Share News

Bhagavad Gita: అర్జునుడిది పాపభీతా భయమా

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:02 AM

తనకు అత్యంత ఇష్టుడైన అర్జునుడు ‘నా చేతుల్తో ఇంతమందిని చంపాలా?’ అని తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనై, ‘‘చేతులు వణుకుతున్నాయి కృష్ణా!’’ అంటూ ఉంటే... ఓదార్చి, ధైర్యం చెప్పి, మార్గం చూపాల్సిన...

Bhagavad Gita: అర్జునుడిది పాపభీతా భయమా

భగవద్గీత

తనకు అత్యంత ఇష్టుడైన అర్జునుడు ‘నా చేతుల్తో ఇంతమందిని చంపాలా?’ అని తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనై, ‘‘చేతులు వణుకుతున్నాయి కృష్ణా!’’ అంటూ ఉంటే... ఓదార్చి, ధైర్యం చెప్పి, మార్గం చూపాల్సిన కృష్ణుడు కిసుక్కున నవ్వడం ఏమిటి? అంతటి ఉద్విగ్నమైన సన్నివేశంలో అసలు ఎందుకు నవ్వాలని అనిపించింది?

అప్పటికే అర్జునుడి విషాదయోగం అంతటినీ నిశ్శబ్దంగా విన్నాడు కృష్ణుడు. నీలాంటి గొప్పవారికి ఇలాంటి కుంగుబాటు రాకూడదని కూడా మందలించాడు.

క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప

‘‘ఇది నీకు సరికాదు అర్జునా... పిరికితనాన్ని దగ్గరకు రానివ్వకు. యుద్దానికి సిద్దంగా ఉన్న సమయంలో ఇవేం మాటలు’’? అంటూ... ‘‘ఇదేమీ వేదాంతం కాదు... పిరికితనం’’అని కూడా అన్నాడు.

ఉన్నది అదొక్కటే

1897లో.. కలకత్తాలోని అలంబజారులో ఉన్న రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద ప్రతిరోజూ వేదాంతం గురించి యువకులకు పాఠాలు చెప్పేవారు. ‘‘నేను చేసేది పాపం కాదా! అన్న అర్జునుడికి ఈ శ్లోకంతో ధైర్యవచనాలు పలికాడు కృష్ణుడు. ఈ ఒక్క శ్లోకం చాలు... గీతాపారాయణం చేసిన ఫలం లభిస్తుంది. గీతాసందేశం అంతా ఈ ఒక్క శ్లోకంలోనే ఇమిడి ఉంది’’ అంటారు స్వామి వివేకానంద. ‘నేను పాపిని. దేహదోషాపన్నుడిని, మనోవ్యధితుణ్ణి’ అనే తలపే నిన్ను ముంచేస్తోంది. లోకంలో పాపం లేదు, దైన్యం లేదు, వ్యాధి లేదు, విషాదం లేదు. లోకంలో పాపం అనదగినది ఏదైనా ఉంటే అది భయం మాత్రమే. ఇక్కడ అర్జునుణ్ణి ఆవహించినది సత్వగుణ ప్రేరేపితమైన ధోరణి కాదు. ఇది తమోగుణ ప్రభావం. సత్వగుణ వేషంలో తనను అమర్చుకోవడం అంటే తమోగుణానికి ఎంతో ఇష్టం. అందుకే అర్జునుడిలోని తమోగుణం... వేదాంతం చెబుతున్నట్టు, సర్వసంగపరిత్యాగి, జ్ఞాని, పండితుడు మాట్లాడినట్టు బహిర్గతం అవుతోంది. అర్జునుడి యుద్ధ విముక్తి ఆలోచనకు కారణం... తమోగుణమైన భయం. ఆ భయాన్ని భక్తి ముసుగులో దాచి... ‘‘భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి నేనెలా చంపగలను? వారిద్దరూ నాకు పూజ్యులు కదా!’’ అంటాడు అర్జునుడు. నిజానికి ‘భీష్మ ద్రోణుల్ని నేను ఓడించగలనా?’ అనేది అర్జునుడి భయం. ‘ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంతమందిని ఓడించినా... భీష్ముడు, ద్రోణుడు అరివీరభయంకరులు. సర్వాస్త్ర సంపన్నుడైన భీష్ముడు, సకల యుద్ధ విద్యలూ ఆపోశన పట్టిన ద్రోణాచార్యుడు నిజంగా నన్ను ఓడించాలనుకుంటే నేను తట్టుకోగలనా?’... ఈ భయం అర్జునుణ్ణి కంపింపజేసింది. దానికి ‘పాపభీతి’ అనే పేరు తగిలించుకున్నాడంతే!


గీత... హింసను ప్రేరేపిస్తోందా?

అందుకే కృష్ణుడికి నవ్వు వచ్చింది. ‘నేను యుద్ధం గెలవలేనేమో’ అనే భయం... అర్జునుడితో గొప్పగొప్ప మాటలు పలికించింది. ‘‘పెద్ద పండితుడిలా, మహాజ్ఞానిలా మాట్లాడుతున్నావే అర్జునా... బ్రతికి ఉన్నవాడి గురించి కానీ, మరణించినవాడి గురించి కానీ నిజంగా పండితులైనవారు అసలు బాధేపడరు’’ అంటూ మొదలుపెట్టాడు కృష్ణుడు. ‘నేను యుద్ధం చేయను’ అన్న అర్జునుణ్ణి యుద్ధోన్ముఖుడిగా చేయడం హింసను ప్రేరేపించడంగా భావించేవారు అనేకులు ఉన్నారు. ఒకప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ ఆసియా మీద తాను రాసిన పుస్తకంలో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. హింస నేను చేయలేనని అహింసావాదిగా మారబోతున్న అర్జునుణ్ణి హింసవైపు ప్రేరేపించిన ‘భగవద్గీత’ అనే భారతీయులు అధికంగా చదివే గ్రంథం... నిత్యం అహింసను బోధించే మహాత్మాగాంధీకి ప్రేరణ ఎలా అయిందో... బుర్ర ఎంత బద్దలుగొట్టుకున్నా కిసింజర్‌కు అర్థం కాలేదు.

మానవ జీవితానికి దిక్చూచి

మహాభారతంలోనే... అనుగీత, ఉద్ధవగీత కూడా శ్రీకృష్ణుడు చెప్పినవే. కానీ భగవద్గీత మొత్తం మానవ జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఎవరి వ్యాఖ్యానం చదవాలి? మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రాజగోపాలాచారి లాంటి ఆనాటి నాయకులు రాసినవా? శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్యాచార్యుడు, స్వామి ప్రభుపాద లాంటి గురువులు రాసినవా? ఏది చదివితే సరిగ్గా కృష్ణుడు చెప్పిన విధంగా గీత మనకు అర్థమవుతుంది? ఈ ప్రశ్నకు కూడా కృష్ణుడే గీతలో సమాధానం చెప్పాడు. అది కూడా... మనందరికీ సులువుగా అర్థమయ్యేలా చెప్పాడు.

ప్రతి వ్యక్తి తన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కృష్ణుడు స్పష్టం చేశాడు. అంటే పరిస్థితులనుబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే!

ఉండవల్లి అరుణ్‌కుమార్‌

ఇవి కూడా చదవండి...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 01:02 AM