Share News

కోపమే శత్రువు

ABN , Publish Date - May 15 , 2026 | 02:33 AM

కోపం అనేది మానవ సహజమైన భావోద్వేగం. కానీ అది నియంత్రణలో ఉండాలి. కోపం ఎక్కువైతే మనలో ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. చిన్న విషయానికే కోపగించుకుంటే సంబంధాలు...

కోపమే శత్రువు

సందేశం

కోపం అనేది మానవ సహజమైన భావోద్వేగం. కానీ అది నియంత్రణలో ఉండాలి. కోపం ఎక్కువైతే మనలో ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. చిన్న విషయానికే కోపగించుకుంటే సంబంధాలు దెబ్బతింటాయి. కోపంలో మాట్లాడిన మాటలు ఇతరులకు బాధ కలిగిస్తాయి. సమాజంలో జరుగుతున్న అనేక అనర్థాలకు కోపమే కారణం అంటే అతిశయోక్తి కాదు. తన ‘కోపమె తన శత్రువు’ అన్నారు పెద్దలు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. లోతుగా శ్వాస తీసుకోవడం కోపాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. శాంతంగా ఆలోచిస్తే సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. కోపాన్ని ప్రేమగా మార్చగలిగితే జీవితం అందంగా మారుతుంది. మంచి మాటలు, మంచి ప్రవర్తన కోపాన్ని దూరం చేస్తాయి. కోపాన్ని జయించడమే విజయానికి ముందడుగు. మరి ఆ కోపాన్ని ఎలా జయించాలి?

దానికి దైవప్రవక్త మహమ్మద్‌ ఒక ఉపాయం చెప్పారు. కోపం వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకోవాలంటే... మనిషి తాను ఉన్న చోటునుంచి పక్కకు జరగాలి. అంటే ఆ చోటును వదిలేయాలి. నిలబడి ఉంటే కూర్చోవాలి. కూర్చొని ఉంటే పడుకోవాలి. అలా చేయడం వల్ల కోపం అదుపులోకి వస్తుంది. అప్పటికీ కోపం తగ్గకపోతే... ‘వుజూ’ చేయాలి. అంటే ప్రార్థనా నియమానుసారం చేతులు, ముఖం, కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే ఆగ్రహం సైతాన్‌ ప్రేరణ వల్ల కలుగుతుంది. సైతాన్‌ సృష్టి అగ్నితో జరిగింది. అగ్ని నీటితో ఆరుతుంది. కాబట్టి సైతాన్‌ ప్రేరణ వల్ల కలిగిన ఆగ్రహం చల్లారాలంటే... నీటిని ఉపయోగించాలి. ‘వుజూ’ చేయాలి. అలా చేస్తే తప్పకుండా కోపం మాయమవుతుందని దైవప్రవక్త చెప్పారు.


మానవమాత్రులెవరూ కోపానికి అతీతులు కాదు. కానీ కోపంలో విచక్షణ కోల్పోకపోవడమే గొప్పతనం. కోపానికి లోనై జుట్టు పీక్కోవడం, చిర్రుబుర్రులాడడం, అయినదానికీ, కానిదానికీ అందరిమీదా విరుచుకుపడడం, చేతిలో ఉన్న వాటిని విసిరి కొట్టడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, దుర్భాషలాడడం... ఇవన్నీ ఉన్మాద చేష్టలు. మానవ ఔన్నత్యం ఏమాత్రం శోభించని లక్షణాలు. కోపాన్ని ఎప్పుడూ మనకన్నా బలహీనులపైనే ప్రదర్శిస్తాం. బలవంతులపై ఆగ్రహిస్తే కలిగే పరిణామాలు మనకు తెలుసు. అందుకే భార్యాబిడ్డల మీదా, మనకన్నా కింది స్థాయి వారిమీదా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ అందరికన్నా బలవంతుడైన దైవం ఉన్నాడనీ, ఆయన ముందుకు ఏదో ఒక రోజు హాజరు కావలసిందేననీ, ఆయన అందరి మనోస్థితులు తెలిసిన సర్వజ్ఞాని అని గ్రహించి మసలుకుంటే ఎలాంటి అనర్థాలూ ఉండవు. కోపానికి దూరంగా ఉంటే జీవితమంతా సంతోషమే. ‘‘కుస్తీలో ప్రత్యర్థిని మట్టి కరిపించేవాడు వీరుడు కాదు. కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా నిగ్రహించుకున్నవాడే అసలైన వీరుడు’’ అని దైవప్రవక్త చెప్పారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 15 , 2026 | 02:33 AM