉంది. అప్పట్లో మాస్టర్‌ రాము, ప్రభాకర్‌, బేబి రాణి.. ఇలా బాల నటులు ఉండేవారు కదా. వాళ్లు పోషించే పాత్రల్లో నన్ను ఊహించుకునేవాణ్ణి. అయితే నటనలో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నాకు గురువులంటూ కూడా ఎవరూ లేరు. నటన నాలో ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచి నేను నటుడిని అనే భావం ఉంది. దానిని సాకారం చేసుకోలేకపోవడానికి నా ఆర్థిక పరిస్థితులే కారణం. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ వెళ్లలేకపోయాను.


సినిమావాళ్ల దృష్టిలో ఎలా పడ్డారు?

దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ నన్ను ఎక్కడ చూశారో, నా నటనని ఎప్పుడు గమనించారో తెలీదు కానీ ‘పిట్టకథలు’ అనే వెబ్‌ సీరి్‌సలో అవకాశం ఇచ్చారు. రామచంద్ర అనే మాజీ ఎమ్మేల్యే పాత్ర నాది. వెబ్‌ సిరీస్‌ అప్పటికి అంత పాపులర్‌ కాలేదు కానీ సినిమావాళ్లు చాలా మంది దాన్ని చూశారు. జనం కూడా ఆ పాత్రతో నన్ను బాగా గుర్తు పట్టారు. ఆ తర్వాత తరుణ్‌భాస్కర్‌ పేటీయం యాడ్‌ చేస్తూ అందులో కూడా అవకాశం ఇచ్చారు.

33-Navya.jpg

అవకాశాల కోసం తిరిగిన సందర్భాలు ఉన్నాయా?

చాలా తిరిగాను. 2012లో సర్వీసు నుంచి రిటైర్‌ అయ్యాను. అప్పటినుంచి నటన మీదే దృష్టి పెట్టాలని ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద హీరోల చిత్రాల్లో నటించాలనీ, కనీసం కనిపించాలని 2017 నుంచి ఓ రెండేళ్ల పాటు తిరిగాను. ఒక్క ఛాన్స్‌ కూడా రాలేదు. ఇక అవకాశాలు రావు, ఎవరూ ఇవ్వరని నాకు నేనే నిర్ణయించుకుని టీవీ సీరియల్స్‌ మీద దృష్టి పెట్టాను. భగవంతుడి దయవల్ల నెలలో వారం రోజుల పని ఉండేది. అదే చాలు అని సరిపెట్టుకున్నా. అటువంటి సమయంలో తరుణ్‌భాస్కర్‌ నాకు ‘పిట్టకథలు’లో అవకాశం ఇచ్చారు. ఆయన వల్లే నాకు ‘డీజే టిల్లు’ చిత్రంలో హీరో సిద్ధు జొన్నలగడ్డకు తండ్రిగా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో చేస్తుండగానే ‘బలగం’లో నారాయణ పాత్ర లభించింది. ఈ రెండు చిత్రాలూ నా కెరీర్‌ను ఒక మలుపు తిప్పాయి. ‘డీజె టిల్లు’ చిత్రం ఒక తరం ప్రేక్షకులను అలరించగా, ‘బలగం’ చిత్రం తరాల అంతరం లేకుండా అందరినీ ఆకట్టుకుంది.

ఇప్పటివరకూ ఎన్ని సినిమాల్లో నటించారు?

దాదాపు ఎనభై చిత్రాలు చేశానండీ.

‘భగవంత్‌ కేసరి’ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది?

అదంతా దర్శకుడు అనిల్‌ రావిపూడి కల్పించిన అదృష్టం. అంతవరకూ నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర. అందులో నాకు అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. బాలకృష్ట వంటి టాప్‌ హీరో సినిమాలో నటించే తొలి అవకాశం. సరిగ్గా ఆ షూటింగ్‌ కమిట్‌ అయిన రోజునే మా తమ్ముడి కొడుకు పెళ్లి. అయినా మా తమ్ముడికి నచ్చజెప్పి షూటింగ్‌కు హాజరయ్యా. నాకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అది. ఆ తర్వాత నేను నటించిన మరో పెద్ద హీరో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సారి వెంకటేశ్‌తో కలసి నటించే అవకాశం కల్పించారు అనిల్‌ రావిపూడి. ఆయన సహృదయత వల్లే ఈ రెండు పెద్ద సినిమాల్లో నటించగలిగాను.


పరిశ్రమలో మీకు స్నేహితులు ఎవరు?

నేను మితభాషిని. నా కుటుంబ నేపథ్యం కావచ్చు. చేసిన ఉద్యోగం వల్ల కావచ్చు... చాలా రిజర్వుగా ఉంటాను. దూసుకుపోయే మనస్తత్వం కాదు నాది. ఇల్లు, షూటింగ్‌ లొకేషన్‌, డబ్బింగ్‌ స్టూడియో తప్ప మరో ప్రపంచం నాకు లేదు.సక్సె్‌సమీట్లు, ప్రీవ్యూ షోలు.. వంటి వాటికి కూడా ఎక్కువ అటెండ్‌ కాను. మీరు తప్పకుండా రావాలి అంటేనే వెళతాను.

కొత్తతరహా పాత్రలు చేయాలనే కోరిక ఉందా?

ఇప్పుడు వస్తున్న పాత్రలను భగవత్‌ ప్రసాదంలా భావించి చేస్తున్నాను. కానీ ఆర్టిస్టుగా చిరస్థాయిగా నిలిచిపోయే కొన్ని పాత్రలు పోషించాలని ఉంది. అటువంటి పాత్ర దొరికితే నన్ను నేను ప్రూవ్‌ చేసుకుంటాననే నమ్మకమూ ఉంది. ఎందుకంటే నేను ఒక మట్టి ముద్దను. దర్శకుడు ఎలా మలిస్తే అలా తయారవుతా. సమాజానికి ఉపయోగపడే పాత్రలు కూడా చేయాలని ఉంది. విడుదల కాబోయే నా చిత్రాల్లో ‘వెంకట్రామయ్యగారి తాలుకా’ లో చాలా మంచి పాత్ర పోషించా. అందులో టైటిల్‌ రోల్‌ నాదే. మధ్యతరగతి రైతు పాత్ర అది. నా మనసుకి బాగా నచ్చిన క్యారెక్టర్‌ అది.

వినాయకరావు,

ఫొటో: హరి ప్రేమ్‌

టీవీ సీరియల్స్‌లో నటిస్తేనే చాలు అనుకున్నవాడిని. సినిమాల్లో నటించడం సాధ్యం కాదేమో అనుకున్నాను. అవకాశాలు వచ్చాయి. నన్ను నటుడిగా బిజీ చేశాయి. చాలు ఇంతకంటే ఇంకేం కావాలి! నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారకులైన తరుణ్‌భాస్కర్‌, ‘బలగం’ వేణు, అనిల్‌ రావిపూడిలకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నా చిన్ననాటి స్నేహితులకన్నా, బంధువుల కన్నా నన్ను ఈ పొజిషన్‌లో చూసి నూటికి వెయ్యి శాతం సంతోషపడుతున్న వారు నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు. మనసునిండా వాళ్లు నన్ను ఆశీర్వదిస్తున్నారు.అభినందిస్తున్నారు, ఆనందిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 04:57 AM