చైనాలో శివకేశవులు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:46 AM
చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న కైయువాన్ ఆలయ సముదాయం ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రకంగానూ ఎన్నో విశేషాలకు నిలయం. 78 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న కైయువాన్ టెంపుల్...
ఆలయ దర్శనం
చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న కైయువాన్ ఆలయ సముదాయం ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రకంగానూ ఎన్నో విశేషాలకు నిలయం. 78 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న కైయువాన్ టెంపుల్... ఫుజియాన్ ప్రావిన్స్‌లో అతి పెద్ద బౌద్ధాలయం. దీన్ని మొదటగా క్రీస్తుశకం 685 -686 మధ్య నిర్మించారనీ, ఆ తరువాత పలుసార్లు పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. రెండు పగోడాలతో, విశాలమైన మందిరాలతో విలసిల్లే ఈ ప్రదేశం... ఇప్పుడు హిందువులను కూడా ఆకర్షిస్తోంది.
కైయువాన్ ప్రాంతంలో 1920, 1960ల మధ్య కాలంలో నిర్వహించిన తవ్వకాల్లో అనూహ్యమైన కళాఖండాలు బయటపడ్డాయి. పూర్వకాలం నాటి మందిరపు అవశేషాల్లో హిందూ దేవతల చిత్రాల్ని చెక్కిన స్తంభాలు, గోడలు దర్శనమిచ్చాయి. వాటన్నిటిలో అపురూపమైనది... ఒక ఏనుగు భక్తిగా శివలింగంపై నీటిని తొండంతో అభిషేకిస్తున్న శిల్పం. అంతేకాదు... హిరణ్యకశిపుణ్ణి చీలుస్తున్న నారసింహుడు, గజేంద్ర మోక్ష ఘట్టం, గోపికా వస్త్రాపహరణం, కాళీయ మర్దనం... ఇలా పలు శిల్పాలను పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీశారు. ఒకప్పుడు ఈ మందిరం శివకేశవులకు నిలయం అనీ, ఆ శిల్పాలు క్రీస్తుశకం 1300 సంవత్సరం నాటివని నిర్ధారించారు. చోళ, పల్లవ రాజుల కాలం నాటి శైలిని ప్రతిబింబిస్తున్న ఈ శిల్పాలను చెక్కినవారు దక్షిణ భారతదేశానికి చెందిన వారనేది స్పష్టంగా తెలుస్తోంది.
మధ్యయుగంలో.. దక్షిణ భారతదేశానికి, చైనాకు మధ్య వాణిజ్య సంబంధాలు ఉండేవి. తెలుగు, తమిళ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు అప్పట్లో రద్దీగా ఉండే సిల్క్ రూట్ మీదుగా రాకపోకలు సాగించేవారు. కొందరు అక్కడే స్థిరపడ్డారు. వారు కేవలం సరుకులనే కాదు... మన సంప్రదాయాలను, దేవతలను, కళావైభవాన్ని కూడా అక్కడకు తీసుకువెళ్ళారని ఈ మందిరం, అందులోని శిల్పాలు నిరూపిస్తున్నాయి. మధ్యయుగంలో భారతదేశం, చైనా మధ్య పెనవేసుకున్న అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ అపురూప శిల్పాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చైనాలో పర్యటించే భారతీయులు కూడా ఈ సముదాయాన్ని పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు.
లిడియా లక్ష్మి, చైనా.
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest National News And Telugu News