బిలాముకు జ్ఞానోదయం
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:36 AM
దేవుడు సర్వాంతర్యామి. తన ఆదేశాలను, సందేశాలను వివిధ రూపాల్లో దాసులకు అందజేస్తూ ఉంటాడు. ఇలాంటి ఉదంతాలు బైబిల్‌లో పలుచోట్ల కనిపిస్తాయి. దేవుడు ఎవరికీ ప్రత్యక్షం కాకుండా...
దైవమార్గం
దేవుడు సర్వాంతర్యామి. తన ఆదేశాలను, సందేశాలను వివిధ రూపాల్లో దాసులకు అందజేస్తూ ఉంటాడు. ఇలాంటి ఉదంతాలు బైబిల్‌లో పలుచోట్ల కనిపిస్తాయి. దేవుడు ఎవరికీ ప్రత్యక్షం కాకుండా... కొందరు వ్యక్తులకు తన సంకల్పాన్ని తెలియజేసి... వారితో కావలసిన కార్యాలను చేయించేవాడు. దీనికోసం మూగ జీవులను కూడా ఉపయోగించేవాడు. జంతువులు మాట్లాడే ఇలాంటి ఘట్టాలు పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాయి. వాటిలో ప్రసిద్ధమైన కథ ఇది.
ఇశ్రాయేలీయుల్ని అరణ్యాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధతో దేవుడు కాపాడాడు. వారిని తన ఆజ్ఞకు బద్ధులుగా ఉంచుకొని, కంటికి రెప్పలా రక్షిస్తూ నడిపించాడు. ఆ పరిసరాల్లోని పాలకులందరూ ఇశ్రాయేలీయుల పట్ల ఆగ్రహంతో, అసూయతో ఉండేవారు. వారిలో మోయాబీయ పాలకులూ ఉన్నారు. మోయాబీయ రాజు బాలాకు... వారిని అణచివేయాలనుకున్నాడు. అయితే అందుకు తగిన సైన్యం అతనికి లేదు. ఎవరైనా మంత్రగాడిని తీసుకువచ్చి, శాపం ఇప్పిస్తే... వారు నేలమట్టమైపోతారని భావించాడు. బిలాము అనే ప్రవక్తను తన కోటకు పిలిపించాడు. ‘‘నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల్ని శపించాలి. నీకు కావలసినంత ధన కనక వస్తు సామగ్రి తీసుకో’’ అని చెప్పాడు. బిలాముకు ఆశ కలిగింది. ‘సరే’ అన్నాడు.
కానీ ఆ రాత్రి అతనికి కలలో దైవస్వరం వినిపించింది. ‘‘నీవు వెళ్ళవద్దు. ఇశ్రాయేలీయుల్ని శపించవద్దు. వారు నా ఆధీనంలో ఉన్నారు. ఏదో వంక చెప్పి ప్రయాణం ఆపుకో’’ అని ఆదేశించింది. అయితే అది ‘కలే కదా!’ అనుకున్నాడు బిలాము. తన ప్రయాణాన్ని ఆపలేదు. తన ప్రియ వాహనమైన గాడిద తనను సురక్షితంగా, వేగంగా కోరుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుస్తుందని అనుకున్నాడు. గాడిదను ఎక్కాడు. కానీ అది ప్రయాణమార్గంలో మూడుసార్లు రకరకాలుగా దారి తప్పింది. ‘ఇదేమిటి ఈ రోజు ఇలా ఉంది?’ అనుకున్నాడు బిలాము. దాన్ని చితకబాదాడు. ఆ గాడిద అరవడానికి బదులు మాట్లాడింది. ‘‘ఎప్పుడూ కొట్టనివాడికి, ఇలా కొడుతున్నావేమిటి?’’ అని అడిగింది. బిలాము ఆశ్చర్యపోయాడు. ‘‘నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? బాట తప్పానా?’’ అని గాడిద ప్రశ్నించేసరికి అతనికి మతి పోయింది. ‘దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఇలా జరిగిందా?’ అనుకున్నాడు. ఈలోగా దేవదూత కనిపించడంతో అసలు సంగతి అర్థమయింది.
తన వెంట ఉన్న మోయాబీయ అధికారులతో పాటు అతను ఇశ్రాయేలీయులను చేరాడు. వారిని శపించడానికి బదులు దీవించాడు.
‘‘మీకు సకల విజయాలు సమకూరుగాక’’ అని ఆశీర్వదించాడు. ‘‘దేవుడు మీతో ఉన్నాడు’’ అని ప్రకటించి ధైర్యం చెప్పాడు. మోయాబీయ ప్రతినిధులకు ఇది మింగుడుపడలేదు. వారు అగ్గిమీద గుగ్గిలమై వెనుతిరిగిపోయారు. పాలకుడు ఇవ్వజూపిన సంపదలకు ఆశపడి, ఇజ్రాయేలీయుల్ని శపించడానికి బయలుదేరిన బిలామును మార్చడానికి గాడిదతో దేవుడు మాట్లాడించిన అద్భుతమైన ఘట్టం ఇది. ఈ కథ నాలుగువేల ఏళ్ళ క్రితం జరిగింది.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest National News And Telugu News