Nina Singh IRS Officer Art Beyond Duty: కళతో కొత్త ప్రపంచంలోకి
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:20 AM
ఐఆర్‌ఎస్ అధికారిగా క్షణం తీరిక లేని ఉద్యోగం. సవాళ్లు, సమస్యల సమ్మిళితమైన వ్యక్తిగత జీవితం. కానీ... రెండిటినీ సమన్వం చేసుకొంటూ... అభిరుచికి పట్టం కట్టారు నీనా సింగ్. తన అనుభవాలను...
అభిరుచి
ఐఆర్‌ఎస్ అధికారిగా క్షణం తీరిక లేని ఉద్యోగం. సవాళ్లు, సమస్యల సమ్మిళితమైన వ్యక్తిగత జీవితం. కానీ... రెండిటినీ సమన్వం చేసుకొంటూ... అభిరుచికి పట్టం కట్టారు నీనా సింగ్. తన అనుభవాలను... అనుభూతులను కాన్వా్‌సపై ఆవిష్కరించి... కళతో కొత్త ప్రపంచాన్ని స్పృశించారు. పదవీ విరమణ పొందినా... కళతో సమాజంపై తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న నీనా అంతరంగం ఇది.
‘‘మనసులో ఎన్నో భావాలు. కంటికి కనిపించే మరెన్నో అద్భుతాలు. వాటన్నిటినీ మాటల్లో వర్ణించలేకపోవచ్చునేమో కానీ... కాన్వా్‌సపై రూపం ఇవ్వవచ్చు. కళతో మమేకమై సాగుతున్న ఇన్నేళ్ల ప్రయాణంలో... వెంటాడే అలాంటి మధుర స్మృతులు ఎన్నో. ఇప్పుడు నన్ను చూస్తున్నవారికి నా జీవితం ఆహ్లాదంగా, ఆనందమయంగా కనిపించవచ్చు. కానీ తరచి చూస్తే ఒడుదొడుకులు, ఒంటరి పోరాటాలు కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాది. మా నాన్నది కన్‌స్ట్రక్షన్ బిజినెస్ కావడంవల్ల ఎక్కడ ప్రాజెక్టు ఉంటే అక్కడకు మా నివాసం మారుతుండేది. దాంతో నా పాఠశాల విద్యాభ్యాసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాగింది. ఒక్కోసారి మారుమూల పల్లెలకు వెళ్లినప్పుడు ఆడపిల్లలకు హైస్కూల్స్ ఉండేవి కావు. ఎలాగో టెన్త్ పూర్తయింది. ఎన్ని మార్కులు వచ్చాయి? ఎలా చదువుతాను? తరువాత ఏమిటి? అనే ఆలోచన ఇంట్లో పెద్దలకు లేదు. ఒకరోజు నాన్నతో కలిసి మార్కెట్‌కు వెళితే, అక్కడ మా స్కూల్ ప్రిన్సిపాల్ ఎదురుపడ్డారు. నేను స్టేట్‌లో ఫస్ట్ వచ్చానని ఆవిడ మా నాన్నకు చెప్పారు. అప్పటివరకు ఆయన నేను ఎలా చదువుతానో కూడా తెలియదు. ఇంటికి వచ్చాక మా అమ్మకు చెబితే... ‘మనమ్మాయిని ఉన్నత చదువులు చదివిద్దాం’ అని అన్నది. అందుకు నాన్న ఒప్పుకున్నారు.
తాతగారి ఊళ్లో...
అయితే మేమున్న ఊరి బడిలో టెన్త్ వరకే ఉండేది. ఆపై చదవాలంటే వేరే ఊరు వెళ్లాలి. ఆగ్రాలో ఉన్న మా తాతయ్యకు అమ్మ ఉత్తరం రాసింది. ఆయన వచ్చి నన్ను తీసుకువెళ్లి స్కూల్లో చేర్పించారు. అలా పన్నెండో తరగతి పూర్తయ్యాక డిగ్రీలో చేరేముందు మళ్లీ అదే కథ. మళ్లీ అమ్మ పట్టుపట్టడంతో నన్ను డిగ్రీలో చేర్చారు. ‘చదువుతప్ప మరే ఆలోచనా ఉండకూడదం’టూ ఎన్నో కండిషన్లు పెట్టారు. అన్నిటికీ సరేనని చదువు కొనసాగించాను. డిగ్రీ అవ్వగానే పెళ్లి చేసేశారు. కానీ రెండేళ్లలోనే ఆ బంధం తెగిపోయింది. చేసేదిలేక పుట్టింటికి వెళ్లిపోయాను. సమాజం దృష్టిలో నేనొక విఫల మహిళగా మిగిలిపోయాను.

ప్రొఫెసర్ సలహాతో...
నా జీవితానికి సంబంధించి ఏ నిర్ణయమూ నా చేతుల్లో లేకుండాపోయింది. అన్నిటికన్నా అది నన్ను ఎంతో బాధించింది. మనోవేదనకు గురిచేసింది. ఆ సమయంలో మాజీ ప్రొఫెసర్ ఒకరు... ‘మీ అమ్మాయితో సివిల్స్ రాయించండి’ అని మా నాన్నకు సలహా ఇచ్చారు. నాన్న సరేనన్నారు. కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లాను. అప్పుడు అర్థమయింది... నాకంటూ ఒక జీవితం ఉందని. దాన్ని ఉన్నతంగా నేనే తీర్చిదిద్దుకోవాలని. జేఎన్‌యూలో మాస్టర్స్ చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమయ్యాను. ఎలాగైనా ర్యాంకు సాధించాలనే పట్టుదల. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ దాటాను. కానీ ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. అది నన్ను తీవ్ర నిరాశలోకి నెట్టింది. కోలుకోవడానికి కొంత కాలం పట్టింది. మరింత పట్టుదలతో మళ్లీ ప్రయత్నించి, సఫలమయ్యాను. అలా 1988లో ‘ఇండియన్ రెవెన్యూ సర్వీ్‌స’లో చేరాను.
కీలక బాధ్యతలు...
నా తొలి పోస్టింగ్ ముంబయిలో. ఆరు నెలలు తిరక్కుండానే ఎంతో కీలకమైన సినీ పరిశ్రమ ఆదాయ పన్నుల మదింపు బాధ్యత అప్పగించారు. సమాజంలో పేరు, ప్రతిష్ఠ, పలుకుబడి, బలమైన సంబంధాలు కలిగిన వ్యక్తుల సమూహం చిత్ర పరిశ్రమ. అలాంటిచోట బాధ్యతలంటే ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు ఉంటాయి. కెరీర్ ఆరంభంలోనే అంతటి బాధ్యతలు నాకు అప్పగించినా ఏనాడూ ఒత్తిడికి లోనుకాలేదు. చట్టం పరిధిలో నా పని నేను చేసుకొని వెళ్లిపోయాను. నా వృత్తిలో భాగంగా ఇలాంటి ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించాను. చివరకు 2022లో ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్’ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్‌గా పదవీవిరమణ పొందాను.
కళతో మమేకం...
ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకు మరొకరిని పెళ్లి చేసుకున్నాను. భర్త, పిల్లలతో జీవితం సంతోషంగా సాగిపోతుందనుకున్నాను. కానీ ఆ మధ్య అనారోగ్యంతో ఆయన మరణించారు. అది నన్ను కుంగదీసింది. ఈ విషాదం నుంచి త్వరగానే కోలుకున్నానంటే అందుకు కారణం... నా అభిరుచి. చిత్రకళ. వృత్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా నాలోని కళాకారిణిని కూడా సంతృప్తిపరుస్తూనే వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు చిత్రలేఖనంపై మక్కువ. తరచూ బొమ్మలు గీస్తుండేదాన్ని. ఆ అభిరుచి నాతోపాటే పెరుగుతూ వచ్చింది. కుదిరినప్పుడల్లా ఇంట్లో పెయింటింగ్స్ వేసేదాన్ని. వాటన్నిటితో కలిపి 2006లో ముంబయి జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో నా తొలి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాను. దానికి మంచి స్పందన లభించింది. అక్కడి నుంచి దేశవిదేశాల్లోని ప్రముఖ గ్యాలరీల్లో నా కళను ప్రదర్శించాను. ఈ క్రమంలో ప్రముఖ చిత్రకారుల ప్రశంసలు, పలు సంస్థల నుంచి అవార్డులు కూడా అందాయి. అనుభవాలు, మనసులోని భావాలు, భావోద్వేగాలు, మనల్ని ప్రభావితం చేసే సామాజిక అంశాలు... ఇవే నా పెయింటింగ్స్‌లో ప్రతిబింబిస్తాయి.’’
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
Read Latest AP News And Telugu News